Sunday, May 5, 2024

తెలంగాణ దమ్మేంటో చూపిస్తాం.. ఢిల్లీ వేదికగా ధాన్యం ధర్నా: టీఆర్ ఎస్‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధానిలో తెలంగాణ తడాఖా, దమ్ము, ధీమా ఏంటో చూపిస్తామని రైతు స‌మ‌న్వ‌య స‌మితి అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి అన్నారు. ధాన్యం సేకరణ డిమాండ్‌తో 11వ తేదీన ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో జరగనున్న ధర్నా ఏర్పాట్లను రాజేశ్వ‌ర్ రెడ్డితో పాటు ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ, తెలంగాణ భవన్ అధికారులు, పోలీసులు పర్యవేక్షించారు. వేదిక, భోజన, వసతి, హోర్డింగ్, ఎల్‌ఈడీ, పార్కింగ్ ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ నుంచి వరి ధాన్యం సేకరించాలనే డిమాండ్‌తో రైతులకు అండగా ఉండేలా ధర్నా కొనసాగనుందని చెప్పారు. రాష్ట్రంలో ధాన్యం సాగు 600 శాతం పెరిగిందని, గతేడాది 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండించి తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు.

ఉద్దేశపూర్వకంగానే రాజకీయ కక్షతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిరోజూ పంచాయితీ పెట్టుకుంటూ రైతులకు నష్టం చేస్తూ రైతుల ఉసురు తీసేలా వ్యవహరిస్తోందని ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి మండిపడ్డారు. కచ్చితంగా వానాకాలం, యాసంగి సీజన్‌లో పండిన ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా పంజాబ్, హర్యానా మాదిరిగా తెలంగాణ ధాన్యాన్ని కూడా సేక‌రించాలని పల్లా డిమాండ్ చేశారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రజాప్రతినిధులందరూ ధర్నా చేయబోతున్నామన్నారు. గత 15 రోజులుగా ప్రతి గ్రామం, మండలం, జిల్లా కేంద్రంలో ప్రతి రైతు ధర్నా చేస్తున్నాడని, నల్లజెండాలు ఎగురవేస్తున్నారని చెప్పుకొచ్చారు. దూర ప్రాంతం, ఎండాకాలం కావడం వల్ల ధర్నాను ప్రజా ప్రతినిధుల వరకే పరిమితం చేశామని చెప్పారు. ఇప్పటికైనా కేంద్రం మేల్కొని తెలంగాణ నుంచి ధాన్యం సేకరించాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయ‌న హెచ్చరించారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీబీలు, జిల్లా పరిషత్, మున్సిపల్ ఛైర్మన్లు, రైతు సంఘాల నాయకులతో కలిపి 1500 మంది వరకు ప్రజాప్రతినిధులు ఈ ధర్నాలో పాల్గొంటారని వెల్లడించారు.

ముఖ్యమంత్రి పాల్గొంటారా? లేదా?
ఢిల్లీలో జ‌ర‌ప త‌ల‌పెట్టిన ఈ ధర్నాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొంటారా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమని, ఆ విషయాన్ని 11వ తేదీ ఉదయం తెలియజేస్తామని ప‌ల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆయన ధర్నాలో పాల్గొంటారనే ఆశాభావంలో తాము ఉన్నామని, సీఎం నాయకత్వంలోనే ఈ ధర్నా రూపుదిద్దుకుందని, అవసరమైతే వస్తారని చెప్పారు.

మొండిపట్టుదలతో ఉన్న కేంద్రం ఒక్కరోజు దీక్షకే దిగి వస్తుందా?
14 ఏళ్ళు కష్టపడి తెలంగాణను తెచ్చుకున్నామని రాజేశ్వరర్‌రెడ్డి అన్నారు. పంజాబ్, ఛండీగఢ్ రైతులు కూడా కొన్ని సంవత్సరాలు కష్టపడి తమ మొత్తం ధాన్యాన్ని కొనేలా చేసుకున్నారని గుర్తు చేశారు. తామిప్పుడే ఆందోళన మొదలుపెట్టామని, కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందనే భావిస్తున్నామని, లేదంటే ఇతర పోరాటాలు కొనసాగుతాయని పల్లా స్పష్టం చేశారు.

రైతులకు ఏదైనా భరోసానిస్తారా?
కేంద్రం ఆధీనంలోనే ఎఫ్‌సీఐ ఉంటుందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇతర అంశాల ప్రకారం కూడా అది సాధ్యం కాదన్నారు. తమకు సాధ్యమైనంత వరకు ధాన్యాన్ని సేకరించి, మిల్లింగ్ చేసి, కేంద్రానికి ఇవ్వడమనేది రాష్ట్రాల బాధ్యతని రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆ ధాన్యాన్ని అవసరమైన వారికి ఇవ్వడమనేది కేంద్రం బాధ్యతని తెలిపారు. తలా, తోకా లేని పార్టీ కాంగ్రెస్ అని పల్లా విమర్శించారు. ఆ పార్టీ నాయకుల గురించి మాట్లాడుకోవడం శుద్ద దండగని అభిప్రాయపడ్డారు. మీడియాతో మాట్లాడిన అనంతరం రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వ, తెలంగాణ భవన్ అధికారులు, పోలీసులతో సమీక్ష నిర్వహించారు. ధర్నాకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయం చేసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు. భద్రతా ఏర్పాట్లపై పోలీసులకు సూచనలు చేశారు.

- Advertisement -

హోర్డింగ్‌లమయమైన తెలంగాణ భవన్
తెలంగాణ భవన్ చుట్టూ పెద్ద పెద్ద హోర్డింగులను ఏర్పాటు చేశారు. కేంద్రం వడ్లను కొనడం ఆపొద్దు, రైతన్న కోసం రామన్న అనే నినాదాలతో టీఆర్‌ఎస్ అభిమాని తెలంగాణ సాయి ఏర్పాటు చేసిన హోర్డింగులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement