Thursday, April 25, 2024

అక్షరం నా సంచారం.. అక్షరం నా ఆటస్థలం

అక్షరాలే నా నడకలు. అక్షరాలే నా నమ్మకాలు, అక్షరాలే నా విశ్వాసాలు, అక్షరాలే నా బతుకుగోడలు, అక్షరాలే నా ఆస్తులుపాస్తులు, అక్షరాల్ని నమ్ముకుని అక్షరాలతో పవళించి రవళించి నడుచుకుంటూ పోతుంటే ఏదీ కోల్పోయినట్లు లేదు. అంతా పొందినట్లే ఉంది. అందుకే నన్ను నేను అక్షరాన్ని చేసుకుంటూ సంచరిస్తున్నాను. అక్షరం నా సంచారం, అక్షరం నా ఆటస్థలం, అక్షరం నా ఆత్మవిశ్వాసం, అక్షరం నా అంతరంగం మధనం, అక్షరం నా సర్వస్వం. బాల్యం, యవ్వన చదువుల వయస్సు అక్షరమైనప్పుడు బిగించిన పిడికిలి అయిన అక్షరాన్ని… చదువుల నుంచి జనజీవన ఉద్యమాల వరకు నన్ను లాక్కుపోయింది అక్షరమే.

నా నడకంతా అక్షరాలతోనే మొదలైంది, నా ప్రయాణమంతా పదాలతోనే సాగింది. నా జీవన యానమంతా వాక్య నిర్మాణాలతోనే సాగింది, మంది తో కలిసి నడిచిన దారంతా వచన కావ్యాలయ్యాయి. జనంతో పెనవేసుకున్న బంధమంతా సాహిత్యంలో విడదీయలేని కవిత్వ పంక్తులయ్యాయి. మట్టి పలకల మీద దిద్దుకున్న అక్షరాలన్నీ మట్టిమనుషుల చెమట బిందువుల జడివానలయ్యాయి. గుణింతాలన్నీ గురు తుపెట్టుకున్న గురితప్పని పద్యాలయ్యాయి. పాదాలు పగిలేదాకా నడిస్తే అవి పాదముద్రలయ్యా యి. చిన్న ప్పుడు మా వడ్ల బజారులో గాలిలోకి లేచిన పెద్ద బాడిశ కవిత్వ కొలిమయ్యింది. మేడికి కావాల్సిన కర్రు ను సుత్తితో వంచేస్తుంటే అది దీర్ఘకావ్యాల కుంప టయ్యింది. అవమానాల అణిచివేతల వెనుకబడిన వర్గాల సంఘర్షణల నుంచి వెంటాడే కలాన్నయ్యాను. కంజిర మీద లయబద్ధంగా కొట్టిన చేతివేళ్ల నాట్యమంతా పాటల ప్రపంచమైంది. నేను నానేల, మేము మా భూమి, మనము మన అస్తిత్వము అన్నప్పుడు ఆత్మ గౌరవ గీతికనయ్యాను. నా తెలంగాణమన్న దీర్ఘ కావ్యమయ్యాను. చెకుముకిరాయి రాపిడిల నుంచి వచన కవిత్వమంటయ్యాను. పాటలు పాడిపాడీ తెలంగాణ మహాసంగ్రామ గీతాలకు కోరస్‌ నయ్యా ను.

”కేసీఆర్‌ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో” నన్న ఎక్కుపెట్టిన మాటమీద తెలంగాణ ముఖచిత్ర కవిత్వ రాజముద్రనయ్యాను. నేను అనుకున్నదంతా మొహమాటం లేకుండా రాసాను. నేను తలచిందే అక్షరాల్లో తరిచితరిచి రాశాను. నేను వలచిన అక్షరాల్నే నిత్యం వరిస్తున్నాను. చిన్నప్పుడు నాయిన చినబసవయ్య తీసిన రాగమే నన్ను పలవరింపజేసిన సాహిత్య బీజా క్షరం. మా అమ్మ సక్కుబాయమ్మ మోసిన గడ్డిమోపు, అమ్మ కాళ్లకు గుచ్చుకున్న పల్లేరు కాయల ముళ్లే కవిత్వాక్షరాల పుట్టుకలు. ఎర్రసెలకల్లో తాటిపండ్లు ముంజకాయలు, దోసకాయలు, శెనగ కాయలు తింటూ, గెట్ల మీద గెంతుతూ బరెగొడ్లను అల్లిస్తూ తిన్న వేడివేడి జొన్నబువ్వ, బుడమొడ్ల ఎర్రబియ్యం కదా నాలో తరతరాల జ్ఞాపకాల అక్షరాలు కదా ఆత్మ కథాత్మక జీవన వ్యాకరణ కావ్యమైంది. నడిగూడెం కొల్లు పాపయ్య చౌదరి హైస్కూల్‌ వాకిళ్ల నుంచి అనంతగిరి గిరుల నుంచి కోదాడ కళాశాలల కదన రంగాల నుంచి మరిగిన యవ్వనరక్తం కదా ”అగ్ని కణం నా కవితగా రాయించింది. చదువుకుంటూ పోతుంటే కాల రక్తకణాలన్నీ నరాల్లో కవిత్వ రక్త ప్రసరణలయ్యాయి.

తన్మయత్వ అత్యున్నత శిఖరం కవిత్వం. అది సమాజాన్ని మార్చే నవత్వం. అక్షరం నా వయసును దరిచేరనివ్వని మహాస్త్రం. అక్షరం ఒక సమ్మోహనాస్త్రం. నేను సన్యసించినా అక్షరమే, సంతోషించిన అక్షరమే, నా కన్నీళ్ల కష్టాలకు అక్షరాలే మహా ఓదార్పులు. పిరికితనం ఆవహించిన ప్పుడల్లా నన్నులేపిన ధైర్యవచనం కవిత్వం. ఆకలైతే అన్నం పెట్టింది అక్షరం. ఆగని ఆవేశానికి మళ్లీ ప్రతి రూపం అక్షర ఆగ్రహావేశమే. నన్ను కుదుటపడేసిన మహా సందర్భం సాహిత్య సమ్మేళనమే. రాజధాని నగరం లో ధైర్యంగా అక్షరజెండా పట్టుకుని తిరుగుతున్నా ను. బోటుని పల్లకెక్కించింది అక్షరమే. విశ్రాంతి లేని నా ప్రయాణానికి అక్షరాలే ప్రశాంత క్షేత్రాలు. నా ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసల లయబద్ధ నిశ్చయ నిర్ణయస్థితి కావ్యగాన మహాకంఠానిదే. ముమ్మాటికి ఎప్పటికీ దప్పికతీర్చింది. కవిత్వమే. మాటల్లో ఎంతైనా మాట్లా డవచ్చు. మాట్లాడిన మాటల్ని తర్వాత దాటేయ వచ్చు. కానీ నాకా అవకాశం లేదు. నేను మాట్లాడిన దంతా రాసుకుంటూ పోతున్నాను. రాసిన దాన్ని అందరికీ చదివి విన్పించుకుం టూ పోతున్నాను.

నా కూతకు రాతకు మధ్య వ్యత్యాసం లేదు. నా రాత కూతనే కాదు. నాచేత కూడా కూసిరాసిందే. నాకు గుర్తెరిగిన దగ్గర్నుంచి నమ్మిన నమ్మకాలను విశ్వాసా లను వదలకుండా నడవట మేపని, అక్షరాలే నా నడకలు. అక్షరాలే నా నమ్మకాలు, అక్షరాలే నా విశ్వాసాలు, అక్షరాలే నా బతుకుగోడలు, అక్షరాలే నా ఆస్తులుపాస్తులు, అక్షరాల్ని నమ్ముకుని అక్షరాలతో పవళించి రవళించి నడుచుకుంటూ పోతుంటే ఏదీ కోల్పోయినట్లు లేదు. అంతా పొందినట్లే ఉంది. అందుకే నన్ను నేను అక్షరాన్ని చేసుకుంటూ సంచరిస్తు న్నాను. అక్షరం నా సంచారం, అక్షరం నా ఆటస్థలం, అక్షరం నా ఆత్మవిశ్వాసం, అక్షరం నా అంతరంగం మధనం, అక్షరం నా సర్వస్వం. బాల్యం, యవ్వన చదువుల వయస్సు అక్షరమైనప్పుడు బిగించిన పిడికిలి అయిన అక్షరాన్ని… చదువుల నుంచి జనజీవ న ఉద్యమాల వరకు నన్ను లాక్కుపోయింది అక్షరమే. ఆలోచనల సంఘర్షణల నుంచి ఆచరణ రూపం ధరించిన ప్రతి సమయంలోనూ దారిచూపిన దారి దీపమైన అక్షరాలు చూపిన చూపుడు వేళ్ల సాక్షిగా అక్షర పూలేలుగా అక్షర పులులుగానే కవిత్వ పాదమై నిలిచాను. అస్తిత్వ ఉద్యమాలన్నీ అక్షరాలైతున్నప్పు డు వాటిని అక్షర జెండాలు చేసి ఎగురవేశాను.

ఆలోచ నలిచ్చిన మలుపులతో కాలం చెప్పిన పాఠాలతో అక్షరాల రాసుకుంటూ ఆగకుండా అలుపుసొలుపు లేకుండా సాగుతున్నా… అక్షర తపస్సు నుంచి వచ్చిన అక్షర యవ్వనత్వ రూపంగా మారిపోయా… సమాజంలోని కలయికల పరిణామాల్లో కదలికలన్నీ నన్నెంతవరకు కదిలిస్తే అంతవరకు కదలిపోయా… నేను కడలిని కాదు… ప్రవాహాన్ని కాదు.. వీచే గాలిని కాదు… పూచే పువ్వునూ కాదు. చూసిన దాన్ని కళ్లల్లో దాచుకున్నా… దాచుకున్న దాన్ని గుండెలో పెట్టు కున్నా… నాకు ఇష్టమైన వాటినన్నింటిని వెనుతిరిగి చూడకుండా రాసుకుంటూ పోతున్నా… రాతకు ఒక సౌలభ్యం ఉంది కదా ! అనుకున్నవి.. కాకున్నవి… కాలేనివి అన్నీ రాసుకోవచ్చు.. కానీ చూసిందే రాయా లి… చెప్పింది చేసి చూపిరాయాలి… తెలంగాణ మలిదశ ఉద్యమం కోడికూతై కూస్తున్న వేళ ఉలిక్కి పడిలేవటం కదులుతున్న తెలంగాణ అస్తిత్వ మహోద్యమం వెంట ఒక గడ్డిపరకలాగా చీమలదండు వెంట చీమలాగా… మహోద్యమ పాదాల అడుగు జాడల గుర్తుల వెంట అక్షరమై నడవటమంటే అక్షరా ల అది జీవన సాఫల్యమే… తెలంగాణ నేలలో పుట్టడమే మహాద్భాగ్యం.

- Advertisement -

ఈ నేలలో అక్షర చెలిమల్లో నీళ్లుతాగిన వాళ్లంతా పాటల పిట్టల గుంపులై ఎగిసిన కవులు ఎందరెందరోకదా…. వాళ్లందరి పాదముద్రల గళగర్జనలే తెలంగాణ అక్షర పూదోటలు. ఆ తోటల్లో అక్షరాల దారుల్లో నడిచే మహాద్భాగ్యం లభించటం… మహాజనం అడుగుల వెంట వేస్తున్న దువ్వలో దుమ్ముల్లోంచి లేచిపడిన మట్టిరేణువు లాంటి అక్షరాలుగా అల్లిక చేసుకున్న అక్షరాల గూడు కదా తృప్తి… అదే మహాతృప్తి. అక్షరాల దారిలో ఆదిపత్య గోడల్ని కూలగొట్టు కుంటూ తెలుగు నేలంతా కలయతిరిగి రావటం అదృష్టం… ఒక జీవిత కాలంలోనే నినదించిన నినాదం గెలిచి కళ్లముందే విజయమై నిలవటం అక్షరాలు సాధించిన ఘన విజయం. గెలుపోటము ల్ని సమంగా చూడగల దార్శనిక ఆలోచన అక్షరాలకే ఉంది. అందరం కలిసి అక్షరాలమై నడుద్దాం. అక్షరా లమై కలిసి పోతుంటే బాగుంటది. అక్షర పిట్టలమై ఎగిరిపోదాం. అక్షర గూళ్లను కట్టుకుందాం. మహాజనావళికి కాపలాకాసే అక్షరాలమవుదాం పద. మనం అక్షరాలమై జీవించి జీవికకు జీవంపోద్దాం పద.

– తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, జూలూరి గౌరీశంకర్

Advertisement

తాజా వార్తలు

Advertisement