Wednesday, May 1, 2024

TS | ప్రైవేటు వేహిక‌ల్స్‌లో సేఫ్టీ జ‌ర్నీ.. ధీమా పెంచ‌నున్న అభ‌య యాప్‌

ప్రయాణికుల భద్రత కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ వినూత్న ఆలోచన చేశారు. ప్రజల సురక్షిత ప్రయాణం కోసం ప్రత్యేకంగా ‘అభయ’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. మై టాక్సీ సేఫ్‌ అనే ట్యాగ్‌లైన్‌తో ఉండే ఈ ‘అభయ’ యాప్‌ ప్రయాణికుల రక్షణలో కీలక పాత్ర పోషించనుంది. రాష్ట్రంలో ప్రయాణికుల భద్రత కోసం తీసుకొచ్చిన తొలి యాప్‌గా అభయ యాప్‌కు గుర్తింపు దక్కింది. సిరిసిల్లలోని మినీ స్టేడియంలో జరిగిన జిల్లా పోలీస్ క్రీడల ముగింపు కార్యక్రమంలో ఈ యాప్‌ను మంత్రి కేటీ రామారావు ఇవ్వాల (మంగ‌ళ‌వారం) ఆవిష్కరించారు.

– ఇంట‌ర్నెట్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌

రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలోని ఆటో రిక్షాలు, క్యాబ్‌లలో ప్రయాణికులకు భద్రత, సౌకర్యాలను కల్పించడం కోసం క్యూ అర్ కోడ్‌ను అమల్లోకి తీసుకువచ్చిన ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ను, పోలీస్ యంత్రాంగాన్ని ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్‌ అభినందించారు. ఆటోలు, క్యాబ్‌ల యాజమానుల నుంచి అవసరమైన డాక్యుమెంట్లు, సమాచారం సేకరించి డిజిటలైజ్ చేసి క్యూ ఆర్ కోడ్ రూపంలో తీసుకొచ్చి, ఆ కోడ్‌ను స్కాన్ చేసినప్పుడు డ్రైవర్ ఫొటో వివరాలతో పాటు.. వాహనానికి సంబంధించిన ఫుల్ డిటెయిల్స్ ల‌భించేలా ఎస్పీ చ‌ర్య‌లు తీసుకున్నారు.

ఇక‌.. ఎమర్జెన్సీ కాల్ లేదా టెక్స్ట్, ఎమర్జెన్సీ కంప్లెయింట్‌, రేటింగ్ అనే మూడు రకాల ఆప్షన్‌లు కూడా ఇందులో కనిపిస్తాయి. ప్రయాణికులు సురక్షితం కాదనే పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు కాల్‌ లేదా టెక్స్ట్ రూపంలో ఫిర్యాదు చేస్తే వాళ్లు ప్రయాణిస్తున్న వాహనం లైవ్ లొకేషన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు వెళ్తుంది. ఈ విష‌యాన్ని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నుంచి సమాచారం అందజేస్తారు. డ్రైవర్ అసభ్యకర ప్రవర్తన, ర్యాష్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్, హిట్ అండ్ రన్ చేసిన సందర్భాల్లో అభయ యాప్‌ ద్వారా కంప్లెయింట్‌ చేయవచ్చు. ఇట్లా ప్రయాణికులు సురక్షితంగా గమ్యం చేరడానికి ఈ యాప్ ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉండ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement