Friday, April 26, 2024

గ్రూప్‌ -1 పుస్తకాల్లో స్వల్ప మార్పులు చేసిన తెలుగు అకాడమీ.. అందుబాటులో జాగ్రఫీ బుక్​

గ్రూప్‌ -1 పాఠ్యాంశాల్లో తెలుగు అకాడమీ అధికారులు స్పల్ప మార్పులు చేశారు. తెలంగాణ జాగ్రఫీ, ఎకానమీ పుస్తకాల్లో వర్తమాన అంశాలకు చాన్స్​ కల్పించారు. ఈ మేరకు తెలుగు అకాడమీ కసరత్తును పూర్తిచేసింది. ఇప్పటికే తెలంగాణ జాగ్రఫీ పుస్తకం అందుబాటులోకి తేగా, ఎకానమీ పుస్తకం రెడీ అవుతున్నట్టు అధికారులు తెలిపారు. పది రోజుల్లో ఈ పుస్తకం ముద్రణ పూర్తయి.. అందుబాటులోకి రానున్నదని తెలిపారు. ఇటీవలే 503 గ్రూప్‌ -1 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. సిలబస్‌ను గతంలోనే ఖరారుచేయగా, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ రెండు పుస్తకాల్లో స్వల్పమార్పులు చేశారు.

కొన్ని మార్పులు..
తెలంగాణ జాగ్రఫీలో కొన్ని మార్పులు చేపట్టారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో భౌగోళిక స్వరూపం మారింది. పట్టణాలు స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చెందుతున్నాయి. వాటన్నింటిపై ప్రశ్నలడిగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో ఆయా పాఠ్యాంశాలను చేర్చారు. పెద్ద జిల్లా, చిన్న జిల్లా, అక్షరాస్యత రేటు, లింగ నిష్పత్తి వంటి అంశాలను పుస్తకాల్లో చేర్చారు. ఎకానమీ సబ్జెక్టులో బడ్జెట్‌పై చాలా ప్రశ్నలిస్తాయి. తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌ వివరాలను ఎకానమీ పుస్తకాల్లో చేర్చారు. తాజా జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం గణాంకాలు, సెక్టోరల్‌ ట్రెండ్స్‌, సర్వీస్‌ సెక్టార్‌ ట్రెండ్స్‌, ఖాయిలా పడ్డ పరిశ్రమలకు ప్రొత్సాహకాలు, పారిశ్రామిక పాలసీలపై ప్రశ్నలుంటాయి. తాజా ఆర్థిక సర్వే, కాగ్‌ నివేదికల్లోని ముఖ్యాంశాలను సైతం పాఠ్యాంశాల్లో చేర్చారు.

లక్ష పుస్తకాల విక్రయం..
నోటిఫికేషన్ల నేపథ్యంలో తెలుగు అకాడమీ పుస్తకాలకు తీవ్ర డిమాండ్‌ ఉంటున్నది. ఉద్యోగార్ధులు తెలుగు అకాడమీ ముద్రించిన పుస్తకాలనే ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో పుస్తక విక్రయాలు పెరిగాయి. గత నెలన్నర రోజుల వ్యవధిలో లక్షకు పైగా పుస్తకాలను విక్రయించినట్లుగా తెలుగు అకాడమీ అధికారులు వెల్లడించారు. ఇక తాజా డిమాండ్‌ నేపథ్యంలో పుస్తకాలను పునః ముద్రణకు సన్నాహకాలు చేస్తున్నారు. ఇటీవలే ముద్రణకవసరమయ్యే పేపర్‌ను సమీకరించేందుకు టెండర్లు పూర్తిచేశారు. 10 రోజుల్లోగా కొత్త పుస్తకాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement