Saturday, May 18, 2024

ఖర్గే ఇంటికి వెళ్లి అభినందించిన సోనియా.. అపాయింట్​మెంట్​ కోరితే ఇవ్వకుండా సర్​ప్రైజ్​

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా గెలిచిన మల్లికార్జున ఖర్గేను పార్టీ ముఖ్య నేత సోనియాగాంధీ సర్​ప్రైజ్​ చేశారు. నేరుగా ఖర్గే ఇంటికి వెళ్లి ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందించారు. అయితే.. దీనికి ముందు కొంత ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా గెలిచిన మల్లికార్జున ఖర్గే తొలుత సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరారు. కానీ, సోనియా ఆయనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా స్వయంగా కారులో మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లి తనే స్వయంగా అభినందనలు తెలియజేశారు. అంతేకాకుండా సోనియా గాంధీతోపాటు ఆమె కూతురు కాంగ్రెస్​ మరో ముఖ్య నేత ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఖర్గేని కలిసి అభినందనలు తెలియజేశారు.

అయితే.. ఇప్పటిదాకా ఒక్క మన్మోహన్‌ సింగ్‌ ఇంటికి తప్ప ఏ కాంగ్రెస్‌ నేత ఇంటికి వెళ్లని సోనియా గాంధీ, స్వయంగా ఖర్గే నివాసానికి వెళ్లడం పార్టీ నేతలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అని, అంతా ఆయన మాట వినాల్సిందే అన్న సందేశాన్ని కేడర్​కు పంపేందుకే ఆమె ఇలా చేసినట్లు తెలుస్తోంది.

కాగా, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా మల్లికార్జున ఖర్గే ఎన్నిక పట్ల ఇలాగే స్పందించారు. ‘కొత్త అధ్యక్షుడి కింద పనిచేస్తా. పార్టీలో తన పాత్రను ఆయనే నిర్ణయిస్తారు’ అని మీడియాతో అన్నారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల్లో తమ కుటుంబం దూరంగా ఉంటుందని, గాంధీ కుటుంబ వారసత్వం నుంచి దూరంగా ఉండేందుకే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం అవుతోందని పరిశీలకులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement