Saturday, May 4, 2024

Story : 110అడుగుల పొడ‌వైన జుట్టు-గిన్నిస్ బుక్ లో స్థానం

కొప్పు ఉంటే కోటి వ‌య్యారాలు పోవ‌చ్చ‌నే సామెత తెలిసిందే. అంటే జుట్టు పెద్ద‌గా ఉంటే ఎన్ని ర‌కాల జ‌డ‌లు అయినా వేసుకోవ‌చ్చ‌ని దాని అర్థం. అయితే అమెరికా నివసిస్తున్న ఓ ఆఫ్రికన్ సంతతి మహిళ మాత్రం ఏకంగా తన పొడవుకన్నా రెండు, మూడింతల పెద్ద జుట్టును పెంచి రికార్డు సృష్టించింది. ఏకంగా 110 అడుగుల పొడవైన డ్రెడ్‌ లాక్స్‌ ( వెంట్రుకలు గుత్తులు గుత్తులుగా చిక్కు పడిన) జుట్టు కలిగిన మహిళగా గిన్నిస్‌ బుక్ లోకి ఎక్కింది. మరి ఇంతగా జుట్టు ఎందుకు పెంచావని అడిగితే.. ఆధ్యాత్మిక మార్గంలో భాగంగా పెంచుతున్నారని..

సుమారు 40 ఏళ్ల నుంచి జుట్టు కత్తిరించలేదని పేర్కొంది.ఆమె తన జుట్టును ఒక్కసారి శుభ్రం చేసుకోవాలంటే ఐదారు షాంపూ బాటిళ్లు అవసరం పడతాయని.. ఆర బెట్టుకోవడానికి ఒకట్రెండు రోజులు పడుతుందని తెలిపింది. అమెరికాలోని ఫ్లోరిడాలో నివసించే ఆశా మండేలా దాదాపు 40 ఏళ్లుగా జుట్టు కత్తిరించుకోకుండా పెంచుతూనే ఉంది.దాదాపు పదమూడేళ్ల కిందటే అంటే 2009లోనే ఆమె సుమారు 20 అడుగుల (ఆరు మీటర్లు) పొడవైన డ్రెడ్ లాక్స్ జుట్టుతో గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. ఆ తర్వాతా జుట్టు పెంచుకుంటూనే వచ్చిన ఆమెను ఇటీవల గిన్నిస్ బుక్ ప్రతినిధులు కలిశారు. ఈసారి కూడా ఆమె తన జుట్టు రికార్డును నమోదు చేయాలని ఆమె కోరడంతో.. జుట్టును కొలిచారు. ఈసారి జుట్టు పొడవు చూసి ఆశ్చర్యపోయారు. ఏకంగా 110 అడుగుల పొడవు (33.5 మీటర్లు) ఉన్నట్టు లెక్కించారు.ఆమె ఇంత పొడవైన జుట్టును అలా మడత పెట్టేసుకుని తల వెనుక వస్త్రంతో కట్టేసుకుంటూ ఉంటుంది. ఇది కేవలం జుట్టు కాదని, తన కిరీటమని ఆశా మండేలా చెప్పడం గమనార్హం.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement