Monday, April 29, 2024

Big Story: రాబడికి రాచబాట.. మరోసారి భూముల మార్కెట్‌ విలువల పెంపు

రాబడులను రాచబాటలో పెంచుకొంటూ ప్రజలకు భారం లేకుండా మరింత సంక్షేమ సర్కార్‌గా వెలుగొందేందుకు ప్రభుత్వం కార్యాచరణ రెడీ చేస్తోంది. సహేతుకతతో లీకేజీలను అరికట్టి, శాస్త్రీయ ఆచరణతో ఖజానాను నింపి, పెరిగిన ఆదాయంతో ప్రజల కడుపులను నింపాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఈ దిశలోనే శాఖల వారీగా వృధా కట్టడి, సాంత్పదాయక కేటాయింపులకు పకడ్బంధీ ఆదేశాలు జారీ చేశారు. ఇక పటిష్ట అమలు దిశగా దృష్టిసారించారు.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర సొంత వనరుల రాబడి అంచనాలు లక్ష కోట్లకు మించాయి. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.1,08,212కోట్ల స్వీయ వనరుల రాబడిని ప్రభుత్వం అంచనా వేసుకుంది. గతేడాది రూ. 92వేల కోట్లుగా ఉన్న పన్నుల రాబడిని మరింత పెంచడంతో పలు మార్గాల్లో వనరుల సమీకరణకు సర్కార్‌ సిద్దమవుతున్నదనే ప్రచారం పెరిగింది. అమ్మకం పన్నులను రూ. 26,500కోట్లనుంచి రూ. 33వేల కోట్లకు, జీఎస్టీ కింద రూ. 31 వేల కోట్లనుంచి రూ. 36,203కోట్లకు, ఎక్సైజ్‌ ఆదాయాన్ని రూ. 17,500కోట్లకు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని రూ. 12,500కోట్లనుంచి ఏకంగా రూ. 15,600కోట్లకు పెంచుతూ అంచనాలు పెట్టారు. ఇక భూముల అమ్మకాల ద్వారా రూ. 15,500 కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దేశంలోనే అద్బుత పురోగతి ఉన్న తెలంగాణ ఆర్ధిక వృద్ధిరేటుపై రెండేళ్లుగా కరోనా తీవ్రంగా వేటు వేసింది. ఆ తర్వాత క్రమంగా రెండేళ్లుగా ప్రతికూల ప్రభావాలను ప్రభుత్వం ధీటుగా ఎదుర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న భారీ ఆశలు, అంచనాలకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన 7ఏళ్ల తర్వాత స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖలో భూముల విలువల పెంపు 2021లో జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైనా భూముల మార్కెట్‌ విలువలను పెంచుకోవచ్చనే నిబంధనతో జీవోను సవరించి ప్రభుత్వం 2022లో మరోసారి విలువలను ఆరు నెలల్లోపు రెండోసారి పెంచింది. ఈసారి ఆశల బడ్జెట్‌ పెట్టుకున్నాం. అందుకే కొంత మేర ఆదాయం పెంచుతాం అని సీఎం కేసీఆర్‌ శాసనసభా బడ్జెట్‌ సమావేశాల్లో ప్రకటించారు. విద్యుత్‌ చార్జీల పెంపు ఆ సంస్థ మనుగడ కోసమే అని సీఎం కేసీఆర్‌ శాసనసభలో పరోక్షంగా పన్నుల పెంపును ప్రస్తావించారు.

రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఆస్తి పన్ను పెంచాలనే ప్రభుత్వ ప్రతిపాదన ఈ ఆర్ధిక ఏడాదిలో మరోసారి అమలు చేయనున్నారు. ఇందులో భాగంగానే రూ. 15,600కోట్ల రాబడిని ప్రతిపాదించినట్లు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏప్రిల్‌ 1నుంచి అదేవిధంగా విద్యుత్‌ చార్జీల పెంపు, ఈ ఏడాదిలో మరోసారి భూముల మార్కెట్‌ విలువల పెంపు అంశాలు అమలు కానున్నాయి. ఇప్పటికే నిధుల సమీకరణలో భాగంగా 10 జిల్లాల్లో భూముల విక్రయాలు, రాజీవ్‌ స్వగృహ ఇండ్ల వేలం పురోగతిలో ఉంది. దీనిని మరింత వేగవంతం చేయనున్నారు. ఇక వాణిజ్య పన్నుల కింద రావాల్సిన బకాయిలను వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద అవకాశం ఇచ్చి పెనాల్టీ రద్దు చేయనున్నట్లు తెలిసింది.

రెండేళ్ల ప్రతికూలతల నేపథ్యంలో పన్నుల పెంపుతోపాటు, లీకేజీలు లేని పారదర్శక పన్నుల విధానం దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎగవేతలతో తీవ్రంగా నష్టం కల్గిస్తున్న అక్రమ వ్యాపారాలను అరికట్టే పనుల్లో నిమగ్నమైన ప్రభుత్వం రాబడి మార్గాలపై అధ్యయనం చేస్తోంది. ప్రజలకు భారం కాకుండానే పారదర్శక పద్దతుల్లో ప్రజలకు బాధ్యత పెంచే చర్యలకు పదును పెడుతోంది. మోటార్‌ వాహనాల రిజిస్ట్రేషన్‌ రుసుములపెంపు అంశాలపై ప్రభుత్వం యోచిస్తోంది. ఇక పలు సేవలు, వస్తువులను పన్నుల పరిధిలోకి తెచ్చి వాణిజ్య పన్నులను పెంచుకునే ఆలోచనలకు పదును పెడుతోంది. క్రషర్లలో తయారయ్యే కంకర, కృత్రిమంగా తయారు చేసే ఇసుక, ఇసుక రీచ్‌లలో పారదర్శక పన్నుల వసూలు, ప్రభుత్వ, ప్రైవేటు మైనింగ్‌ భూముల్లో రాయల్టిల వసూలు వంటి అంశాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నివేదిక సిద్దం చేస్తోంది.

రైతు రుణమాఫీ, సామాజిక పించన్ల వంటి వాటిపై ఖజానా లోటు ప్రభావం పడకుండా నెట్టుకొచ్చిన ప్రభుత్వానికి పెంచిన పథకాలకు, కొత్త పథకాలకు నధుల సమీకరణ చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. అన్ని ప్రతికూల అంశాలను ధీటుగా ఎదుర్కొనేందుకు నిధుల సమీకరణ, అత్యవసర వ్యయాలు, వడ్డీలు, రుణాల రీపేమెంట్‌ వంటివి అతిపెద్ద సవాలుగా మారాయి. రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఆస్తి పన్ను పెంచాలనే ప్రభుత్వ ప్రతిపాదన గత కొంత కాలంగా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. సబ్సిడీల భారం తగ్గించుకునేందుకు విద్యుత్‌ చార్జీల పెంపు అనివార్యం కానుందని తెలుస్తోంది.

ఇప్పటికే విద్యుత్‌ రాయితీల కింద రూ. 10,500కోట్లను ప్రభుత్వం కేటాయింపులు చేసింది. త్వరలో నూతన మైనింగ్‌ పాలసీని ప్రకటించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రెవెన్యూ వ్యయాల్లో రూ. 1,89,274కోట్లుగా పేర్కొన్న సర్కార్‌ పెట్టుబడి వ్యయంగా రూ. 29,728కోట్లను ఖర్చు చేస్తోంది. ఇందులో రుణాల చెల్లింపులకు రూ. 11,701కోట్లను, అప్పులు, అడ్వాన్సుల చెల్లింపులు రూ. 26,253కోట్లు చెల్లించనుంది. మొత్తం రాష్ట్ర రాబడిలో సంక్షేమ రంగానికి రూ. 93,489కోట్లను, జీతాలకు రూ. 52,045కోట్లతో మొత్తం ఖర్చులు రూ. 1,89,274కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఈ అంచనాల చేరికకు రాబడిని పెంచుకోవాల్సిన పరిస్థితి అనివార్యంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement