Monday, April 29, 2024

టోకెన్ల కోసం కుస్తీ.. వడ్లు అమ్ముకునేందుకు నరకయాతన..

(ప్రభన్యూస్‌ బ్యూరో/ఉమ్మడినల్గొండ): ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు- చేస్తాం.. రైతు పండించిన ప్రతిగింజ కొంటాం.. ఎవరూ ఇబ్బంది పడొద్దు.. అధైర్యం చెందొద్దు.. రైతులకు భరోసా కలిపించిన సర్కారు. కొనుగోలు కేంద్రాలు ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నారు.. ఇబ్బడిముబ్బడి ధాన్యం మార్కెట్లోకి వస్తుంది.. ఓపక్క వర్షసూచనలు ఉండటంతో రైతులు ధాన్యం అమ్ముకునేందుకు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. ఆరుగాలం కష్టపడి ధాన్యం పండించిన రైతుకు అమ్ముకునే సమయంలో నానాయాతన పడుతున్నారు. ప్రతిసారి ఇదే విధమైన ఇబ్బందులతో నరకం చూస్తున్నారు. అయితే వడ్లు పండించుడు ఒక ఎత్తయితే అమ్ముకోవడం పెద్ద ప్రహసనమైంది. రైతుల ఇబ్బందులు.. అవసరాలు ఆసరాగా తీసుకొని మిల్లర్లు కుమ్మ-కై- దోచుకుంటు-న్నారు.

ప్రభుత్వ మద్దతు ధర కంటే 300రూపాయల నుండి 400రూపాయల వరకు తక్కువకు కొంటూ రైతులతో ఆడుకుంటు-న్నారు. ఇష్టమైతే అమ్ముకోండి.. లేదంటే వెళ్లిపోండి.. మేము పెట్టేది అదే ధర అంటూ మిల్లర్లు ఖరాఖండిగా చెపుతూ రైతులను నిలువునా ముంచుతున్నారు. యాసంగి పంట వేసేందుకు సమయం ఆసన్నం కావడం.. డబ్బులు లేనిదే బండి ముందుకు సాగే అవకాశాలు లేకపోవడంతో తెగనమ్ముకుంటు-న్నారు. ఇవ్వన్నీ ఇలా ఉంటే సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో వడ్లు ఒకేసారి మార్కెట్‌ లోకి రావడంతో రైతులు కోసిన వెంటనే ధాన్యం ట్రాక్టర్‌ లతో మిల్లులకు తరలిస్తున్నారు.

మిర్యాలగూడ, హుజుర్‌ నగర్‌ మిల్లులకు రోజుకు ఐదారు వందల ట్రాక్టర్లల ధాన్యం వస్తుంది. ఇలా పదిహేను నుండి 20రోజుల పాటు- మార్కెట్‌ కు రానుంది. ఒక్కసారిగా రైతులు ధాన్యంతో తరలిరావడంతో మిల్లర్లు ఇదే అదునుగా కృత్రిమ కొరత సృష్టిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ధాన్యం క్వింటా ఏగ్రేడ్‌ 1960రూపాయలు.. సాధారణ రకం 1940రూపాయలుగా మద్దతు ధర నిర్ణయించారు. అయితే ఎక్కడ కూడా మద్దతు ధర ఇవ్వడం లేదు. ఏదో సాకు చూపుతూ మిల్లర్లు క్వింటా 1600రూపాయల వరకే కొంటు-న్నారు. మిల్లర్లు విపరీతంగా దోచుకుంటు-న్నా అధికారులు మాత్రం మద్దతుధర ఇచ్చే పోస్టర్లు విడుదల చేసే పనిలో వున్నారే తప్పా అమ్మకాలపై కన్నేసి మద్దతు మాత్రం ఇప్పించడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించి తక్కువకే అమ్ముకోవాల్సి వస్తుందని మదనపడుతున్నారు. పెట్టిన పెట్టు-బడులు వెళ్లేందుకే శ్రమించాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.

రైతులు పండించిన పంటను అమ్ముకునేందుకు నానాఅవస్థలు పడుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడం.. మిల్లర్లు కొనకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. పంటను అమ్ముకునేందుకు టోకెన్ల పద్దతి పెట్టారు. వ్యవసాయ అధికారులు టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. ఈటోకెన్ల కోసం పాస్‌ పుస్తకాలు, ఆధార్‌ కార్డులు పట్టు-కొని పడిగాపులు కాస్తున్నారు. రోజుకు తక్కువ మొత్తంలోనే ఇస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురుకొంటు-న్నారు. టోకెన్లు తీసుకోవడం ఓప్రహసనం.. అమ్ముకోవడం కోసం పెద్ద కుస్తీ తప్పడంలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement