Sunday, April 28, 2024

ఆల‌యానికి రోబోటిక్ ఏనుగును బ‌హుక‌రించిన.. పెటా సంస్థ‌

త్రిసూర్ లోని శ్రీకృష్ణ ఆల‌యంలో రోబో ఏనుగును ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏనుగు అచ్చం నిజం ఏనుగులాగే ఉంటుంది.
కేరళలో ఇలాంటి రోబో ఏనుగును కలిగివున్న ఆలయం ఇదొక్కటే. ఈ రోబో ఏనుగుకు ‘ఇరింజదపల్లి రామన్’ అని నామకరణం చేశారు. ఇనుప చట్రానికి రబ్బరు తొడుగు వేసి ఈ ఏనుగును రూపొందించారు. దీని బరువు 800 కిలోలు. జంతు హక్కుల ఉద్యమ సంస్థ ‘పెటా’కు చెందిన కొందరు ఈ రోబోటిక్ ఏనుగును ఆలయానికి బహూకరించారు. ఆలయ వంశపారంపర్య అర్చకుడు రాజ్ కుమార్ నంబూద్రి ఈ రోబో ఏనుగు గురించి చెబుతూ, ఇది నిజం ఏనుగులాగే తొండం ఊపుతుందని, చెవులను కదుల్చుతుందని వివరించారు. మావటి ఓ బటన్ నొక్కితే తొండంతో నీళ్లు విరజిమ్ముతుందని వెల్లడించారు. ఇలాంటి పనులు చేసేందుకు ఈ ఏనుగు లోపల కొన్ని ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చారట‌. దీనిపై ఆలయ అధికారులు స్పందిస్తూ, సాధారణ ఏనుగులను పోషించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని, వాటితో కొన్నిరకాల ఇబ్బందులు కూడా ఉన్నాయని వివరించారు. ఏనుగులను హింసించడాన్ని నిరోధించే క్రమంలో, ఈ రోబో ఏనుగు ఒక వినూత్న ముందడుగుగా భావిస్తున్నామని తెలిపారు. ఇతర దేవాలయాలు కూడా ఇదే బాటలో నడవాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement