Monday, May 13, 2024

తెలంగాణ‌లో డ‌బుల్ స్కీం ర‌చ్చ‌…త‌ల‌లుప‌ట్టుకుంటున్న నేత‌లు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : పేదల సొంతింటి కల తీర్చా లన్న ప్రభుత్వ ప్రయత్నం క్షేత్రస్థాయిలో బెడిసికొడుతోంది. దశలవారీగా ఇళ్ళ నిర్మాణాల లక్ష్యాన్ని నిర్ధేషించుకుని చిరకాల వాంఛను తీర్చాలన్న వ్యూహం రాజకీయ రంగు పులుము కుంటోంది. 2018 ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రయత్నాలు కొంతమేరకు ఫలించి డబుల్‌ బెడ్‌రూం పథకం ఇళ్ళ నిర్మాణం పూర్తయింది. దాదాపు సగానికి పైగా నియోజకవర్గాల్లో పంపిణీ కి సిద్ధమయ్యాయి. కానీ, అసలు సమస్య అక్కడే మొదలయ్యింది. లబ్ధిదారలు ఎంపిక ప్రక్రియ అనేక చోట్ల గందరగోళ పరిస్థితులకు దారితీస్తుండడంతో రోజుకో కొత్త కోణంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అర్హులైన లబ్ధిదారుల్లో ఇప్పుడు నిర్మాణం పూర్తయిన ఇళ్ళు సుమారుగా 10శాతం మాత్రమే కావడంతో వివాదం చెలరేగుతోంది. లబ్ధి పొందేవారికన్నా ఆశావహుల 90 శాతం ఎక్కువగా ఉండడంతో వారిలో ఉన్న ఆందోళనను తగ్గించడం స్థానిక ఎమ్మెల్యేలకు కొరకరాని కొయ్యలా తయారైంది. అందుకు తోడు పుండుపై కారం చల్లినట్లుగా స్థానిక విపక్ష నేతలంతా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండడంతో రాజకీయ వివాదాలు రాజుకుంటున్నాయి.

అసలే ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతుంటే.. జరుగుతున్న రాద్దాంతంపై ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. ఈ పంచాయతీలు అంతటితో ఆగకుండా ఆయా జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులకు చుట్టుకుంటున్నాయి. పలుమార్లు ప్రభుత్వాధినేత వద్ద కూడా ఇందుకు సంబంధించిన పంచాయతీలు జరిగాయి. అయినా సమస్యకు పరిష్కార మార్గం దొరకడం లేదు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ‘డబుల్‌’ స్కీం లబ్ధిదారలు ఎంపిక ప్రక్రియ ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడంతో రెండు సార్లు లబ్ధిదారుల జాబితాలు రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గజ్వేల్‌తో పాటు కామారెడ్డి, భైంసా, గద్వాల తదితర నియోజకవర్గాల్లోనూ సమస్య పరిష్కారానికి అందకుండా పోతోంది. విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలున్న పలు నియోజకవర్గాల్లో సమస్యలు మరో కోణంలో ఉత్పన్నమవుతున్నాయి. తమకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా లబ్ధిదారుల ఎంపిక ఎలా చేస్తారని నిలదీస్తూ జిల్లా కలెక్టర్ల వద్ద ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగుతున్నారు.
దాదాపు అన్ని నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక సమస్య స్థానిక ఎమ్మెల్యేలకు రాజకీయ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోంది. నిర్మాణం పూర్తయిన ఇళ్ళ పంపిణీ ప్రక్రియ వ్యవహారం తమకొద్దంటూ ముఖ్యమంత్రి వద్ధ మొరపెట్టుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లక్కీ డ్రా పద్దతిలో టాస్‌ వేసేందుకు ఇల్ళులేని పేదలంతా ససేమిరా అంటున్నారు. దీంతో లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం తలెత్తి.. ఈ వ్యవహారం ఎమ్మెల్యేకే కాదు.. స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తోంది. ఎన్నికల వేళ మాట నిలబెట్టుకోవాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో హడావుడిగా ‘డబుల్‌’ ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తిచేసిన అధికార యంత్రాంగం కూడా లబ్ధిదారుల ఎంపికలో ప్రత్యామ్నాయం కనిపించక తికమకపడుతున్నారు. ఉద్రిక్త పరిస్థితులతో కొన్ని నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన జాబితాలు రద్దు చేయడం, ఆ పంచాయతీ కలెక్టర్ల వద్ద ఉండడం ఎమ్మెల్యేలకు ముందరికాళ్ళకు బంధంగా మారుతోంది. పలు చోట్ల ఘర్షణలతో మంత్రుల వద్ద ఎమ్మెల్యేలు పంచాయతీ పెడుతూ తమ గోడును వెల్లబోసుకుంటున్నారు.

జాబితాల్లో చోటు దక్కని పేదల ఆవేదన, ఆక్రందన ఎన్నికల వేళ తీవ్రమైన ప్రతికూల పరిస్థితులకు దారితీసే ప్రమాదం ఉండడంతో ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. డబుల్‌ బెడ్‌రూం పథకం ఇళ్ళు అర్హుల్లో 10శాత మందికే ప్రస్తుతం అందుబాటులో ఉండడం, సరిగ్గా అది ఎన్నికల సమయం కావడం సమస్యాత్మకమవుతోంది. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, సంబంధిత అంశాల పరిష్కారంపై ఇటీవల మంత్రి కేటీ-ఆర్‌ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చించింది. ఇళ్ల స్థలాలు, నిరుపేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ సహా సంబంధిత సమస్యలు, ఇతర అంశాలన్నింటిపై ఈ భేటీ-లో సమాలోచన జరిపినా సరిష్కారమార్గం సూచించలేకపోయారు. మంత్రులు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌లు ఈ ఉపసంఘంలో సభ్యులగా ఉన్నారు.

ఇదిలా ఉండగా నిన్నటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 2023-24 వార్షిక సంవత్సర బడ్జెట్‌లో ప్రభుత్వం సొంత స్థలాల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించుకునేందుకు ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.7,350కోట్లు- కేటాయించింది. ఇళ్ళు లేని ప్రతి కుటు-ంబానికి రూ.3లక్షల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు- తెలిపింది. అలాగే వచ్చే ఏడాదికి డబుల్‌ బెడ్‌రూమ్‌ పథకం కింద గృహాల నిర్మాణానికి చర్యలు వేగవంతం చేయనున్నట్లు- ప్రభుత్వం శాసనసభకు వెల్లడించింది. ప్రభుత్వం ఇంతవరకు 2.75 లక్షల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను మంజూరు చేయగా దాదాపు 1.37 లక్షల గృహాల నిర్మాణం పూర్తయింది. మరో 53,984 ఇళ్ల నిర్మాణం 90 శాతం పూర్తి కాగా మిగతావి నిర్మాణదశలో ఉన్నాయి. లబ్ధిదారుల వాటా లేకుండా ప్రభుత్వమే పూర్తి నిధులు వెచ్చించి చేస్తున్న నిర్మాణాలు వేగంగా పూర్తిచేసి అందించనున్నట్లు- ప్రభుత్వం వివరించింది.

- Advertisement -

2023-24లో 4లక్షల లబ్ధిదారులకు సాయం
ఈ మేరకు లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించేందుకు సాంకేతిక సహాయాన్ని తీసుకోనున్నామని, ఇంతవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గృహ నిర్మాణాల్లో లబ్ధిదారులుగా ఎంపి-కై-న వారు దరఖాస్తుదారుల్లో ఉంటే వారిని తొలగించి, ఏ పథకం కింద లబ్ధి పొందనివారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు- తెలిపింది. సొంత జాగాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం 2023-24లో 4లక్షల మంది వరకు లబ్ధిదారులకు సాయం అందించనుంది. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లో 2,21,800 మందికి, గ్రామీణ ప్రాంతాల్లో 1,78,200 మందికి ఆర్థికసాయం అందించడానికి నిర్ణయించింది. దాదాపుచ రెండేళ్ళ పాటు కరోనా విపత్కర పరిస్థితులు, తదితర కారణాలతో రెండేళ్లుగా గృహ నిర్మాణాలు నెమ్మదించాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదికి పీఎంజీఎస్‌వై గ్రామీణ, పట్టణ, డబుల్‌ బెడ్‌రూమ్‌, సొంత జాగాల్లో గృహాల పథకం కింద మొత్తం 5.35 లక్షల ఇళ్లకు లక్ష్యం పెట్టు-కుంది.

జిల్లాస్థాయి కమిటీకి కలెక్టరే కన్వీనర్‌
డబుల్‌ బెడ్‌రూమ్‌ పథకాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. జిల్లాస్థాయిలో కలెక్టర్లకు బాధ్యతలు ఇవ్వడంతో పాటు- రూ.150 కోట్ల వరకు పరిపాలన మంజూరు అధికారాన్ని అప్పగించింది. ఈ పథకం కోసం బస్తా సిమెంటు- రూ.230కే ఇచ్చేలా ఇప్పటికే సిమెంటు- కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో గుత్తేదారులు ఎక్కువమంది పాల్గొనేందుకు వీలుగా ఈఎండీ మొత్తాన్ని 2.5 శాతం నుంచి ఒక శాతానికి, ఎఫ్‌ఎస్‌డీ మొత్తాన్ని 7.5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించింది. అలాగే లబ్ధిదారుల ఎంపిక కోసం మంత్రి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలతో జిల్లాస్థాయి కమిటీ-ని ఏర్పాటు- చేసి, ఈ కమిటీ-కి కన్వీనర్‌గా కలెక్టరును నియమించింది. గ్రామస్థాయిలో దరఖాస్తులు తీసుకుని గ్రామసభల ద్వారా అర్హులను ఎంపిక చేస్తోంది. గ్రామసభలు ఆమోదించిన లబ్ధిదారుల జాబితాలను తహశీల్దార్లు కలెక్టర్లకు పంపితే ఆ జాబితాలకు షెడ్యూలు ప్రకారం లాటరీ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. జీహెచ్‌ఎంసీకి వెలుపల చేపట్టిన ఇళ్లలో నియోజకవర్గానికి 10శాతం లేదా వెయ్యి ఇళ్లు ఇందులో ఏది తక్కువైతే ఆ మొత్తంలో స్థానిక లబ్ధిదారులకు రిజర్వ్‌ చేస్తారు.

సీఎం ఇలాఖాలో ‘డబుల్‌’ ఇళ్ళ లొల్లి
అధికారుల వైఫల్యం కారణంగా గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల లొల్లి మళ్లీ మొదటికొచ్చింది. తాజాగా తుది జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో చోటు- దక్కని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనర్హులకే దక్కాయంటూ ఆరోపణలు వెల్లువెత్తడం, ఈ క్రమంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో సమస్య తీవ్రతను పెంచింది. ఈ క్రమంలోనే ఈ అంశాన్ని స్థానిక నేతలు మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు.

తుది జాబితాపై దుమారం
సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ-కి మొత్తం 1,250 ఇళ్లను మంజూరు చేశారు. ఒక్కో ఇళ్లు 570 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మాణం జరిగింది. 156 బ్లాకులుగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఒక్కో బ్లాకులో కింద నాలుగు, పైన నాలుగు(మొత్తం 8 ఇళ్లు) రెండు ప్లnోర్లుగా నిర్మించారు. ఈ క్రమంలో లబ్ధిదారుల ఎంపికకు 2021 మే 13 నుంచి ???20 వరకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టిన సంగతి కూడా తెలిసిందే. మొత్తంగా 4,106 దరఖాస్తులను ప్రజలు అందించగా.. అందులో 3,518 మందిని పరిగణనలోకి తీసుకొని క్షేత్రస్థాయిలో విచారణ చేశారు. అనంతరం గత నెల ఫిబ్రవరి 3న 1,118 మందితో ప్రాథమిక జాబితాను విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. జాబితాలో అనర్హులు పేర్లు ఉన్నాయని సుమారుగా 720కిపైగా ఫిర్యాదులు వచ్చాయి.

అధికారుల తప్పిదం వల్లే సమస్యలు
డబుల్‌ ఇళ్ల వ్యవహారం వివాదస్పదం కావడానికి అధికారుల తప్పిదమే కారణమని స్పష్టమవుతోంది. లబ్ధిదారుల ఎంపిక సందర్భంలో అధికారులు వాడిన సాప్ట్‌nవేర్‌ లోపాల కారణంగా అనర్హులకు ఇళ్లు దక్కాయని తెలుస్తోంది. నిజానికి లబ్ధిదారుల పేరిట వేరే ఇతర ఆస్తులు, ఇళ్లు, ఖరీదైన వాహనాలు ఉంటే ఈ పథకానికి పరిస్థితుల్లో అర్హులు కారు. సాప్ట్‌nవేర్‌ లోపాల వల్ల ఇవన్నీ ఉన్నా ఎంతోమంది పేర్లు జాబితాలో కనిపించడం వల్ల సమస్యలు వస్తున్నాయి. ఈ అంశాలను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (టీ-ఎస్‌ఎఫ్‌డీసీ) చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, స్థానిక మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి తదితరులు మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు.

బైంసాలో దరఖాస్తుల గందరగోళం
బైంసా పట్టణంలోని 26 వార్డుల నుంచి డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల కోసం దాదాపు 8000 పై చిలుకు దరఖాస్తులు వచ్చాయి. మొత్తం దాదాపు 640 డబుల్‌ బెడ్రూమ్స్‌ను నిర్మించగా, దీంట్లో గుండెగాం ముంపు గ్రామ ప్రజల కోసం దాదాపు 200 ఇండ్లు తాత్కాలిక నివాసంగా ఏర్పాటు- చేశారు. మిగతా 440 ఇండ్లకు ఇటీవల లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించారు. డ్రాలో పేరు రాని ప్రజలు డబుల్‌ ఇళ్లు రాకపోయినా, స్థలం ఉన్నా వారికి ఇంటినిర్మాణం నిమిత్తం అందించే రూ.3 లక్షల స్కీమ్‌లో అయినా అర్హులుగా ఉంటామా..? లేదా..? అని అనుమానాలతో స్థానిక లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. అందుకు స్థానిక విపక్ష నాయకులు ఆజ్యం పోస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement