Saturday, April 20, 2024

బీజేపీకి పూల వర్షం కావాలా.. రాళ్ళ వర్షం కావాలా?: జీవన్ రెడ్డి

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కాదు గుండా సంజయ్ గా మారారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పి కొట్టారు. పంజాబ్ తరహాలో ధాన్యం సేకరణ చేయాలని తాము అడిగితే బీజేపీ గుండాలు రైతుల కల్లాల పై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. రైతులపై దాడులు బీజేపీకి కొత్త కాదన్న జీవన్ రెడ్డి.. పంజాబ్, యూపీలో చేశారని గుర్తు చేశారు. ఇపుడు తెలంగాణలో అదే చేస్తున్నారని అన్నారు. బీజేపీకి రైతుల పూల వర్షం కావాలా.. రాళ్ళ వర్షం కావాలో ఆ పార్టీ నేతలు తేల్చుకోవాలని సూచించారు. వానా కాలం పంట మొత్తం కొంటామని కేంద్రం నుంచి ప్రకటన చేయించాకే బీజేపీ నేతలు ధాన్యం కేంద్రాలు తిరగాలన్నారు.     బీజేపీ నేతలు రైతుల పాలిట మిడతల దండులా మారారని ఎద్దేవా చేశారు.

రైతులపై దాడులకు దిగుతూ గవర్నర్ కు ఫిర్యాదులు చేస్తారా? అంటూ మండిపడ్డారు. బెంగాల్ తరహాలో హింస రాజకీయాలు తెలంగాణలో కొనసాగదని బీజేపీ నేతలు గ్రహించాలన్నారు. రైతుల సహనాన్ని బీజేపీ నేతలు పరీక్షిస్తే వారిని బట్టలూడదీసి కొట్టే రోజులు ఎంతో దూరంలో లేవని హెచ్చరించారు. బంది పోట్ల ముఠాకు నేతగా బండి సంజయ్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రైతులతో గోక్కున్న కాంగ్రెస్, టీడీపీల పరిస్థితి మాదిరిగానే బీజేపీ పరిస్థితి తయారవుతుందని జోస్యం చెప్పారు. బీజేపీ నేతలు దమ్ముంటే ఢిల్లీలో మోడీ ముందు ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు దొంగ నాటకాలు బంద్ చేయాలన్న జీవన్ రెడ్డి… ఇప్పటికే 1,800 కోట్ల రూపాయలు ధాన్యం సేకరణకు వెచ్చించామన్నారు. ఇందులో కేంద్రం నయా పైసా అయినా ఉందా ? అని ప్రశ్నించారు. రైతుల పక్షం వహిస్తున్నందుకు కేసీఆర్ ను అరెస్టు చేస్తాం అని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలకు దమ్ముంటే విదేశాలకు పారిపోయిన ఆర్థిక నెరగాళ్లను రప్పించాలన్నారు. బీజేపీ నేతలు రైతుల ఆగ్రహానికి గురి అవుతున్నారు తప్ప.. దాడిలో టీఆర్ఎస్ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ 36 పార్టీలను ఒప్పించి తెలంగాణను సాధించారన్న ఆయన.. బీజేపీ తాటాకు చప్పుళ్లకు భయపడుతారా? అని నిలదీశారు. బీజేపీలో జిల్లాకో గుండా నాయకుడు ఉన్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేపించేలా బీజేపీ నేతలు కేంద్రాన్ని ఒప్పించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApphttps://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement