Thursday, May 2, 2024

దళితబంధు భద్రతకు ప్రత్యేక చట్టం.. ఈ నెల 16 నుంచి అమలు

దళితులకు ఆర్థిక సాధికారత, స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకం ఈ నెల 16 నుంచి అమలు కానుంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. పైలట్‌ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని ఎంపిక చేసింది. దళితులను పెట్టుబడిదారులుగా అభివృద్ధి చేయడం కోసం ప్రతి జిల్లాలో ‘సెంటర్‌ ఫర్‌ దళిత్‌ ఎంటర్‌ప్రైజ్‌’ ఏర్పాటు చేయాలని తీర్మానించింది. అందుకు పూర్తిస్థాయిలో అధికారయంత్రాంగం సిద్ధం కావాలని ఆదేశించింది. పథకం అమలు, విధి విధానాల రూపకల్పనపై రాష్ట్రమంత్రివర్గం విసృ్తతంగా చర్చించింది. పథకం పూర్వాపరాలను సీఎం కేసీఆర్‌ మంత్రివర్గ సహచరులకు విశదీకరించారు. రాష్ట్రంలోని ఆన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, ఫలితాలు ప్రజల అనుభవంలో ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. దళితబంధు పథకానికి చట్టభద్రత కల్పిస్తూ ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని కేబినెట్ అభిప్రాయపడింది. గతంలో ఎస్సీ ప్రగతి నిధి చట్టం తెచ్చి, ఒక బడ్జెట్‌లో దళితులకు కేటాయించిన నిధులలో మిగిలిన నిధులను తర్వాతి బడ్జెట్‌కు బదలాయించే విధానం తీసుకొచ్చామని, ఆ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, అదేవిధంగా దళితబంధు కూడా దేశానికి దారి చూపే పథకం అవుతుందని మంత్రివర్గం అభిప్రాయపడింది

ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం అధ్యక్షతన ఆరు గంటలకు పైగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రజాసంక్షేమానికి సంబంధించిన అనేక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. దళిత బంధు అమలుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపిన వెంటనే షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధిశాఖ ఈ పథకం కోసం రూ.250 కోట్లను విడుదలచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కరోనా కారణంగా తల్లిదండ్రులు చనిపోయి ఆనాథలైన పిల్లలను పూర్తిస్థాయిలో సంరక్షించుకోవాలనే అంశంతో మంత్రివర్గ సమావేశం మొదలైంది. తర్వాత రైతులకు రూ.50 వేల రుణమాఫీ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకొన్నది. తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో పత్తి పంట సాగును మరింత పెంచాలని తీర్మానించింది. వృద్ధాప్య పెన్షన్‌ వయోపరిమితిని 57 ఏండ్లకు కుదిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. ధోబీఘాట్లు, సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ సరఫరాను వారంలోగా సంపూర్ణంగా అమలుచేయాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ టికెట్ రెడ్డి వర్గానికా? బీసీలకా ?

Advertisement

తాజా వార్తలు

Advertisement