Thursday, April 25, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 71
71
విహాయ కామాన్‌ య: సర్వాన్‌
పుమాంశ్చరతి ని:స్పృహ: |
నిర్మమో నిరహంకార:
స శాంతిమధిగచ్ఛతి ||

తాత్పర్యము : ఇంద్రియ భోగానుభవ కోరికలనన్నింటినీ త్యజించి నిష్కామునిగా జీవించుచు, మమకారము మరియు మిథ్యాహంకారములను వదిలిపెట్టినవాడు మాత్రమే నిజమైన శాంతిని పొందగలుగును.

భాష్యము :కోరికలు లేకపోవటము అంటే ఇంద్రియ తృప్తికోసము దేనినీ కోరుకోకపోవటము. అనగా కృష్ణ చైతన్యవంతులు అవ్వాలని కోరుకోవటమే కోరికలు లేని స్థితి. అర్జునుడు తన కోసము యుద్ధము చేయనని భావించినా కృష్ణ చైతన్య వంతుడైన తరువాత కృష్ణుని కోసము తన శాయశక్తులా పోరాడెను. మనము కోరికలను, ఇంద్రియాలను విడిపెట్టలేము అయితే వాటి లక్షణాన్ని మార్చాలి. అలాగే సర్వమునకు కృష్ణుడే మూలమని తెలుసుకున్న వాడు తనదంటూ ఏమీ లేదని, యాజమాన్యము చేయుటకు ప్రయత్నించడు. అదేవిధముగా దివ్యజ్ఞానము కలిగిన వ్యక్తి తాను భగవంతుని సేవకుడనని భగవంతునిలో చిన్న అంశను మాత్రమేనని గ్రహించుట వలన ఎన్నడూ భగవంతునితో సమానుడు కాని, అధికుడు కాని అగుటకు ప్రయత్నించడు. ఈ విధమైన కృష్ణచైతన్య అవగాహనే నిజమైన శాంతికి పునాది వంటిది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement