Tuesday, May 7, 2024

వైద్య సేవల్లోనూ పారదర్శకత.. ప్రత్యేక హెల్త్‌ క్యాలెండర్‌ ఏర్పాటు: మంత్రి హరీశ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పాణం బాగలేక ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే పేద, సామాన్య రోగులకు జవాబుదారీ తనంతో కూడిన పారదర్శకమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించటమే లక్ష్యంగా తెలంగాణ వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ముందుకు కదులుతోంది. సర్కారీ దవాఖానాల్లోనే అన్ని రకాల మందులు మొదలు, డయాగ్నసిస్‌ సేవలు, శస్త్ర చికిత్సలను ఉచితంగానే అందించేలా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళుతోంది. కొవిడ్‌-19 మహమ్మారి నేర్పిన గుణపాఠాల నేపథ్యంలో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసే దిశగా మంత్రి హరీష్‌రావు వేగంగా చర్యలు చేపడుతున్నారు. గతేడాది వైద్య ఆరోగ్యశాఖ రూ.6295 కోట్ల బడ్జెట్‌ను కేటాయించగా ఈ ఏడాది దాన్ని రూ.11,440 కోట్లకు కేటాయింపులను పెంచారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో నిధులు పెంచినందున అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సర్కారీ వైద్యులకు స్పష్టం చేశారు.

ఈ మేరకు మంత్రి హరీష్‌రావు విభాగాల వారీగా వరుస సమీక్షలు నిర్వహిస్తూ సర్కారీ వైద్యంలో నాణ్యతను, వైద్యుల్లో జవాబాదారీతనాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్యశాఖలోని అన్ని విభాగాలతో ఓ క్రమపద్దతిలో సమీక్షలు ఉండేలా మంత్రి హరీష్‌రావు ప్రత్యేకంగా హెల్త్‌ క్యాలెండర్‌ను రూపొందించారు. ప్రతి నెలా 3వ తేదీన ఆశాలు, పీహెచ్‌సీల ప్రోగ్రామ్‌ అధికారులతో, 5న అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, పీహెచ్‌సీల ఇన్‌చార్జిలతో, 7న వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌, ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో, 9న డీఎంఈ పరిధిలోని ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో, 11న నిమ్స్‌, ఎంఎన్‌జే ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో, 13న ఆయూష్‌ విభాగం వైద్యులతో, 15న ఐపీఎం, బ్లడ్‌ బ్యాంకు అధికారులతో, 17న ఔషధ నియంత్రణ శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించేలా క్యాలెండర్‌ సిద్ధం చేశారు. సమీక్షలకు వీలుగా ఇందుకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక జూమ్‌ యాప్‌ను, టెలీ కాన్‌ఫరెన్స్‌ వ్యవస్థను రూపొందించింది.

ప్రతి నెలా హెల్త్‌ క్యాలెండర్‌ ప్రకారం నిర్దేశించిన తేదీల్లో మిస్‌ అవకుండా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ మంత్రి హరీష్‌రావు సమీక్షకు హాజరుకాని పక్షంలో ఉన్నతాధికారులు నిర్వహించేలా, క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఆశించిన ఫలితాలు రాబట్టేందుకు అనుసరించాల్సిన ప్రశ్నావళిని సిద్ధం చేసి ఇచ్చారు. ఆయా విభాగాధిపతులతో నిర్వహించే సమీక్షల్లో ఆ నెలలో సాధించిన పురోగతి ఏమిటి?, వైద్యులు ఎన్ని శస్త్ర చికిత్సలు చేశారు?, ఎన్ని రిఫరల్‌ కేసులు పంపారు?, రిఫరల్‌ పంపితే ఎందుకు పంపించాసి వచ్చింది?, గడుస్తున్న నెలలో ఎన్ని శస్త్ర చికిత్సలు చేస్తారు?, క్లిష్టమైన వ్యాధులకు ఏ మేరకు చికిత్స అందిస్తారు? తదితర వివరాలతో మంత్రి హరీష్‌రావు సమీక్షను ఆషామాషీగా కాకుండా క్షుణ్ణంగా నిర్వహిస్తున్నారని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

రిఫరల్‌ కేసులు ఎక్కువగా ఉంటే సూపరింటెండెంట్‌ సమాధానం చెప్పాల్సిందే
ప్రత్యేకించి జిల్లా, ఏరియా ఆస్పత్రుల నుంచి రిఫరల్‌ వైద్యానికి చెక్‌ పెట్టాలని మంత్రి హరీష్‌రావు భావిస్తున్నారు. అవసరమైతే తప్ప పెద్దాస్పత్రులకు కేసులను బదిలీ చేయొద్దని నిర్దేశించారు. ప్రస్తుతం అవసరం ఉన్నా లేకున్నా పెద్దాస్పత్రులకు ప్రత్యేకించి హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా తదితర ఆస్పత్రులకు రోగులను పంపిస్తారు. దీంతో రోగికి వైద్యం అందించాల్సిన విలువైన సమయం వృథా అవుతుండడంతోపాటు రాజధానిలో పెద్దాస్పత్రులపై రోగుల ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రిఫరల్‌ వైద్యాన్ని తగ్గించాలని ఏరియా, జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్లను మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. ఒకవేళ రిఫరల్స్‌ కేసులను పంపిస్తే ఎందుకు పంపించాల్సి వచ్చిందో ప్రత్యేకంగా అడుగుతున్నారు. ప్రతి నెలా ఆస్పత్రుల వారీగా వైద్య సేవల వివరాలను అధికారులు నమోదు చేస్తున్నారు. ఎక్కువ రిఫరల్‌ కేసులు నమోదైన ఆస్పత్రులను గుర్తించి సూపరింటెండెంట్ల నుంచి సమాధానం కోరుతున్నారు.

ఎమర్జెన్సీ వైద్యంపై ప్రత్యేక వ్యవస్థ
నిమ్స్‌, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు రోజురోజుకు రోగుల తాకిడి పెరుగుతుండడంతో ఇక్కడ ఎమర్జెన్సీ వైద్యం, బెడ్‌ దొరకటం కష్టంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో నిమ్స్‌, గాంధీ తదితర ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ వైద్యం నిర్వహణకు ప్రత్యేక కమిటీని వేశారు. ఎమర్జెన్సీ వైద్యం అందించిన వెంటనే రోగులు బెడ్‌ ఖాళీ చేసేలా, కొత్త వారికి అడ్మిషన్‌ దొరికేలా ప్రత్యేకంగా మానిటర్‌ చేస్తున్నారు. గాంధీ, నిమ్స్‌లో ప్రత్యేకంగా 250 పడకల ఎమర్జెన్సీ వార్డును సిద్ధం చేస్తున్నారు.

- Advertisement -

మంత్రి ఆకస్మిక తనిఖీలు
క్షేత్రస్థాయి ఏరియా, జిల్లా, బోధానాస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందుతుందీ లేనిదీ తెలుసుకునేందుకు మంత్రి హరీష్‌రావు ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. పీహెచ్‌సీ మొదలు బోధనాస్పత్రి వరకు ఆకస్మికంగా తనిఖీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే చేర్యాల పీహెచ్‌సీ, సిద్ధిపేట ఏరియా ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీహెచ్‌ డా. జి.శ్రీనివాసరావు, డీఎంఈ రమేష్‌రెడ్డిని కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

అదే సమయంలో అధికారులు, వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించేలా నిఘా వ్యవస్థను పెంచారు. ఇందుకోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సీసీ కెమెరాల బిగింపు 90శాతం పీహెచ్‌సీల్లో పూర్తయింది. ఒక్కో పీహెచ్‌సీలో మూడేసి కెమెరాల చొప్పున బిగించారు. హైదరాబాద్‌లోని మంత్రి తన సెల్‌ఫోన్‌లో పలానా పీహెచ్‌సీ పేరు కొట్టగానే అక్కడ విధుల్లో వైద్యులు ఉన్నదీ లేనిదీ తెలిసిపోయేట్టుగా ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement