Monday, April 29, 2024

కేబినేట్ భేటి అజెండా ఇదే – భ‌విత‌కు భ‌రోసా..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎన్నికల ఏడాదిలో ప్రజలను పలు జఠిల సమస్యల నుంచి విముక్తం చేసి, సంక్షేమమే ఆలంబనగా సర్కార్‌ కీలక కేబినెట్‌ సమావేశానికి సిద్ధమవుతున్నది. ఇందుకు అనుగుణంగా తీసుకునే నిర్ణయాలతో మంత్రిమండలి అజెండా నోట్‌ రెడీ అవుతున్నది. ఈ పరంపరలో భాగంగా ఇప్పటివరకు పట్టణ ప్రాంతాలకు పరిమితమైన క్రమబద్దీకరణ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, గ్రామ కంఠం భూములలోని ఇండ్లకు రెగ్యులరైజేషన్‌ దిశగా ఆమోదం తెలుపనున్నది. పలు ఉత్తర్వులకు ర్యాటిఫికేషన్‌తోపాటు పోడు భూముల సమస్యకు చరమగీతం పాడేందుకు ప్రభుత్వం ఎన్నికల ఏడాదిలో కీలకమైన కేబినెట్‌ భేటీలో స్పష్టత తెచ్చేందుకు కృషి చేస్తోంది.

అటవీ, పోడు భూముల సమస్యలకు చరమగీతం…
అదేవిధంగా ఇప్పటివరకు జఠిల సమస్యగా మారిన అటవీ భూముల సరిహద్దుల సమస్యల తీర్చేలా రెవెన్యూ శాఖకు కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు. ఇందుకు సమన్వయంతో ముం దుకెళుతోంది. రాష్ట్రంలోని అటవీ, రెవెన్యూ భూముల మధ్య సరిహద్దుల సర్వేకు ప్రభుత్వంలో కదలిక తీసుకొచ్చేలా ప్రయ త్నాలు ముమ్మరం చేస్తోంది. త్వరలో సరిహద్దు సమస్యలను తీర్చేందుకు మరో సర్వేకు తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. సర్వే నెంబర్లు వేసి పక్కాగా జాతకం సిద్దం చేయాలని సర్కార్‌ ఆదేశాలకనుగుణంగా రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తున్నది. సర్వే నంబర్లు లేని భూములకు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ఆధారంగా నంబర్లను కేటాయించనున్నారు. నల్గొండలో 33,212.11 ఎకరాలు, భూపాలపల్లిలో 26,507 ఎకరాలు, కుమరం భీం జిల్లాలో 21,753 ఎకరాలు, మంచిర్యాలలో 20,155 ఎకరాలు, మెదక్‌ జిల్లాలో 17,947 ఎకరాలు, వికారా బాద్‌లో 16,319 ఎకరాలు, కామారెడ్డిలో 15,730 ఎకరాలు, నిజామాబాద్‌లో 12,689 ఎకరాలలు, మహబూబాబాద్‌లో 12,644 ఎకరాల భూముల్లో సరిహద్దు సమస్యలు తేల్చాల్సి ఉంది. మొత్తంగా 30 జిల్లాల్లో 2,18,980 ఎకరాల భూముల్లో సరిహద్దు వివాదాలు రెవెన్యూ, అటవీ శాఖల నడుమ నలుగు తున్నాయి. 2017లో జరిగిన భూ రికార్డుల ప్రక్షాళనలో 41.74 లక్షల ఎకరాల అటవీ భూమి ఉన్నట్లు గుర్తించగా, సరిహద్దు వివాదాలు భారీగా పరిష్కరించాల్సి ఉందని ఆ తర్వాత వెల్లడైంది.

సరిహద్దు అంశాలపై స్పష్టత…
ప్రభుత్వ శాఖల మధ్య సరిహద్దు సమస్యలు లేకుండా చూడాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో అధికారులు కీలక చర్య లకు శ్రీకారం చుడుతున్నారు. సరిహద్దు సమస్యలు, ఆక్రమణల నివారణకు రెవెన్యూ, అటవీ అధికారులతో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలను గతంలోనే ఏర్పాటు చేశారు. ఫారెస్ట్‌ భూముల పరి రక్షణకు ఉమ్మడి రాష్ట్రంలో జాయింట్‌ సర్వేకు సర్కార్‌ చొర వలేక మధ్యలోనే నిల్చిపోయాయి. సమస్యలు పరిష్కారానికి నోచక అటవీ సరిహద్దు సమస్యలు రైతులకు శాపంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళనలోనే సర్వే చేయాలని భావించింది. కానీ పనిఒత్తిడితో సాకారం కాలేదు. రెండు శాఖలు సంయుక్తంగా సమన్వయంతో చేపట్టే జాయింట్‌ సర్వే ద్వారా ఆదివాసీల సమస్య కూడా కొలిక్కి రానుంది. 6లక్షల ఎకరాల్లో గిరిజనులు, ఆదివాసీలు పోడు వ్యవసాయం చేసుకుం టున్నారని, వాటిపై తమకు పట్టాలు ఇవ్వాలని షెడ్యూల్‌ తెగలు, ఇతర ఆదివాసీలు అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 కింద లక్షా 83వేలకు పైగా దరఖాస్తులు ప్రభుత్వానికి సమర్పించారు. ఇందులో ఆదివాసీలతోపాటు ఇతరులు కూడా ఉన్నారు. అయితే 93,639 మంది ఆదివాసీలకు 3,00,284 ఎకరాల భూములకు చెందిన అటవీ హక్కు పత్రాలిచ్చారు. ఇంకా 90 వేల మంది దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచారు. త్వరలో వీటిపై ప్రభుత్వం స్పష్టత తేనున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement