Thursday, April 25, 2024

కేసీఆర్ ను టచ్ చేస్తే మాడిపోతావ్: బండి సంజయ్ కి మోత్కుపల్లి వార్నింగ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ డబ్బుల ప్రోగ్రాంలో డప్పులు కొట్టేవారిలో ఒక్కరూ డప్పులు కొట్టేవారు లేరని ఎద్దేవా చేశారు. దళితబంధు కావాలని కొడుతున్నారా? వద్దని కొడుతున్నారా? అని ప్రశ్నించారు. దళితబంధు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా? అని మోత్కుపల్లి నిలదీశారు. కుల వివక్ష పోగొట్టేందుకు బీజేపీ ఎక్కడైనా ప్రయత్నం చేసిందా? అంటూ మండిపడ్డారు. బీజేపీ వల్లే కులవ్యవస్థ ముందుకు నడుస్తోందన్నారు.

బీజేపీ నేతలు ఓట్ల కోసం గారడి వేషాలు మానుకోవాలని హితవు పలికారు. నా అనుభవంలో చాలామంది సిఎంలను చూసానన్న మోత్కుపల్లి.. కేసీఆర్ అంబేద్కర్ వారసుడిగా ముందుకు సాగుతున్నారని అన్నారు. దళితులకు వచ్చే లాభాన్ని అడ్డుకునే బీజేపీ వైఖరిని ఖండిస్తున్నానని చెప్పారు. దళితులకు అడ్డం వస్తే పడేసి తంతారని హెచ్చరించారు.  

బీజేపీ నేతలు పిచ్చి కుక్కల్లా అరుస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ పిచ్చి వెధవ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ దళితబంధు ఇస్తానని అంటుంటే వినిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఎస్సి కార్పొరేషన్- స్పెషల్ ఫండ్ వల్ల ఉపయోగం లేదని, కానీ దళితబంధు వల్ల ఉపయోగం ఉందన్నారు. దళితబంధుకు అడ్డుపడితే ఊర్లలోకి రానివ్వకుండా తొక్కిపెడతారని మోత్కుపల్లి వార్నింగ్ ఇచ్చారు. దళితబంధు పథకం కావాలని బీజేపీ పాలిత రాష్ట్రాల్లోకి వెళ్లి డప్పులు కొట్టాలని బండి సంజయ్ కి సూచించారు.

దున్నాలనిపిస్తే ఒక ట్రాక్టర్ ఇస్తాం దున్నుపో అని చురకలంటించారు. కేసీఆర్ ను టచ్ చేస్తే బండి సంజయ్ మాడిమసై పోతాడన్నారు. ప్రధాని మోడీ ఇస్తానని చెప్పిన 15 లక్షల కోసం పేదలంతా ఏడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారని అన్నారు. బీజేపీ ఇస్తానన్న రూ. 15 లక్షలు ఇవ్వకపోను,   కేసీఆర్ రూ. 10 లక్షలు ఇస్తానంటే అడ్డు పడతారా? అని నిప్పులు చెరిగారు. దేశంలో ఎవ్వరికీ అక్కరరాని పార్టీ బీజేపీ అని విమర్శించారు. దళితబంధు పథకం దేశమంతా బీజేపీ అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. మిలియన్ మార్చ్ ఎందుకు పెడుతున్నారు? అని ప్రశ్నించిన మోత్కుపల్లి.. 2 కోట్ల ఉద్యోగాలు మోడీ ఇచ్చారా? అని నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోను ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజువారీగా పెంచడానికి సిగ్గు అనిపించడం లేదా? అని ధ్వజమెత్తారు. 450 రూపాయలున్న గ్యాస్ ధరను.. 1000కి పెంచారన్నారు. మోడీ చెప్పే అచ్చేదిన్ రావడం పోను- సచ్చేదిన్ వచ్చిందని మోత్కుపల్లి విమర్శించారు.

ఇది కూడా చదవండి: అర గంటకే రూ.500 పార్కింగ్ ఫీజు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Advertisement

తాజా వార్తలు

Advertisement