Thursday, April 25, 2024

India | ఆ దోషులను రిలీజ్​ చేయొద్దు.. సుప్రీంకోర్టుని అభ్యర్థించిన స్మితా సబర్వాల్​

మాజీ ఐఏఎస్​ అధికారి జి. కృష్ణయ్య హత్యకేసులో దోషులను రిలీజ్​ చేయాలన్న బిహార్​ ప్రభుత్వం నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని, దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని తెలంగాణ సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్​ అన్నారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు మనోధైర్యాన్ని కోల్పోతారని, న్యాయ నిర్వహణను కూడా దెబ్బతీసిన వారవుతారని ట్విట్టర్​లో పేర్కొన్నారు.. ట్విట్టర్​ వేదికగా తన అభిప్రాయాలను షేర్​ చేసిన స్మితా.. సెంట్రల్​ ఐఏఎస్​ అసోసియేషన్ లేఖని కూడా రీ ట్వీట్​ చేశారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ​

బిహార్‌లో ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్య హత్యకేసులో ప్రమేయం ఉన్న దోషుల విడుదలపై జోక్యం చేసుకోవాలని భారత అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) సీనియర్ అధికారి స్మితా సబర్వాల్ సుప్రీంకోర్టుతో పాటు.. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్​ని అభ్యర్థించారు. కృష్ణయ్య కుటుంబానికి తెలంగాణ సీఎం కార్యదర్శి స్మిత సబర్వాల్​ బుధవారం సంఘీభావం తెలిపారు. ‘‘ఈ నిర్ణయం కనుక అమలైతే సివిల్ సర్వెంట్‌గా ఉండటం మంచిదేనా? అని కొన్నిసార్లు ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఇట్లాంటి విషయాల్లో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు సీజేఐని అభ్యర్థించండి’’ అని స్మిత సబర్వాల్​ తన అభిప్రాయాలను ట్వీట్ ద్వారా వెల్లడించారు. గోపాల్‌గంజ్ జిల్లా మాజీ మేజిస్ట్రేట్ అయిన జి. కృష్ణయ్యను దారుణంగా హత్య చేసిన కేసులో దోషులను విడుదల చేయాలనే బిహార్ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై సెంట్రల్ ఐఏఎస్ అసోసియేషన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. కాగా, ఆ ప్రకటనను స్మితా సబర్వాల్​ రీట్వీట్ చేశారు.

 

విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని హత్య చేసినట్లు అభియోగాలు మోపబడిన దోషిని విడుదల చేయడం తగదని, విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగిని హత్య చేసిన దోషి విడుదలకు దారితీసే ప్రస్తుత చట్టాలను సవరించడం న్యాయాన్ని తిరస్కరించినట్లేనని ఐఏఎస్ అసోసియేషన్ పేర్కొంది. ఇలా చేయడం వల్ల తక్కువ శిక్షార్హతకు దారితీస్తుందని, ప్రభుత్వోద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందని, పబ్లిక్ ఆర్డర్‌ను దెబ్బతీస్తుందని, న్యాయ నిర్వహణను అపహాస్యం చేస్తుందని ఐఏఎస్​ అసోసియేషన్​ ప్రకటనలో పేర్కొంది. బిహార్​ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వీలైనంత త్వరగా పునఃపరిశీలించాలని ఈ సందర్భంగా అసోసియేషన్ అభ్యర్థించింది.

- Advertisement -

హైదరాబాద్‌లో నివసిస్తున్న కృష్ణయ్య కుటుంబం.. బ్యూరోక్రాట్‌పై దాడికి ప్రేరేపించిన మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్‌ను విడుదల చేయడంలో జోక్యం చేసుకొని, తక్షణమే ఆపాలని ప్రధాని నరేంద్ర మోదీని ఐఏఎస్​ అసోసియేషన్​ అభ్యర్థించింది. బిహార్ జైలు మాన్యువల్‌ను సవరించడం ద్వారా మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్‌ను విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, హత్యకు గురైన దళిత ఐఏఎస్ అధికారి భార్య ఉమ అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోక్యం చేసుకుని సీఎం నితీష్ కుమార్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చేయాలని, ఇది ఒక చెడు నిర్ణయంగా మారకూడదని, మొత్తం సమాజానికి తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుందని ఉమ అన్నారు. తన భర్త ఐఏఎస్ అధికారి అని, న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆమె అన్నారు. రాజ్‌పుత్‌ల ఓట్ల కోసం, మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన భర్తను చంపిన వ్యక్తిని విడుదల చేస్తున్నారని ఆమె ఈ సందర్భంగా ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement