Tuesday, May 14, 2024

నైరుతి ఎఫెక్ట్‌.. ఉరుములు, మెరుపుల‌తో వ‌ర్షాలు, హెచ్చ‌రించిన వాతావ‌ర‌ణ శాఖ‌

నైరుతి రుతుపవనాలు ఈసారి మూడు రోజుల ముందుగానే కేరళలో ప్రవేశించాయి. అరేబియా సముద్రంలో రుతుపవనాలు మరింత చురుకుగా కదులుతున్నాయి. కేరళ, తమిళనాడు, కర్నాటకతో పాటు దక్షిణ, మధ్య బంగాళాఖాతంలో గాలులు వేగంగా వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అసని తుపాను కారణంగా నైరుతి రుతుపవనాల్లో వేగం పెరిగింద‌ని వాతావరణ విశ్లేషకులు అంటున్నారు. సాధారణం కంటే చాలా ముందుగానే అంటే మే 16వ తేదీనే నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకాయని తెలిపారు. ఏపీ, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. నైరుతి రుతుపవనాల రాక ఫలితంగా ఏపీ, యానాం, తెలంగాణలో పలుచోట్ల ఇవ్వాల (మంగ‌ళ‌వారం) మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని వాతావరణ శాఖ వెల్లడించింది. ఓవైపు వర్షాలు, మరోవైపు తీవ్రమైన ఎండల నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

కోస్తాంధ్ర, యానాంలలో..
కోస్తాంధ్ర జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కుర‌వ‌నున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలుంటాయ‌ని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. యానాంలోనూ నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

రాయలసీమ జిల్లాల్లోనూ..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, పొట్టి శ్రీరాములు నెల్లూరులతో పాటు రాయలసీమ జిల్లాలైన ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. వేగంగా గాలులు వీయ‌డంతో చెట్లు విరిగిపడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

తెలంగాణలో పొడి వాతావరణం..
తెలంగాణలో కొన్ని జిల్లాల్లో మరో రెండు రోజులపాటు అక్క‌డ‌క్క‌డా వ‌ర్షాలుంటాయ‌ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, మహబూబ్‌నగర్, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో ఇవ్వాల‌ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, మరికొన్ని చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement