Sunday, May 5, 2024

Big Story: వచ్చే 3 నెలలు కీలకం, ఆర్ధిక వ్యయాలు అధికం.. కేంద్రం షరతులకు తలొగ్గని తెలంగాణ‌

జూన్‌లో రైతుబంధు, అదే నెలలో కొత్త లబ్ధిదారులకు ఆసరా పింఛన్లను అందించేందుకు సర్కార్‌ ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలు పెట్టింది. ఇందుకు నిధుల సమీకరణకు మార్గాలు వెదుక్కుంటోంది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక దళితబంధు పథకానికి కూడా నిధుల కేటాయింపు భారం ఈ త్రైమాసికం నుంచే ఖజానాపై పడనున్నాయి. ఈ నేపథ్యంలోనే నిధుల సమీకరణ అనివార్యంగా మారింది. ఆయా ప్రయత్నాల్లో భాగంగా సర్కార్‌ కీలక చర్యలను అవలంభించాలని యోచిస్తున్నది. ఈ క్రమంలో లోటును తగ్గించుకుని రాష్ట్ర అవసరాలకు నిధులను సమీకరించుకునే దిశగా ఆర్థిక శాఖ ప్రయత్నాలు చేస్తోంది.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పెరిగిన ఖర్చులకు దీటుగా రాబడిని సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది తెలంగాణ ప్ర‌భుత్వం. భారీగా పెరిగిన ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, ప్రాధాన్యత పథకాల వ్యయం నేపథ్యంలో అదనపు రాబడి మార్గాలపై అన్వేషణను తీవ్రతరం చేసింది. పన్నులను పెంచకుండానే మరింత రాబడి దిశగా ప్రణాళికలు వేస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు నిధుల సమన్వయం ఇబ్బందికరంగా మారడంతో మొదటి త్రైమాసికంలో తప్పనిసరి అప్పులకు ప్రాధాన్యతనిస్తోంది. రానున్న మూడు నెలల్లో రూ.15 వేల కోట్ల రుణ సేకరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేస్తోంది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో వనరుల రాబడికి మించి వ్యయాలు ఎక్కువగా ఉన్న కారణంగా ఆర్థిక లోటును అధిగమించేందుకు ఆర్బీఐ వద్ద రుణ సేకరణకు యోచిస్తున్నది.

ఈ నెలలో రూ.3 వేల కోట్లు, మే నెలలో రూ.8 వేల కోట్లు, జూన్‌లో రూ.4 వేల కోట్ల రుణాలను సేకరించేలా ఆర్బీఐకి ప్రతిపాదించింది. 2022-23 ఆర్థిక యేడాదిలో రూ.59,672 కోట్ల రుణ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిర్దేశించుకున్నది. ఇప్పటికే నెలకు రూ.1500 కోట్లు వడ్డీలకు కేటాయించింది. కొత్త అప్పులతో వడ్డీలు మరో రూ.100 కోట్లు ఎక్కువవనున్నాయి.
గత ఆర్థిక యేడాది మొదటి త్రైమాసికం ఇదే సమయంలో రూ.8 వేల కోట్లు రుణంగా ప్రభుత్వం సేకరించింది. జూన్‌లో రైతు బంధు చెల్లించాల్సిన నేపథ్యంలో భారీగా నిధులు అక్కరపడనున్నాయి. రాష్ట్ర రాబడులు ఇప్పుడిప్పుడే కుదుటపడి ఆర్థిక ప్రగతి సాకారమవుతుండగా, అనేక పథకాలు కూడా ఈ ఏడాదిలో గ్రౌండింగ్‌లో ఉన్నాయి. జూన్‌ నుంచి కొత్త ఆసరా పింఛన్లు ఇవ్వాలని సర్కార్‌ భావిస్తున్నది.

అప్పుల షెడ్యూల్‌ ఇలా…
నెల రుణం(రూ. కోట్లలో…)
ఏప్రిల్‌ 11 1000
ఏప్రిల్‌ 26 2000
మే 2 3000
మే 17 2000
మే 31 3000
జూన్‌ 7 1000
జూన్‌ 14 2000
జూన్‌ 28 1000
మొత్తం 15000

అయితే తాజాగా కేంద్రం విద్యుత్‌ సంస్కరణలు, ఇంకా ఇతర షరతులు అమలు చేస్తేనే రాష్ట్రాలకు 0.50 శాతం అదనపు అప్పుల సేకరణకు అనుమతిస్తామని తెలిపింది. గురువారం కేంద్రం ఇలా షరతులకు తలొగ్గిన 10రాష్ట్రాలకు రూ.28 వేల కోట్లు అందించాలని నిర్ణయించింది. ఇందులో తెలంగాణ విద్యుత్‌ సంస్కరణలను అమలు చేయబోమని కుండబద్ధలు కొట్టిన కారణంగా చోటుదక్కించుకోలేదు. దీంతో జీఎస్టీడీలో 0.50శాతం అంటే రూ.10 లక్షల కోట్లలో రూ.5 వేల కోట్ల రుణ సేకరణకు అవకాశం కోల్పోయింది.

- Advertisement -

షరతులు ఇవే…
ఇలా అదనపు రుణ సేకరణ వెసులబాటుకు 15వ ఆర్థిక సంఘం సూచీలు కాకుండా పలు ఇతర షరతులను కేంద్రం విధించింది. ఎలాంటి షరతులు లేకుండా 3.8శాతం రుణాలు తీసుకోవచ్చని, మరో 1 శాతం రుణాలకు వన్‌ నేషన్‌- వన్‌ రేషన్‌, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, విద్యుత్‌ పంపిణీలో సంస్కరణలు, పట్టణ స్థానిక సంస్థల రాబడుల ఆధారంగా వెసులుబాటు కల్పించింది. వీటిలో ఏ మూడు అంశాలు అమలు చేసినా 0.25 శాతం చొప్పున ఎఫ్‌ఆర్‌బీఎం పెంచుతూ గరిష్టంగా 5శాతంగా అమలు చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement