Saturday, May 18, 2024

ఆప‌రేష‌న్ కావేరి.. సుడాన్ నుండి స్వ‌దేశానికి మూడో బ్యాచ్

కేంద్ర ప్ర‌భుత్వం ఆప‌రేష‌న్ కావేరితో సుడాన్ లో చిక్కుకున్న భార‌తీయుల త‌ర‌లింపు ప్ర‌క్రియ‌ని ముమ్మ‌రం చేసింది. దాంతో సుడాన్ లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలిస్తోంది. భారత వాయుసేన, నావికా దళాల ద్వారా దశల వారీగా భారతీయుల్ని సురక్షితంగా స్వదేశానికి చేర్చే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో బుధవారం సుడాన్‌ నుంచి మూడో బ్యాచ్‌ కూడా బయల్దేరింది. ఈ విషయాన్ని విదేశీవ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. సుడాన్‌ నుంచి మూడో బ్యాచ్‌లో 135 మంది భారతీయులతో రెండో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ C-130J విమానం సౌదీ అరేబియా లోని జెడ్డా కు చేరుకున్నట్లు తెలిపారు.

అంతకుముందు మొదటి బ్యాచ్‌లో భాగంగా భారత నావికాదళానికి చెందిన ‘ఐఎన్ఎస్ సుమేదా ద్వారా 278 మంది ప్రయాణికులు సుడాన్‌ పోర్టు నుంచి సౌదీకి చేరుకున్నారు. రెండో బ్యాచ్‌లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (IAF C-130J) విమానంలో 148 మంది భారతీయులను తొలి విమానంలో స్వదేశానికి తరలించినట్లు తెలిపింది.
సుడాన్‌పై పట్టుకోసం ఆ దేశ సైన్యం, పారా మిలటరీ రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్ మధ్య గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఘర్షణలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సాయుధ బలగాల నడుమ కొనసాగుతున్న అంతర్యుద్ధంలో ఇప్పటి వరకు 400 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరో 4 వేల మందికిపైగా గాయపడ్డారు. కాగా, సుడాన్‌లో సుమారు మూడు వేల మందికిపైగా భార‌తీయులు ఉన్నట్లు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement