Thursday, May 2, 2024

షేర్ మార్కెట్ పేరుతో మోసాలు.. కోట్లలో కొల్లగొడుతున్న కిలాడీ దంపతులు, ఢిల్లీలో అరెస్ట్

షేర్ మార్కెట్ పేరిట మోసాల‌కు పాల్ప‌డుతున్న దంప‌తుల‌ను వ‌రంగ‌ల్ పోలీసులు ఢిల్లీలో ప‌ట్టుకున్నారు. నకిలీ కంపెనీ పేరిట‌ పెట్టుబడులను పెట్టించి కోట్లాది రూపాయలను కొల్లగొట్టి ప్రజలను మోసం చేస్తున్నట్టు సైబర్ క్రైం, సుబేదారి పోలీసులు తెలిపారు. వీరి నుండి సూమారు 2.50ల‌క్ష‌ల‌ రూపాయల విలువగల 50గ్రాముల బంగారు అభరణాలు, రెండు ల్యాప్ టాప్‌లు, హర్డ్ డిస్కులు, స్వైపింగ్ మిషన్, 8 సెల్ ఫోన్లు, చెక్ బులు, బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులు, స్టాంపులు, కరపత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిలో కేర‌ళ రాష్ట్రం కొచ్చి జిల్లా ఎర్నాకులానికి చెందిన రేష్మి రవీంద్రన్ నాయర్ (38), బిజ్జు మాధవన్ (41) ఉన్నారు. వీరితో పాటు గోగుల శ్రీనివాస్ అనే నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి నిందితుల వివ‌రాలు వెల్ల‌డించారు. కేరళ రాష్ట్రానికి చెందిన ఈ కిలాడీ దంపతులు జల్సా జీవనానికి అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశారు. షేర్ మార్కెట్ లో పెట్టుబడుల ద్వారా అధికం మొత్తం డబ్బును గడించవచ్చని ప్ర‌జ‌ల‌కు ఆశ‌చూపించారు. పెట్టుబడుల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బు వసూళ్లకు పాల్పడ్డారు. ప్రజలను మోసం చేసినందుకు, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేరళలో పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో వీరు తమ మకాంను ఢిల్లీకి మార్చి పి.వి.ఆర్ కన్సల్టెన్సీ సర్వీసు ప్రై లిమిటేడ్ అనే బోగస్ సంస్థను ఏర్పాటు చేశారు. త‌ర్వాత‌ హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రధాన నగరాల్లో ఈ సంస్థ తరుపున ప్రతినిధులను ఏర్పాటు చేసుకుని వీరితో పి.వి.ఆర్ కన్సల్టెన్సీ ద్వారా ఆన్ లైన్ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే 4 నుండి 8శాతంవరకు కమిషన్ అందజేయడం జరుగుతుందని న‌మ్మిస్తున్నారు.

ప్రజలకు తమపై నమ్మకం కలిగేందుకు ముందుగా నిందితులు ప్రజలు పెట్టిన పెట్టుబడికి పెద్దమొత్తం కమిషన్లు చెల్లించేవారు. దీంతో కంపెనీపై నమ్మకం కుదిరిన ప్రజలు పి.వి.ఆర్ కన్సల్టెన్సీ ద్వారా ఆన్లైన్లో నకిలీ కంపెనీల్లో పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. దీంతో ఎక్కువ మొత్తంలో తమ బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బు జమ అయిన వెంటనే ఈ కిలాడి దంపతులు బ్యాంకు నుండి డబ్బు డ్రా చేసుకోని ప్రజలను మోసం చేసేవారు. ఇదే రీతిలో హన్మకొండ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ప్రస్తుతం పరారీలో నిందితుడు గోగుల శ్రీనివాస్ ద్వారా ఆన్లైన్ ద్వారా ప‌రిచ‌యం అయ్యాడు. మోసపూరితమైన మాటలతో తమ పి.వి.ఆర్ కన్సల్టెన్సీ ద్వారా సుమారు కోటి రూపాయల పైగా పెట్టుబడులు పెట్టించారు. కొద్ది రోజులు సక్రమంగానే కమిషన్ చెల్లించి, ఆ త‌ర్వాత పి.వి.ఆర్ కన్సల్టెన్సీను మూసివేశారు. ఫోన్ లో అందుబాటులో లేకపోవడంతో మోసపోయినట్లుగా భావించి. సుబేదారి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైంతో పాటు సుబేదారి పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేక పోలీస్ బృందం ఢిల్లీ వెళ్లి నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. తప్పించుకున్న మరో నిందితుడు శ్రీనివాస్ ను పట్టుకోనేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామ‌ని పోలీస్ కమిషనర్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement