Wednesday, May 19, 2021

చిరంజీవి మౌనం వెనుక ‘ఆచార్య’ ఉందా?

సినిమాను సినిమాలాగా చూడకుండా ‘వకీల్ సాబ్’పై ఏపీ ప్రభుత్వం రాజకీయ కక్ష తీర్చుకుంటుందని సోషల్ మీడియాలో జనసైనికులు, బీజేపీ అభిమానులు యుద్ధం చేస్తున్నారు. దీంతో వైసీపీ ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది. ఇటీవల ఏ పెద్ద సినిమా రిలీజ్ అయినా తెలుగు రాష్ట్రాలలో టిక్కెట్ రేట్లు పెంచుకుంటున్నారు. దీనికి ‘వకీల్ సాబ్’ ఏమీ అతీతం కాదు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం టిక్కెట్ రేట్లు పెంచవద్దని, బెనిఫిట్ షోలు వేయవద్దని ఆదేశాలు జారీచేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లు తయారైంది. దీంతో వైసీపీ సర్కారుపై పవన్ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు.

అయితే ఈ అంశంపై చిరంజీవి కుటుంబం నుంచి మాత్రం అభిమానులకు మద్దతు దొరక్కపోవడమే విచిత్రంగా మారింది. విమర్శలు రావడంతో ఆదివారం జగన్‌ను పొగుడుతూ.. వైసీపీ మంత్రులను దోషులు చేస్తూ నాగబాబు ట్వీట్ చేయడం అభిమానులకు ఊరటనిచ్చింది. కానీ వైసీపీ మంత్రులు ఊరుకోకుండా నాగబాబుపై ప్రతి విమర్శలు చేయడంతో సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. అయితే చిరంజీవి మాత్రం నోరుమెదపకపోవడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయని మెగా అభిమానులే చర్చించుకుంటున్నారు.

చిరంజీవి మౌనం వెనుక ‘ఆచార్య’ ఉందా?

‘వకీల్ సాబ్’ సినిమా బాగుందంటూ ఆ సినిమా యూనిట్ సభ్యులను ఇంటికి పిలిపించుకుని మరీ సత్కారాలు చేస్తున్న మెగాస్టార్‌కు ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి టైం దొరకలేదా అంటూ మెగా అభిమానులే పంచ్‌లు వేస్తున్నారు. ఇదంతా త్వరలో రాబోయే ‘ఆచార్య’ కోసమేనా అంటూ నిలదీస్తున్నారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే తన సినిమాకు కూడా జగన్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని మెగాస్టార్ భయపడుతున్నారని టాక్ నడుస్తోంది. అటు సినిమా థియేటర్ల యాజమాన్యాలకు ట్యాక్స్‌కు సంబంధించి జగన్ ప్రభుత్వం ఊరటనివ్వడంతో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ కూడా రాశారు. ఇంతలో విమర్శిస్తే మళ్లీ ఇబ్బందుల్లో పడతానని మెగాస్టార్ స్వార్థంగా భావిస్తుండవచ్చని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏదేమైనా తమ్ముడికి అన్న మద్దతు తెలపకపోవడం మెగా అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసిందని తెలుస్తోంది. అటు బీజేపీ నేతలు మాత్రం పవన్‌కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పనికి ఈనెల 17న ఫలితం కనపడుతుందని బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Prabha News