Tuesday, May 7, 2024

సాగర్ లో డైలాగ్ వార్!

నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోరు రసవత్తరంగా మారుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది నేతల మధ్య మాటల తూటాలు పేతులున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీa నేతల పరస్పర విమర్శలతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది.

ఉప ఎన్నికలో కాంగ్రెస్‌పార్టీని గెలిపిస్తే నియోజక వర్గం ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదని మంత్రి తలసాని అన్నారు. అధికార పార్టీ అభ్యర్ధిని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి భగత్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలం మంత్రిగా ఉన్నా…అని గొప్పలు చెప్పుకునే జానారెడ్డి సాగర్‌ నియోజక వర్గం ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఇక టీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేత జానారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సాగర్ అభివృద్ధి విషయంలో టిఆర్ఎస్ నేతలు, మంత్రులు అవగాహనా రాహిత్యంతో తనపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సాగర్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ చర్చకు వస్తే తాను స్పందిస్తానని జానారెడ్డి స్పష్టం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా, ప్రజలను ప్రలోభ పెట్టకుండా గెలవలేమని భయంతోనే అడ్డగోలు ప్రచారానికి తెరలేపారని జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా, ప్రజలను ప్రలోభ పెట్టకుండా ఎన్నికలకు రావాలని ప్రతిపాదన చేస్తే ఇప్పటి వరకు టీఆర్ఎస్ స్పందించలేదని విమర్శించారు. 

ఉప ఎన్నికల్లో తన విజయం నల్లేరు మీద నడకే అని జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని జానారెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తం మీద సాగర్ ఉపఎన్నిక తెలంగాణలో రాజకీయాన్ని వేడెక్కిస్తోంది. ఏప్రిల్ 17న సాగర్ ఉపఎన్నిక జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement