Saturday, May 11, 2024

కరోనా వేళ వైసీపీ ఎమ్మెల్యే పెద్దమనసు.. అనాధ శవాలకు భూమన అంత్యక్రియలు

కరోనా సమయంలో ప్రతి ఒక్కరికీ వైరస్ భయం పట్టుకుంది. కరోనా బారినపడ్డ వారి వద్దకు వెళ్లాలంటేనే బంధువులు ఆప్తులు ముందుకు రాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కరోనా విజృంభిస్తున్నవేళ సొంత బంధువులే తమ వాళ్ల అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే అడుగు ముందుకు వేశారు. కరోనా మొదటి వేవ్ లో చనిపోయిన వారికీ అంతిమ సంస్కారాలు నిర్వహించిన భూమన.. సెకండ్ వేవ్ లో కరోనా విజృంభిస్తున్న వేలాది మంది మరణిస్తున్న సమయంలో తమవంతు అవగాహనా కార్యక్రమం చేసే విధంగా ముందడుగు వేశారు. కరోనాతో మృతిచెందిన 7 అనాధ శవాలకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. హరిశ్చంద్ర స్మశాన వాటికలో ఏడుగురు అనాధ కోవిడ్ మృతులకు సాంప్రదాయబద్దంగా దహన సంస్కారాలు నిర్వహించారు ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి. గత ఏడాది నుంచి ఇప్పటి దాకా దాదాపు 700లకు పైగా అనాధ మృతదేహాలకు అంత్యక్రియలు చేశారు.

దైవ కార్యంగా భావించే అనాధ మృతదేహాల అంతిమ సంస్కారాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. కరోనా మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో ఉందని, చనిపోయిన వారి సంఖ్య వేలల్లో వుందన్నారు. కరోనా బారిన చనిపోయిన వారిని దహన క్రియలకు సొంత వాళ్ళు రాక పోవడం బాధాకరమని అన్నారు. కరోనా మొదలైన నాటి నుండి తిరుపతిలో తన సహచరులు, మిత్రులు జెఏసిగా ఏర్పడి అనాధ మృత దేహాలకు ఖననం చేసే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు 700 కు పైగా అనాధల మృత దేహాలకు ఖననం చేసే కార్యక్రమంలో పాల్గొన్నామని వివరించారు. స్థానిక శాసన సభ్యునిగా, బాధ్యత గల వ్యక్తిగా ప్రజలలో కరోనా బారిన పడుతున్న వారికి మొదటి నుండే ప్రజల్లో ధైర్యాన్ని నింపిన వ్యక్తిగా, చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతి కలగడానికి, వారి బంధువులలో ధైర్యాన్ని నింపడానికి ఈ ఖనన కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నానని తెలిపారు. భగవంతుడే తనలో ఆలోచన కలిగించేలా చేసాడని నమ్మి, ఖననాలు దైవ్య కార్యక్రమంగా భావించి చేపడుతున్నానని చెప్పారు. రెండు సార్లు కరోనా సోకి, 60 వయస్సు పై బడినన వాడినని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు, బాధలు పట్టించుకోవడం కన్నా మరే కార్యక్రమం లేదని అందుకే అనాధలకు అండగా నిలుస్తున్నానని ఎమ్మెల్యే భూమన వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement