Sunday, May 5, 2024

బిఆర్ఎస్ కు తెలుగుదేశం గండం – రోజు రోజుకి పుంజుకుంటున్న సైకిల్

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న తెలుగుదేశం పార్టీ వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుందా? ఆ పార్టీని తక్కువగా అంచనా వేస్తే ముప్పు తప్పదా? గత రెండు ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఓట్లను బట్టి చూస్తే అధికార బీఆర్‌ఎస్‌ ఓట్లకు గండికొట్టే ప్రమాదం లేకపోలేదని టీటీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో తాజా అంచనాల ప్రకారం 30 సెగ్మెంట్లు అనుకూలంగా ఉన్నాయని, ఈ ఏడాది ఆఖరులో జరగనున్న ఎన్నికల్లో కనీసం 20 సీట్లు గెలుచుకోవాలని, హంగ్‌ అంటూ ఏర్పడితే చక్రం తిప్పవచ్చని ఆ పార్టీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించిన పార్టీగా 2014, 2018 ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ ప్రస్తుత బీఆర్‌ఎస్‌ పార్టీకే పట్టం కట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన తొలి ఎన్నికల కంటె ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ జైత్రయాత్ర కొనసాగించి అధికారాన్ని చేజిక్కించుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఆంధ్రా పార్టీ అని విమర్శలు ఉన్న టీడీపీ 15 నియోజకవర్గాలలో గెలిచి సంచలనం సృష్టించడం విశేషం. అంతేగాక చాలా నియోజకవర్గాల్లో రెండోస్థానంలో నిలిచి రాజకీయ పార్టీలనే గాక కరుడుగట్టిన తెలంగాణ వాదులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వారంతా బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్య, కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాత్రం టీడీపీ సభ్యులుగానే కొనసాగారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్వ ఖమ్మం జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో గెలవడం విశేషం.

ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నుంచి మెచ్చ నాగేశ్వరరావు, సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య మరోమారు ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు. ఖమ్మం, వరంగల్‌ వెస్ట్‌, మహబూబ్‌నగర్‌, సనత్‌ నగర్‌, మలక్‌పేట, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌ పల్లి, ఉప్పల్‌ నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఈ ఎన్నికల్లో టీడీపీకి 3.5 శాతం ఓట్లు వచ్చాయి. పాతబస్తీలో 7 స్థానాల్లో గెలిచిన మజ్లిస్‌ పార్టీకంటె టీడీపీకే ఓట్ల శాతం ఎక్కువగా రావడం ఇంకో విశేషం. మజ్లిస్‌ పార్టీకి 2.7, సీపీఐ, సీపీఐ (ఎం) పార్టీలకు 0.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించి టీఆర్‌ఎస్‌ను భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా మార్చడమే గాక ఏపీ, ఒడిశా రాష్ట్రాలలో కమిటీలను సైతం ప్రకటించారు. మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో టీడీపీ సైతం తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. తెలంగాణలో పోయిన ప్రతిష్టను తిరిగి సాధించాలనే లక్ష్యంతో ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్‌.చంద్రబాబునాయుడు పక్షం రోజులకోసారి తెలంగాణ పార్టీ నేతలతో సమీక్షలు జరుపుతూ గెలుపు వ్యూహాలను రచిస్తున్నారు. టీటీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు స్థానంలో ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్‌ను నియమించి తన లక్ష్యాన్ని చెప్పకనే చెప్పారు. ఎస్సీ, ఎస్టీలు, యాదవులు, మున్నూరు కాపులు, ముస్లింలు, ముదిరాజ్‌ సామాజిక వర్గాలకు చెందిన వారే పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొత్తం జనాభాలో ఈ వర్గాలు సగం ఉంటాయి. టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందా? లేక బీజేపీ లేదా జనసేనతో కలిసి పోటీ చేస్తుందా? అనే విషయం ఇంకా తేలలేదు. ఇప్పటికే మాతృ సంస్థ టీడీపీలో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. కాసాని బాధ్యతలు తీసుకున్న తర్వాత ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన నేతలు పెద్ద సంఖ్యలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటు న్నారు. గత రెండు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచిన కమ్మ, బీసీ సామాజిక వర్గాలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ రాకతో ఆ పార్టీ వైపు మళ్లే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో సగం మంది టీడీపీకి చెందిన వారే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్లు వస్తే సరి లేకపోతే పరిస్థితేంటి? అనివార్యంగా టీడీపీ తరపున పోటీ చేసే పరిస్థితి ఏర్పడుతుందని టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంమీద 30 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఓట్లకు గండిపడుతుందని, పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement