Thursday, April 25, 2024

శబరిమల అయ్యప్ప హుండీ ఆదాయం రూ.318కోట్లు

శబరిమల అయ్యప్పకు భారీగా కానుకలు రావడంతో హుండీ ఆదాయం రూ.318 కోట్లు వచ్చింది. శబరిమల అయ్యప్ప ఆలయానికి భారీగా ఆదాయం వచ్చింది. ఈ సీజన్​లో రూ.318 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. లెక్కింపు పూర్తయ్యేసరికి ఈ మొత్తం రూ.330 కోట్లకు చేరొచ్చని పేర్కొన్నారు. కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. శుక్రవారంతో వార్షిక తీర్థయాత్ర సీజన్ ముగియనుండగా.. ఈ సీజన్​లో ఇప్పటివరకు రూ.318 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇది అయ్యప్ప స్వామి ఆలయ చరిత్రలోనే అత్యధికమని చెప్పారు. 2018 సీజన్​లో అత్యధికంగా రూ.260 కోట్లు వచ్చాయని.. ఈసారి ఆ రికార్డును తిరగరాస్తూ భారీగా ఆదాయం పెరిగిందని వివరించారు.

రెండేళ్లు కరోనా విజృంభణ తర్వాత ఈ సీజన్​లోనే భక్తులను పూర్తి స్థాయిలో శబరిమలకు అనుమతించారు. ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. చిన్నారులు సైతం స్వామి వారి దర్శనానికి పోటెత్తారు. మొక్కులు, కానుకలను అయ్యప్పకు సమర్పించారు. కాగా, హుండీల్లో నోట్ల లెక్కింపు పూర్తైందని అధికారులు తెలిపారు. కాయిన్లను లెక్కించాల్సి ఉందని తెలిపారు. ఇవి మరో రూ.ఏడు కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇతర కానుకలను కలుపుకొంటే.. మొత్తం ఆదాయం రూ.330 కోట్ల వరకు చేరొచ్చని చెప్పారు. మరోవైపు, ట్రావెన్​కోర్ దేవస్థానం బోర్డుకు కేరళ హైకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. హుండీ ఆదాయాన్ని లెక్కించే విషయంపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. డొనేషన్లు, కరెన్సీ నోట్ల లెక్కింపు విషయంలో ఏవైనా అవకతవకలు జరిగాయా అని పరిశీలించాలని బోర్డుకు చెందిన విజిలెన్స్ విభాగానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. కొన్ని నోట్లు చిరిగిపోయి, నిరుపయోగంగా మారిపోతున్నాయన్న వార్తల నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు స్పందించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement