Saturday, April 27, 2024

మున్సి’’పోల్స్’’ ఓ పనైపోయింది.. పోలింగ్ శాతం ఎంతంటే..?

తెలంగాణలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్‌, కొత్తూరు మున్సిపాలిటీల ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీటితోపాటు జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్, మెట్‌పల్లి, అలంపూర్‌, జల్‌పల్లి, గజ్వేల్‌, నల్లగొండ, బెల్లంపల్లి, పరకాల, బోధన్‌ లో ఒక్కో వార్డుకు ఉపఎన్నిక నిర్వహించారు. ఉదయం మందకొడిగానే కొనసాగిన పోలింగ్…9 గంటల నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది. అక్కడక్కడ చిన్నచిన్న ఘటనలు మినహా పోలింగ్ సజావుగా సాగింది. బ్యాలెట్ విధానంలో ఎన్నికల జరగ్గా.. మే 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

వరంగల్‌లో 44.15 శాతం, ఖమ్మంలో 51.36, కొత్తూరులో 76.79, సిద్దిపేటలో 58.25, జడ్చర్లలో 54.21, అచ్చంపేటలో 60.50, నకిరేకల్‌లో 76.61, లింగోజిగూడలో 22.37 శాతం  పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఈ ఎన్నికల కోసం మొత్తం 1,539 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9,809 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించారు. ఇక, అవాంఛనీయ సంఘనటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, ఎంఐఎం కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పీఎస్ 18/47 పోలింగ్ బూత్​ లో దొంగ ఓట్లు వేస్తున్నారని ఇరు పార్టీల నేతలు ఆరోపించుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఘర్షణ వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే ఇరువర్గాలను చెదరగొట్టారు. ఖమ్మం ప్రభుత్వ పీజీ కళాశాల పోలింగ్ కేంద్రం వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగాయి. పరస్పరం దాడులు చేసుకున్నారు. వెంటనే అక్కడి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు.

కాగా, గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌లో 66 డివిజన్లలో 500 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఖమ్మం కార్పొరేషన్‌లో 59 డివిజన్లు ఉండగా, 250 మంది బరిలో నిలిచారు. ఖమ్మం కార్పొరేషన్‌లో ఇప్పటికే 10 డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. సిద్దిపేట మున్సిపాలిటీలో 43 వార్డులకు పోలింగ్‌ జరగగా.. 236 మంది పోటీ చేశారు. జడ్చర్ల మున్సిపాలిటీలో 27 వార్డుల్లో 112 మంది అభ్యర్థులు, అచ్చంపేట మున్సిపాలిటీలో 20 వార్డులకు 66 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement