Sunday, May 5, 2024

ఓయూకి రాహుల్‌ ఎందుకు రాకూడదు…?

ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులను కలవడానికి తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ.. రాహుల్‌ గాంధీని తీసుకెళ్లడానికి నిర్ణయించింది. ఏ కారణం వల్ల అయితేనేమి విశ్వవిద్యాలయ పాలకమండలి (వి.సి, ఇద్దరు ముగ్గురు ఐఎఎస్‌ అధికారులు) అనుమతి నిరాకరించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత ఎనిమిదేళ్లలో పూర్తిస్థాయి పాలకమండలులే లేవు. ఇప్పటి ఐఎఎస్‌ అధికారులలో గతంలో లాగా బిపిఆర్‌ విఠల్‌, ఎస్‌ఆర్‌ శంకరన్‌, యుగంధర్‌, కెఆర్‌ వేణుగోపాల్‌ వంటి అవగాహన ఉన్నవాళ్లు చాలా తక్కువ. ప్రజాస్వామ్య వ్యవస్థలో విశ్వవిద్యాలయం పాత్ర గాని లేదా ప్రజాస్వామ్య వ్యవస్థ పరిణామం కాని పూర్తిగా తెలిసినవాళ్లు కూడా చాలా తక్కువే. వాళ్లలో చాలామందికి అధికారమే జ్ఞానమై కూర్చుంది (పవర్‌ ఈజ్‌ నాలెడ్జ్‌). రాహుల్‌ గాంధీ విశ్వవిద్యాలయానికి రావడానికి పాలకమండలికి అభ్యంతరమేమిటో అర్థం కాదు. ఒక జాతీయ పార్టీ నాయకుడు విద్యార్థులతో కలుస్తామనడమే చాలా అరుదు. ఆయన వస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందని ముందే ఊహించి ఈ నిర్ణయం తీసుకుంటే అంతకంటే విషాదం మరొకటి ఉండదు. రాజకీయ కారణాల వల్ల నిర్ణయం తీసుకుంటే అంతకంటె పెద్ద పొరపాటు ఉండదు.

మేం ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులుగా ఉన్నప్పుడు జరిగిన రెండు సంఘటనలను ఈ సందర్భంలో పేర్కొనాలి. రాంమనోహర్‌ లోహియాని అప్పటి విద్యార్థి సంఘ నాయకుడు జైపాల్‌ రెడ్డి ఆహ్వానించాడు. అప్పటి ప్రభుత్వం దానికి అభ్యంతరం చెప్పినా ఇది విద్యార్థి సంఘ నిర్ణయమని, ఈ మీటింగ్‌ ఎన్ని అభ్యంతరాలున్నా జరిపి తీరుతామని లోహియాని ఆర్ట్స్‌ కాలేజీకి తీసుకొచ్చారు. ఆయన ప్రసంగం వినడానికి పెద్దసంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. లోహియా దాదాపు గంటసేపు హిందీలో ధారాళంగా మాట్లాడారు. విద్యార్థులందరూ నిశ్శబ్దంగా ఆ ప్రసంగాన్ని విన్నారు. ఆ అనుభవం వల్లే కావచ్చు జైపాల్‌రెడ్డి జీవితమంతా ప్రజాస్వామ్య విలువలని గౌరవించాడు. ఆయన రాసిన ‘పది సిద్ధాంతాలు’ అనే పుస్తకమే దానికి సాక్ష్యం. విద్యార్థి దశలో ప్రజాస్వామ్య విలువలు భిన్న భావజాలాలను వినాలనే సంస్కారం విద్యార్థులకు అలవడితే వాళ్ళే రేపు రాజకీయ నాయకులుగా ప్రజాస్వామ్య పటిష్ఠతకు దోహదపడతారు. మా అభిప్రాయం తప్ప, మా విశ్వాసాలు తప్ప, ఇతర భావాలను వినం అని మేధోపరంగా ఎదుగుతున్న దశలో భావిస్తే వాళ్ళు తరువాత కాలంలో నియంతృత్వాన్ని ప్రోత్సహిస్తారు. నేను కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు విద్యార్థి సంఘం ఎన్నికల్లో రాడికల్‌ విద్యార్థి సంఘం గెలిచింది. నేను వాళ్ళకు సలహాదారుగా ఉండేవాడిని. అప్పుడు రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ ప్రముఖుడు బాలాసాహెబ్ దేవరస్‌ను విద్యార్థులనుద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తే, అప్పుడు తనకు సమయం లేదని మరెప్పుడైనా వస్తానని అన్నారు. సంతోషిమార్గ్‌ నాయకుడెవరో వస్తే ఆయన ప్రసంగాన్ని నిర్వహించాం. విద్యార్థులు చాలా ప్రశ్నలు అడిగారు. ప్రసంగం తర్వాత ఆయన నాతో మీ విద్యార్థులు చాలా మౌలికమైన ప్రశ్నలు అడిగారు అన్నాడు. అలాగే హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఎబివిపి వారు అరుణ్‌శౌరిని పిలిచారు. అప్పటికే ఆయన చాలా వివాదాస్పదమైన పుస్తకం ఒకటి రాసి ఉన్నాడు. ఆ సంఘం నిర్వహించిన ఆ ప్రసంగానికి వాళ్ల కోరిక మేరకు నేనే అధ్యక్షత వహించాను. అధ్యాపకుడికి తన ప్రాపంచిక దృక్పథం, తన విశ్వాసాలుంటాయి, ఉండాలి కూడా. కానీ విశ్వవిద్యాలయంలో అన్ని దృక్పథాలకీ చోటు ఉండాలి. విశ్వవిద్యాలయ అధికారులు, అన్ని విద్యార్థి సంఘాలు ఈ ప్రమాణాన్ని పాటించాలి. భావ పోరాటం భౌతిక ఘర్షణగా మారకుండా వాళ్ళే ఆ క్రమశిక్షణను పాటించాలి.

విశ్వవిద్యాలయాల మీద తమ నియంత్రణ ఉండాలని మూడు వ్యవస్థలు బలంగా కోరుకుంటాయి. ఒకటి– మతం, రెండు– రాజ్యం, మూడు– మార్కెట్‌. ఈ మూడూ కూడా స్వభావ రీత్యా నిర్బంధం మీద ఆధారపడి ఉంటాయి. పాశ్చాత్య సమాజాలలో మతం పాత్ర ప్రజాజీవనంలో చాలావరకు తగ్గి అది వ్యక్తిగత విశ్వాసంగా మిగిలిపోయింది. అందుకే గురజాడ ‘‘మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటె మిగిలి వెలుగును’’ అన్నాడు. ఆధునిక రాజ్య అధికారం రాజ్యాంగాల ద్వారా చట్టాల ద్వారా రావడం వలన పాలకులు ఇష్టారాజ్యంగా నడచుకోవడానికి హద్దులు నిర్ణయించబడ్డాయి. చట్టం ప్రాధాన్యత పాత్ర పెరిగినకొద్దీ, అదే చట్టం జ్ఞానాన్వేషణకు స్వతంత్ర స్థానముండాలని, రాజ్యం పాత్ర విశ్వవిద్యాలయాలకు కావలసిన సౌకర్యాలు కల్పించడం తప్ప ఇతర అంశాలు పూర్తిగా విశ్వవిద్యాలయాలకు వదిలివేయాలనే ఉన్నతమైన విలువల నుంచి సంస్థలు స్వయంపాలక సంస్థలుగా ఎదిగాయి.

విశ్వవిద్యాలయాలు ప్రభుత్వాల ఆజ్ఞలతో కాక శాసనసభలు, పార్లమెంట్‌ ద్వారా ఏర్పడతాయి. శాసనసభ, పార్లమెంటు తమ అధికారాలను ప్రజల సార్వభౌమాధికారం నుంచి పొందుతాయి. విశ్వవిద్యాలయాలకు కూడా స్వేచ్ఛ ఈ సార్వభౌమాధికారం నుంచి రావడం వల్ల, విశ్వవిద్యాలయాలు ప్రభుత్వాలకు జవాబుదారీ కంటె, సమాజానికి జవాబుదారీగా ఉండాలి. జ్ఞానం అంతిమంగా సమాజ అభివృద్ధికి, సామాజిక మార్పునకు దోహదపడాలి. మార్కెట్‌లను స్వప్రయోజనం నడుపుతుంది, ఇప్పుడైతే పూర్తిగా స్వార్థం నడుపుతున్నది. విశ్వవిద్యాలయాలు తమ డిమాండ్లకు అనుకూలంగా పరిశోధనలు చేయాలని బలంగా ఒత్తిడి పెడుతుంటాయి. మార్కెట్ల కొరకు జరిగే పరిశోధనలు బలవంతులైన సంపన్నులైన వారి లాభాలకు పనికొస్తాయి కాని సార్వజనీన ప్రయోజనాలకు కాదు. కొవిడ్‌ లాంటి భయంకరమైన జబ్బుకు వాక్సిన్‌ కనుకున్నప్పుడు అది లాభాల కొరకు కాక ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. కొవిడ్‌ వాక్సిన్‌ ప్రైవేటు ల్యాబ్‌లలో కనుక్కోవడం వల్ల ప్రభుత్వం కొంతకాలం గందరగోళంలో పడింది. ఇక ప్రకృతి మూలసూత్రాల మీద జరిగే పరిశోధన నుంచి లాభాలు రావు. అలాంటి పరిశోధనే జ్ఞాన విలసిల్లతకు తోడ్పడుతుంది. మార్కెట్‌కు అలాంటి పరిశోధనల్లో ఆసక్తే ఉండదు. ఇక సామాజిక, మానవీయ శాస్త్రాలు మరింత సున్నితమైన అంశం. సామాజిక శాస్త్రాలు అధికారాన్ని ప్రశ్నిస్తాయి. అధికారపు మూలాలని పరిశోధిస్తాయి. సామాజిక చలన సూత్రాలను విశ్లేషిస్తాయి. అందుకే దాదాపు ప్రారంభదశలోనే ఈ విలువల కొరకు సోక్రటీస్‌ ప్రాణత్యాగం చేయవలసి వచ్చింది. శాస్త్రీయ జ్ఞానం పెరిగిన కొద్దీ సామాజిక జ్ఞానం సమాంతరంగా వికాసం చెందవలసి ఉంటుంది. ఒక ఉదాహరణ తీసుకుంటే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కట్టలు తెంచుకుని పెరిగితే ఒక బిల్‌గేట్స్‌ అత్యంత సంపన్నుడు కావచ్చు. ఆ సాంకేతిక జ్ఞాన అభివృద్ధి పర్యవసానంగా మానవ సంబంధాలు తీవ్ర సంక్షోభంలో పడితే వాటి కార్యకారణ సంబంధాలను సామాజిక శాస్త్రాలు, మానవీయ శాస్త్రాలు పరిశోధిస్తాయి. జ్ఞానం సమగ్రంగా ఎదగాలి.

ఈ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయమే కాదు, దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తిని కాపాడితే తప్ప మన దేశం మానవ జ్ఞానాభివృద్ధికి దోహదపడలేదు. ఇక విశ్వగురు స్థానం ఎలా వస్తుంది? స్వయంప్రతిపత్తి అంటే జవహర్‌లాల్‌ నెహ్రూ వ్యాఖ్యానించినట్లు విశ్వవిద్యాలయాలు భావాల సంఘర్షణ కేంద్రాలుగా ఉండాలి. ఏ సమాజంలోనైనా ఏ కాలంలోనైనా మానవ సమాజాలు ప్రత్యామ్నాయ వ్యవస్థల గురించి చర్చిస్తుంటాయి. సామాజిక మార్పు మీద, భవిష్యత్తు మీద మెరుగైన, మానవీయమైన సమాజ నిర్మాణాల మీద నిరంతరంగా చర్చ జరుపుతుంటాయి. ఈ చర్చ చాలా అవసరం.

- Advertisement -

ఉస్మానియా విశ్వవిద్యాలయం స్వాతంత్ర్యోద్యమ కాలం నుంచి భావ ఘర్షణకి, ఉద్యమాలకి ఒక కేంద్రం లాంటిది. గతంలో ఉస్మానియాకు జాతీయంగా అత్యంత ప్రతిష్ఠ ఉండేది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉస్మానియా లేకుంటే దాదాపు ఉద్యమమే ఉండేది కాదు. ఇంత పెద్ద రాజకీయ ఉద్యమ అనుభవం ఉన్న ఈ సంస్థకి, తెలంగాణ ఏర్పాటులో నిర్ణయాత్మక పాత్ర నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ ప్రముఖ నాయకుడికి మాట్లాడే అవకాశమే ఇవ్వకపోవడం విశ్వవిద్యాలయ చరిత్రకి అన్యాయం. ఇది దీర్ఘకాలంలో స్వయంప్రతిపత్తిని, జ్ఞానాభివృద్ధిని, రాజకీయ పరిణతిని, అన్నిటికంటె మించి ప్రజాస్వామ్యాన్ని తీవ్ర ప్రమాదంలో పడేస్తుంది.

ప్రొ. జి. హరగోపాల్

Advertisement

తాజా వార్తలు

Advertisement