Tuesday, May 14, 2024

నన్ను..నాభార్యని చంపేస్తామంటున్నారు.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కి మరోసారి లెటర్ రాసిన సుకేశ్ చంద్రశేఖర్

ఢిల్లీ జైలులో ఉన్న ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకి మరోసారి లెటర్ రాశాడు. జైలులో ఉన్న సీఆర్‌పీఎఫ్ సిబ్బంది నిరంతరం బెదిరింపులు, దుర్భాషలాడుతున్నారని ఆరోపించాడు. తనతో పాటు తన భార్యను ఢిల్లీ వెలుపల మరొక జైలుకు తరలించాలని విజ్ఞప్తి చేశాడు. ఆప్ నాయకులపై ఫిర్యాదులను ఉపసంహరించుకోవాలంటూ జైలులో తమపై దాడి కూడా చేశారని వీకే సక్సేనాకు రాసిన ఐదో లేఖలో ఆరోపించాడు. జైలు అధికారులు, ఆప్ నేతలకు వ్యతిరేకంగా నా దగ్గర చాలా ముఖ్యమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఈ విషయం వారికి బాగా తెలుసు. అందువల్ల వారు నాకు, మరొక జైలులో ఉన్న నా భార్యకు హాని కలిగించడానికి ఏ స్థాయికైనా వెళ్తారు’ అని సుకేశ్ ఢిల్లీ ఎల్-జికి తన లేఖలో రాశాడు. ఆప్‌పై చేసిన అన్ని అభియోగాలను ఉపసంహరించుకోవాలని జైలు అధికారులు తన భార్యను బెదిరించారని ఆరోపించాడు.

గతంలో తీహార్ జైలులో రక్షణ కోసం మంత్రి సత్యేంద్ర జైన్ కు రూ. 10 కోట్లు, తనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తానంటే ఆప్ పార్టీకి రూ. 500 కోట్ల వరకు విరాళం ఇచ్చినట్టు సుకేశ్ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశాడు. న్యాయంతో పాటు నా భార్య, నా భద్రత దృష్ట్యా, విచారణ పూర్తయ్యే వరకు దయచేసి మమ్మల్ని యూపీ, హర్యానా, ఉత్తరాఖండ్ జైళ్లకు తరలించండి. ఆప్, అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ తో పాటు ఇక్కడి జైలు అధికారుల వల్ల మేం తీవ్ర ప్రమాదంలో ఉన్నందున దయచేసి మా విజ్ఞప్తిని అత్యవసర పరిస్థితుల్లో పరిగణించండి’ అని చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పైనా, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ పైనా తాను చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోకపోతే తనను, తన భార్యను కొట్టి చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement