Sunday, April 28, 2024

ఏపీలో మరోసారి ఎన్నికల సందడి?!

ఏపీలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న నీలం సాహ్నీ.. పరిషత్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. పరిషత్ ఎన్నికలను తొందరగా నిర్వహించాలని ఎస్ఈసీ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.  ఎన్నికల కమిషనర్ సెక్రటరీ కన్నబాబుతో పాటు ఇతర సిబ్బందితో సాహ్నీ సమావేశమయ్యారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిసల సాధ్యాసాధ్యాలపై చర్చించారు.

మరోవైపు బాధ్యతలు తీసుకున్న వెంటనే రాజ్ భవన్ కు వెళ్లిన ఎస్ఈసీ సాహ్నీ.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని వివరించినట్లు తెలుస్తోంది. దీనిపై గవర్నర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్.. ఎస్ఈసీతో భేటీ అయ్యారు. పరిషత్ ఎన్నికల నిర్వహణపై సీఎం ఆలోచనలు, అభిప్రాయాలను సీఎస్.. ఎస్ఈసీకి వివరించినట్లు తెలుస్తోంది.

పరిషత్ ఎన్నికల నిర్వహణపై కోర్టులో కేసు పెండింగ్ ఉన్న దృష్ట్యా నోటిఫికేషన్ విడుదల సాధ్యాసాధ్యాల పరిశీలన చేయనుంది ఎస్ఈసీ. పరిషత్ ఎన్నికల్లో ఏకగ్రీవాలనూ త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 125 జెడ్పీటీసీలు, 2,248 ఎంపీటీసీలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి.

మరోవైపు ఎన్నికల నిర్వహణలో న్యాయపరమైన చిక్కులుండటంతో వాటిని పరిష్కరించుకుంటూ ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఎస్ఈసీ దృష్టిపెట్టారు. ఏకగ్రీవాలపై వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలు, నామినేషన్లు దాఖలైన చోట, ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో కొందరు మృతి చెందగా ఆయా మండలాల్లో ఎలా ముందుకెళ్లాలనేదానిపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పరిషత్‌ ఎన్నికలపై నేడో, రేపో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణపై గురువారం సాయంత్రం కలెక్టర్లు, ఎస్పీలుతో నీలం సాహ్నీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

ఇటు ఎస్ఈసీ, అటు ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై ఆసక్తిగా ఉండటంతో  ఏ నిమిషం అయినా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ రెండోవారం నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా సమయంలోనే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడంతో ఈ ఎన్నికలకు వైరస్ అడ్డుకాబోదని, కొవిడ్ మార్గదర్శకాలను అనుసరించే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది. గత నెలలో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని కోరినా.. కరోనా వ్యాక్సినేషన్ దృష్ట్యా నిర్వహించలమేని అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త ఎస్ఈసీ వచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement