Monday, December 9, 2024

ధర్మం – మర్మం : దేవతలు – సాధువులు (ఆడియోతో..)

శ్రీమద్భాగవతం ఏకాదశవ స్కందంలోని శ్లోకానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కం దాడై రామానుజాచార్యుల వారి వివరణ…

భజన్తి మే యధా దేవాన్‌ దేవా రపి తధైవ తాన్‌
ఛాయేవ కర్మసచివా: సాధవో దీనవత్సలా:

మానవులు దేవతలను ఏవిధంగా సేవి స్తారో దేవతలు కూడా వారిని అలాగే అనుగ్రహిస్తారు. దేవతలు కర్మ సచివులు అనగా మనము ఆచరించిన కర్మలకు అనుగుణంగా ఫలితములను ఇచ్చెదరు. సాధువులు అలా కాక దీనుల యందు వాత్సల్యముతో వారు చేసిన కర్మలను అనుసరించి ఫలితము ఇవ్వాలని భావించక వారి దీనత్వమును చూచి కర్మలనాచరించుటకు అసమర్ధులని తెలిసి వారి మీద జాలి చూపి సాధువులు కరుణింతురు అని సామాన్యాభిప్రాయము. దేవతల చరితము సుఖమును, దు:ఖమును కలిగించునని, సాధువుల చరితము సుఖమును మాత్రమే కలిగించునని శ్లోక వివరణ.

దేవతల చరితములో వారు ఎదుర్కొనిన సంఘటనలు సుఖదు:ఖమయములుగా ఉన్నచో మనకు సుఖదు:ఖములను కలుగుట అని వివరణ. మనము కోరిన దానిని కోరిన వెంటనే ఇచ్చినా కోరిన దానిని సంపూర్ణముగా అనుగ్రహించినా ఆనందమే కానీ తాము కోరినది తమకు లభించాలన్నా వారు చేసిన కర్మానుగుణంగానే ఫలితాన్ని ఇస్తారు కాని కోరినదంతా ఈయజాలరు దేవతలు. ‘జ్యోతిష్టోమేన స్వర్గకామోయజేత’ అనగా స్వర్గమును కోరువారు జ్యోతిష్టోమ యాగము చేయవలెను, ఆరోగ్యమును కోరువారు సూర్యుని యధావిధిగా ఆరాధించాలి అలా చేయని నాడు దేవత లు ఆయా ఫలములను ఈయజాలరు కావున దేవతలను వ్యాస భగవానుడు కర్మ సచివులుగా వివరించాడు, ఇక్కడ ప్రధానము కర్మ . దేవతలు కర్మలకు సచివులు, మంత్రులు, కర్మానుగుణ ఫలప్రదాతలే కానీ కర్తల దైన్యమును, హైన్యమును చూచి ఫలములనీయజాలరు. అందువలన మనమాశించిన ఫలానుగుణముగా కర్మలను ఆచరించని నాడు మనము కోరిన ఫలమునీయజాలరు. దేవ చరితము ‘దు:ఖాయ చ సుఖాయచ’ అని అన్నారు. ఇచట దేవతలు కర్మ సచివులు అని మాత్రమే కాక ‘ఛాయేవ’ అని కూడా అన్నారు అనగా నీడ వ్యక్తిని విడిచి ఇంకొక వైపు వెళ్లదు అలాగే దేవతలు కర్మలకు నీడలు అని వ్యాస భగవానుడు దేవతల కర్మ పారతన్త్య్రమును స్పష్టముగా వివరించారు. వారు వేతనమునిచ్చు వారే కాని అనుగ్రహము నిచ్చువారు కాదని అభిప్రాయము.

ఇక సాధువులు దీన వత్సలులు. అనగా దీనుల మీద జాలి, దయ కలవారు. జాలి దయ మన అసమర్థత, అగతిని తెలిసిన వారికి ఏర్పడుతుంది. వీరు అజ్ఞానులు, మాయామోహితులు, దేనిని చేయజాలని వారు, ఏమి కోరవలయునో, దేనిని ఆచరించవలయునో కూడా తెలియని వారు, తెలిసి చేయనిచో తప్పు పట్టాలి కాని తెలియని వారు ఆచరించలేదని భావించుట సరికాద ని మొదట వారికి తెలియనిది తెలిపి, తరువాత తెలుసుకోవాల్సిన వాటిని తెలిపిన నాడు ఆచరించవలసిన వాటిని వారే ఆచరించెదరు. అందుకే మొదట దీనులను జ్ఞానులను చేయుటకు సాధువులు ప్రయత్నించెదరు. జ్ఞానులగుటకు, జ్ఞానము కలుగుటకు మనము చేయగలిగింది ఏమీ లేదు సాధువుల దయ ప్రసరించుటే చాలు. దయ కోసం మనము చేయవలసినది ఏమీ లేదు. ఒకసారి సాధువుల దయ సోకితే మానవులకు జ్ఞనోదయము కలుగును. జ్ఞానము కలిగితే దు:ఖము తొలగి అంతా ఆనందం, సుఖము, అందుకె ‘సుఖాయైవహి సాధూనం ‘ అని అన్నారు. ఇది సాధువుల ప్రభావమును బోధిస్తున్న శ్లోకరత్నము.

- Advertisement -

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement