Sunday, May 5, 2024

Spl Story | క్రీస్తు పూర్వమే తెలంగాణలో అంతరిక్ష పరిశోధనలు.. యునెస్కో జాబితాలోకి మరో ప్రదేశం

తెలంగాణలో ఎన్నో అద్భుతాలున్నాయి. చారిత్రక వారసత్వ సంపదతోపాటు.. ఆదిమ మానవుల కాలంనాటి ఆనవాళ్లు బయటపడుతున్నాయి. నారాయణపేట జిల్లాలోని ముడుమాల్​ గ్రామంలో క్రీస్తుపూర్వం1500 సంవత్సరంలోనే అంతరిక్ష పరిశోధనలు జరిగినట్టు కచ్చితమైన ఆధారాలు బయటపడ్డాయి. దీనికి సంబంధించి చరిత్రకారులు, పరిశోధకులు ఎన్నో వివరాలను సేకరించారు. వాటి ఆధారాలతో అప్పట్లో ఇక్కడ సూర్యుడి గమనాన్ని తెలుసుకునేందుకు పరిశోధనలు జరిగింది వాస్తవమేనని ధ్రువీకరించారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

తెలంగాణలోని నారాయణపేట జిల్లా ముడుమాల్ గ్రామంలోని మెగాలిథ్​లు, స్కైచార్ట్​లకు చెందిన పురావస్తు ప్రదేశానికి యునెస్కో జాబితాలో చోటు దక్కేలా మంత్రి శ్రీనివాస్​గౌడ్​ ప్రయత్నాలు చేపట్టారు. ఈమేరకు ఆయన తెలంగాణ వారసత్వ శాఖ డెక్కన్ హెరిటేజ్ అకాడమీతో ఒక అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారసత్వ ప్రదేశాలు ఐక్యరాజ్యసమితికి చెందిన విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (UNESCO)చే గుర్తింపు పొంది ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఇక.. ముడుమాల్​ గ్రామంలోని పురాతన మెగాలిత్​ ప్రదేశానికి చెందిన అన్ని డాక్యుమెంట్స్​ని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సంరక్షణ, సాంకేతిక సేవలను అందించడానికి ఒక ఒప్పందం చేసుకున్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఈ పురాతన ప్రదేశం గుర్తింపు పొందేందుకు అవసరమైన డాక్యుమెంట్లను వారసత్వ శాఖ, డెక్కన్ ట్రస్ట్ కు అందజేశారు.

ముడుమాల్ పురావస్తు కేంద్రాన్ని ప్రస్తావిస్తూ.. యునెస్కో గుర్తింపునకు, అర్హతకు గొప్ప చారిత్రక నిర్మాణ వారసత్వ సంపద తెలంగాణకు ఉందని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ ఉద్ఘాటించారు. ఆదిమ మానవుల కాలంనాటి అంతరిక్ష పరిశోధనలు, వాతావరణ పరిశోధనలకు సంబంధించిన పరిశోధనలకు గుర్తుగా ఇది ఉందని అనేకమంది చరిత్రకారులు.. పరిశోధకులు ఈ ప్రదేశం ఖ్యాతిని ధ్రువీకరించారని మంత్రి చెప్పారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు యునెస్కో గుర్తింపు కోసం కృషి చేస్తూనే ఈ ప్రాంత చరిత్ర, వారసత్వ సంపదను ఆవిష్కరించి, పరిరక్షించేందుకు కృషి చేస్తున్నారన్నారు.

ముడుమాల్ ప్రదేశంలో నిగూఢమైన మెగాలిథిక్ పొడవైన రాళ్లు సమలేఖనంలో ఉన్నాయి. ముదుమాల్ గ్రామం, హైదరాబాద్ నుండి 3 గంటల ప్రయాణంలో, మెన్హిర్‌లు, స్కై చార్ట్ తో కూడిన మెగాలిథిక్ సైట్ ఉంది. నారాయణపేట జిల్లాలో కృష్ణా నది ఒడ్డున 80 పొడవైన రాళ్లవంటి మెన్హిర్లు ఉన్నాయి. ఐదు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్రదేశం 1500 BC నాటిది. ‘అలైన్‌మెంట్ స్టోన్స్’ కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలోని ఒక ట్రస్ట్ UNESCO హెరిటేజ్ ట్యాగ్‌ని పొందడానికి పని చేస్తోంది.

- Advertisement -

సూర్యుని కదలికను సంగ్రహించడం ద్వారా పొడవైన రాళ్లు సమయాన్ని అంచనా వేయడానికి ఒక పద్ధతిలో నిలబెట్టారని చాలామంది చారిత్రక పరిశోధకులు, పురవాస్తు శాఖ వారు కూడా దీన్ని ధ్రువీకరించారు. ఈ ప్రదేశాన్ని ప్రచారం చేయడానికి, ట్రస్ట్ టూర్‌లను నిర్వహిస్తోంది. సమీపంలోని పాఠశాలల నుండి విద్యార్థులను, ఉపాధ్యాయులను తీసుకువస్తోంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకు 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పొడవాటి రాళ్లు ఇప్పుడు కొన్ని ఎకరాలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఆ ప్రదేశంలో ఎక్కువ భాగం వ్యవసాయ సాగులో ఉంది. ఈ ప్రదేశం విధ్వంసానికి గురయ్యే ప్రమాదం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం దాని పరిరక్షణకు చర్యలు చేపడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement