Thursday, April 25, 2024

విజయసాయి సింహాచల దర్శనంపై వివాదం.. సంప్రోక్షణ చేయాలని డిమాండ్

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి దర్శనం ఇప్పుడు వివాదాస్పదమైంది. శుక్రవారం సింహాచలంలో విజయసాయిరెడ్డికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఇది నిబంధనలకు విరుద్ధమంటూ తెలుగుదేశం పార్టీ నిరసనకు దిగింది. ఈ విషయంలో సింహాచలం దేవస్థానం అధికారులు తీరును నిరసిస్తూ శనివారం సింహాచలం తొలి పావంచ వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, పల్లా శ్రీనివాస్, స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు.

విజయసాయిరెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి దేవస్థానం అధికారులు అపచారం చేశారని టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. దేవస్థానాన్ని వెంటనే సంప్రోక్షణ చేయాలని డిమాండ్ చేశారు. ఆలయ సంప్రదాయాలకు తిలోదకాలిచ్చిన ఈవో సూర్యకళను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ చర్య హిందూ మనోభావాలని పూర్తిగా దెబ్బ తీసినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఒక ఎంపీకి పూర్ణకుంభంతో స్వాగతం పలకడం ఆలయ సాంప్రదాయానికి పూర్తి విరుద్ధమని అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తోన్న ఈవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖలో భూముల వ్యవహారం అంశాన్ని డైవర్ట్ చేయడం కోసమే మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement