Friday, December 6, 2024

TS | త్వరలో వార్డు పాలన వ్యవస్థ.. మే నెలాఖరునుంచి అమలులోకి : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రజలకు సత్వరమే, అత్యంత వేగంగా సేవలందించడమే కాదు, ప్రజా సమస్యలు, సలహాలు, సూచనలు తెలుసుకుని, వాటిని పరష్కరించేందుకు ప్రభుత్వం అద్భుత విధానానికి శ్రీకారం చుడుతోంది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీలో విప్లవాత్మక నిర్ణయంతో అధునాతన విధానాన్ని అమలులోకి తేవాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. హైదరాబాద్‌ మహానగర పరిధిలో త్వరలోనే వార్డు పరిపాలనా పద్ధతికి శ్రీకారం చుట్టనున్నామని, పాలనా వికేంద్రీకరణతో పౌరులకు అత్యంత వేగంగా పరిపాలనా ఫలాలు అందుతాయని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. బుధవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో పురపాలక శాఖపై ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ త్వరలోనే హైదరాబాద్‌ నగరంలో వార్డు పాలన పద్ధతిని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీలో 150 వార్డులలో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈనెల చివరి వారంలో వార్డు కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలను వెల్లడించిన ఆయన అధికారులకు మార్గనిర్దేశం చేశారు. పలు సూచనలు చేసిన మంత్రి కేటీఆర్‌ వార్డు కార్యాలయంలో అధికారుల పనితీరు, సిబ్బంది పనితీరుపై విస్తృతంగా చర్చించారు. ప్రతీ వార్డు కార్యాలయంలో పది మంది అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ స్థాయి అధికారి ఇంచార్జీగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. తద్వారా ప్రజలు సర్కిల్‌, జోనల్‌ కార్యాలయాలకు వెళ్లకుండా వార్డు పరిధిలోనే సమస్యలు తీర్చుకోవచ్చని, ఫిర్యాదులు, సలహాలు, సూచనలు అందించేందుకు ప్రలకు వెసులుబాటు కల్గుతుందన్నారు. సత్వరమే, అత్యంత వేగంగా ప్రభుత్వానికి ప్రజా సమస్యలు తెలుసుకునే అవకాశం రావడంతోపాటు వాటిని పరిష్కరించే వీలు కలుగుతుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రభుత్వ పాలనలో పౌరుల భాగస్వామ్యం పెంచడమే నూతన విధాన లక్ష్యమని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సిటిజన్‌ ప్రెండ్లీగా జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయాలు ఉండాలని అధికారులకు సూచించారు. ప్రతీ వార్డు మరో వార్డుతో అనుసంధానం కావాలని సూచించారు.

- Advertisement -

వార్డు పాలనా వ్యవస్థలో అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ స్థాయి అధికారి ఇంచార్జీగా వ్యవహరిస్తారని, ఈ అధికారికి అనుబంధంగా పారిశుద్ధ్యం, విద్యుత్‌ సరఫరా, రహదారుల నిర్వహణ, ఎంటమాలజీ విభాగం, వెటర్నరీ విభాగం, టౌన్‌ ప్లానింగ్‌ విభాగం, జలమండలి వంటి కీలకమైన విభాగాలకు చెందిన 10మంది అధికారులు క్షేత్రస్థాయిలో సేవలందించనున్నారు. వీరు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుతోపాటు ప్రజలకు ఉన్న సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తారు.

వార్డు పాలనా విధాన వ్యవస్థను మే నెలాఖరునాటికి సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. రానున్న ఒకటిరెండు రోజుల్లో వార్డు కార్యాలయాల్లో ఉండాల్సిన సిబ్బందితో కూడిన బృందాలను సిద్ధం చేయాలన్నారు. ఈ బృందాలకు వార్డు పాలనా వ్యవస్థ ఉద్ధేశాలు, లక్ష్యాలు, పనితీరును వివరించేలా పక్కా ప్రణాళికతో శిక్షణ ఇవ్వాలన్నారు. వార్డు కార్యాలయాలు ఏకరూపంగా ఉండేందుకు వీలుగా సిటిజన్‌ ఫ్రెండ్లీ డిజైన్‌ను రూపొందించాలన్నారు. వార్డు పాలనా వ్యవస్థ ద్వారా ప్రజలకు పౌర సేవలు వేగంగా అందుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్‌ అత్యంత పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ప్రజలకు సుపరిపాలన ఫలాలు అందించే లక్ష్యంతో ఏర్పాటైందని, ఈ దిశగా సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో పరిపాలనను వికేంద్రీకరించి నూతనంగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేశామన్నారు. దీంతోపాటు నూతన పురపాలికలను, గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసి ప్రజల ఇంటిముందుకే పరిపాలనా ఫలాలను తీసికెళ్లడంలో విజయం సాధించినట్లు చెప్పారు. ఈ దిశగా సీఎం కేసీఆర్‌ ఆలోచనా విధానాన్ని మరింత ముందుకు తీసికెళ్లే ఉద్దేశంతో హైదరాబాద్‌ నగరంలోనూ పరిపాలనను మరింతగా పౌరులకు చేరువ చేయాలన్న లక్ష్యంతోనే వార్డు పాలనా వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement