Sunday, April 28, 2024

Telangana – రాజకీయాల్లో రేవంత్ మార్క్- ఆపరేషన్.. ఆకర్ష్!

హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయం రసవత్తరంగా మారుతోంది. నిన్న మొన్నటి దాకా అసెంబ్లీ ఎన్నికల వేడి తగ్గుతున్న తరుణంలో లోక్‌సభ ఎన్నికలు మళ్లీ రాజకీయ వేడిని రగిలిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ పరంపర సాగించి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ మరోసారి దూకుడు పెంచింది.

ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న రెండు లోక్‌సభ స్థానాలనూ కైవసం చేసుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని స్థానాలను గెలిచిన బీఆర్‌ఎస్‌ను ఈ సారి కోలుకోలేని దెబ్బతీసేలా వ్యూహం పన్నుతోంది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలను కారు దించి హస్తం వైపు మళ్లించే పనిలో కాంగ్రెస్‌ నేతలు బిజీగా ఉన్నారు. దీంతో ఈ సారి రాజకీయ సమీకరణలు ఎలా ఉంటాయోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

.లోక్సభ ఎన్నికలు కొంత ముందస్తుగానే జరిగే అవకాశం ఉండడంతో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో మరింత బలపడేందుకు కసరత్తు మొదలు పెట్టింది. లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, కీలక నేతలను తమ వైపు తిప్పుకునేందుకు ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’ను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానాల పరిధిలో బీఆర్‌ఎస్‌ కంటే వెనుకబడిన కాంగ్రెస్‌.. లోక్సభ ఎన్నికల నాటికి పూర్తిస్థాయిలో పుంజుకుని ఈ రెండు స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

ఇందుకోసం ప్రత్యర్థులను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.బీఆర్ఎస్ నుంచి చేరికలపై ఫోకస్అయితే.. మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్‌కు ఆర్థికంగా నిలబడే బలమైన నేతలు లేరు. దీంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా తర్జనభర్జన జరుగుతున్నట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆర్థికంగా బలమైన బీఆర్‌ఎస్‌కు చెందిన ఓ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని వీరిద్దరికీ మేడ్చల్‌, మల్కాజిగిరి లోక్‌సభ టికెట్లు ఇస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి కుటుంబంతో ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతలు మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్లాన్ చేసినా..వాస్తవానికి ఎన్నికలకు ముందుగానే వారిని కాంగ్రెస్‌లో రప్పించే ప్రయత్నాలు జరిగినప్పటికీ అప్పటికే మహేందర్‌రెడ్డి సోదరుడు నరేందర్‌రెడ్డి కొడంగల్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దీంతో పాటు మహేందర్‌రెడ్డి పార్టీ మారకుండా కట్టడి చేసేందుకు ఆయనకు బీఆర్‌ఎస్‌ మంత్రి పదవి ఇవ్వడంతో ఆయన వెనక్కి తగ్గారు. ఆయన మంత్రి అయిన తరువాత కూడా కాంగ్రెస్‌ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. మంత్రి పదవి ఇవ్వడమే కాక ఆయన సతీమణి వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డికి ఎంపీ టికెట్‌ ఇస్తామని కాంగ్రెస్‌ పెద్దలు ఆఫర్‌ ఇచ్చారు. అయితే ఎన్నికలకు కొద్ది రోజులే గడువు ఉండడంతో మహేందర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి బీఆర్‌ఎస్‌లోనే కొనసాగారు.

- Advertisement -

అయితే, ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మహేందర్‌రెడ్డికి కాంగ్రెస్‌ నుంచి ఆహ్వానం అందింది. బీజేపీ, బీజేపీ అభ్యర్థులకు దీటుగా అయితే.. ఎంపీ సీటు మహేందర్‌రెడ్డికి ఇవ్వాలా? లేక ఆయన సతీమణి సునీతారెడ్డికి ఇవ్వాలా? అనే దానిపై కాంగ్రెస్‌లో చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. సునీతారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌గా రెండు దఫాలు ఎన్నికయ్యారు. దీంతో ఆమె పేరును కూడా కాంగ్రెస్‌ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం తాండూరు మున్సిపల్‌ చైర్మన్‌ పీఠం మహేందర్‌రెడ్డి వర్గం చేతిలో ఉంది. వీరంతా ఇపుడు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. దీన్ని బట్టి చూస్తే మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమేనని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మల్కాజిగిరి లోక్సభ స్థానంపై అనేక మంది చూపు ఉన్నప్పటికీ.. ఇక్కడ నుంచి బీఆర్‌ఎస్‌, బీజేపీ నుంచి బలమైన వ్యక్తులు రంగంలో దిగే అవకాశం ఉండడంతో అధికార కాంగ్రెస్‌ కూడా దీటైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నట్లు తెలిసింది.

ప్రతిష్టాత్మకంగా మల్కాజిగిరి స్థానంకాంగ్రెస్‌కు ఇది సిట్టింగ్‌ స్థానం కావడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించినందున ఈ సీటును కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో ఎన్నికల ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంటుంది. ప్రధాన పార్టీలు ఒక్కొక్కటీ కనీసం రూ. 100 కోట్లకు పైగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్థికంగా బలమైన వ్యక్తిని రంగంలో దింపాలని కాంగ్రెస్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల పేర్లు పరిశీలనలో ఉన్నా ఆర్థిక మూలాలు బలంగా ఉన్న బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే వైపే కాంగ్రెస్‌ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యేలు ఉక్కిరి బిక్కిరి!ఇదిలా ఉంటే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అధికార కాంగ్రెస్‌ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వారిని నేరుగా పార్టీలోకి ఆహ్వానించకుండానే వారి చుట్టూ ఉన్న బలమైన నేతలను కాంగ్రెస్‌లోకి రప్పించుకునే యత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని మున్సిపల్‌, కార్పొరేషన్‌ పీఠాలపై గురిపెట్టింది. దీంతో అనేకచోట్ల అవిశ్వాస తీర్మానాలు మొదలయ్యాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏమి చేయాలో తెలియక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు.

మరోవైపు గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతి అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల భాగోతాలన్నింటినీ కాంగ్రెస్‌ ప్రభుత్వం తవ్వి తీస్తోంది. ముఖ్యంగా నగర శివార్లలోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నేరుగా, లేదా ప్రత్యక్షంగా చేసిన భూ దందాలపై దృష్టి సారించింది. వీటి సమాచారం సేకరించి అంతర్గత విచారణ కూడా మొదలు పెట్టింది. దీంతో అప్పట్లో భూ దందాల వెనుక ఉన్న బీఆర్‌ఎస్‌ నేతల్లో గుబులు మొదలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement