Saturday, April 27, 2024

Jeevan reddy: బీజేపీని మించిన ఉగ్రవాద పార్టీ లేదు

బీజేపీ ఎంపీ అరవింద్ పై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఆర్మూర్ లో అరవింద్ చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్నారు. రైతులను ఖలిస్థాన్ ఉగ్రవాదులతో పోల్చడంపై జీవన్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీని మించిన ఉగ్రవాద పార్టీ మరేదీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ ఒక ఉగ్రవాదుల కర్మాగారంలా మారిందని ఆరోపించారు. ఉగ్రవాద స్వభావం కలిగిన వ్యక్తులు రైతులను ఉగ్రవాదులతో ఎలా పోలుస్తారని ప్రశ్నించారు.

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేసిన 700 మంది రైతులను బీజేపీ శ్మశానానికి పంపిందని విమర్శించారు. నిజమైన దేశ ద్రోహులు బీజేపీ నేతలేనని అన్నారు. ఎన్నికలు వచ్చాయంటే పాకిస్థాన్, ఖలిస్థాన్ అంటూ ప్రజలను రెచ్చగొడుతుంటారని ధ్వజమెత్తారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టే పెట్రోల్ ధరలను పెంచడం లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ పై బీజేపీ నేతలు వాడుతున్న భాష సరిగా లేదని… పద్ధతి మార్చుకోకపోతే టీఆర్ఎస్ సైనికులు ఊరుకోరని హెచ్చరించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న అరవింద్.. ఎన్నికల సమయంలో బాండ్ పేపర్ రాసిచ్చి దాన్ని నిలబెట్టుకోనందుకే రైతులు నిలదీస్తున్నారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement