Sunday, April 28, 2024

నదుల అనుసంధానంపై రేపు టాస్క్‌ఫోర్స్‌ కమిటీ భేటీ.. గోదావరి, కృష్ణ వివాదాల తర్వాతే ఏదైనా!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నదుల అనుసంధానం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం మళ్లీ తెరపైకి తీసుకొస్తోంది. నదుల అనుసంధానంపై ఏర్పాటైన టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ భేటీ 16వ తేదీన ఢిల్లిలోని శ్రమశక్తి భవన్‌లో జరగనుంది. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ సలహాదారు, నదుల అనుసంధాన కమిటీ ఛైర్మన్‌ వెదిరే శ్రీరాం అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. సమావేశంలో కేంద్ర జలసంఘం ఛై ర్మన్‌, ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్‌ తదితర 15మంది కీలక సభ్యులు మాత్రమే పాల్గొననున్నారు. దేశంలోని పలు నదుల అనుసంధానాలపై ఈ కమిటీ చర్చించనున్నా.. ఎజెండాలో గోదావరి-కావేరికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనుంది.

గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రతిపాదనలకు కార్యరూపం ఇచ్చేందుకు వేగంగా చర్యలు చేపడుతోంది. గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద 175 టీఎంసీల నీటి మిగులు ఉంటుందని, చత్తీస్‌గఢ్​కి కేటాయించినా మిగులు జలాలు ఎక్కువగా ఉన్నందున ఇక్కడి నుంచే గోదావరి-కావేరి అనుసంధానానికి శ్రీకారం చుట్టాలని కేంద్రం ప్రాతిపాదిస్తోంది. ఇచ్చంపల్లి నుంచి తోడే అనుసంధాన జలాలతో తెలంగాణలోనూ ఎక్కువ ఆయకట్టుకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని కేంద్రం వాదిస్తోంది. గోదావరి జలాలను జానం పేట నుంచి నాగార్జునసాగర్‌ వరకు, అక్కడి నుంచి పెన్నా ద్వారా కావేరికి మళ్లించడంపై ఇప్పటికే అధ్యయనాన్ని కూడా కేంద్రం పూర్తి చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement