Wednesday, May 15, 2024

తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు.. ఇంటర్ పరీక్షలు వాయిదా

కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే సీబీఎస్‌ఈ టెన్త్ పరీక్షలను రద్దు చేసిన క్రమంలోనే తెలంగాణలో కూడా పరీక్షలను రద్దు చేసేందుకే ప్రభుత్వం మొగ్గు చూపింది. ఇక ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేస్తూ.. రెండో సంవత్సరం పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను నేరుగా సెకండియర్‌కు ప్రమోట్ చేస్తారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ గురువారం అధికారులతో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అటు వాయిదా వేసిన ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలను జూన్ మొదటి వారంలో నిర్వహించే అవకాశముంది. ఇదే విధంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరికొన్ని రాష్ట్రాలు పది, ఇంటర్ పరీక్షలను రద్దు, వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుముందు మహారాష్ట్ర, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు పది, ఇంటర్ పరీక్షలను వాయిదా వేశాయి. అయితే.. హర్యానా, తెలంగాణ, తమిళనాడు లాంటి రాష్ట్రాలు పదో తరగతి బోర్డు పరీక్షలను మొత్తానికే రద్దు చేసి, విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement