Friday, May 10, 2024

కేసీఆర్ చరిత్ర తెలుసుకో: కేటీఆర్ కు రేవంత్ కౌంటర్

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదని ఆయన అన్నారు. గాంధీ కుటుంబానికి పలుమార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా.. వేరే వ్యక్తులకు అవకాశం కల్పించిందని రేవంత్ గుర్తు చేశారు. చెప్పకపోయినా.. దళితులను సీఎంలుగా చేసిన చరిత్ర కాంగ్రెస్ ది అని అన్నారు. తెలంగాణలో భట్టి విక్రమార్క ప్రధాన ప్రతిపక్షంలో ఉంటే ఓర్వలేక ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేశారని మండిపడ్డారు. కేటీఆర్.. ఏ హోదాతో రాహుల్ ను విమర్శిస్తున్నారని రేవంత్ ప్రశ్నించారు.

ముల్కీ నిబంధనల ప్రకారం.. కేటీఆర్ కు తెలంగాణలో చెప్రాసి ఉద్యోగం కూడా రాదని విమర్శించారు. తొమ్మిది ప్రధానమైన తీర్మానాలపై ప్రజలు ఉత్సవాలు చేసుకుంటున్నారని చెప్పారు. ఆయా రాష్ట్రాలలో ఉన్న ఆర్థిక వనరులను బట్టి కాంగ్రెస్ హామీలు ఇస్తుందన్నారు. తెలంగాణ ఆర్థిక వనరులను బట్టి హామీ ఇచ్చామని చెప్పారు. కేటీఆర్.. చాలా అహంభావంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి కేసీఆర్ చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు.

కేసీఆర్.. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు సింగిల్ విండో డైరెక్టర్ గా ఓడిపోయినా.. చైర్మన్ గా రాజకీయ బిక్ష కాంగ్రెస్ పెట్టిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ మొదట సిద్ధిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారని అన్నారు. పారిపోయే చరిత్ర కల్వకుంట్ల కుటుంబనిదని అన్నారు. సిద్ధిపేట నుంచి కరీంనగర్ ఎంపీగా.. మహబూబ్ నగర్ ఎంపీ.. తర్వాత గజ్వేల్ కు పారిపోయిన చరిత్ర కేసీఆర్ ది అని ఎద్దేవా చేశారు. రాహుల్ ను కేటీఆర్ విమర్శించే ముందు మీ తండ్రి ది తెలుసుకోవాలని సూచించారు.

రైతుల భరోసా కోసం కాంగ్రెస్ విధానాన్ని ప్రకటించామన్నారు. వరంగల్ డిక్లరేషన్ కు లక్షలాది మంది రైతులు సంపూర్ణ విశ్వాసం ప్రకటించారని చెప్పారు. దీంతో కలుగులో దాచుకున్న ఎలుకలు బయటకు వచ్చాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎమ్ఐఎమ్ మూకుమ్మడిగా దాడి చేశారని ధ్వజమెత్తారు.  అమరవీరుల స్థూపం వద్ద కుర్చీ వేసుకొని కట్టిస్తామని హెచ్చరించారు. తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మాణంలో 150కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమరవీరుల స్థూపంను అద్భుతంగా నిర్మిస్తామని ప్రకటించారు. 62 కోట్లతో ప్రారంభించిన అమరవీరుల స్థూపం ఈ రోజు 200 కోట్లకు పెంచారని అన్నారు. యాదాద్రి పేరుతో 2 వేల కోట్లను గుడిపేరుతో దోచుకున్నారని ఆరోపించారు. చిన్న వర్షానికి యాదగిరి గుట్ట.. భూకంపం వస్తే ప్రకంపనలు వస్తే కదిలినట్లుగా తయారైందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే యాదగిరి గుట్ట, అమరవీరుల స్థూపం అవినీతిపై విచారణ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రత్యేకంగా ఈ రెండిటిపై విచారణ చేసి.. దోషులను శిక్షిస్తామన్నారు. టీఆర్ఎస్, బీజేపీ, MIM ముగ్గురు ఒకే రకమైన భాష వాడుతున్నారన్నారు. టీఆర్ఎస్ అనే రిమోట్ ను కాపాడే ప్రయత్నంలో బీజేపీ బయటకువచ్చిందని ఆరోపించారు. బీజేపీకి పరోక్షంగా సహకరిస్తున్న MIM బయటకువచ్చిందని విమర్శించారు. ఈ ముగ్గురి దుష్ట చతుర్దయాన్ని తెలంగాణ సమాజం గమినిస్తోందన్నారు.

 కేసీఆర్ వెళ్లి శరత్ పవార్, స్టాలిన్ ను, మమతాబెనర్జీలను కలవొచ్చు.. రాహుల్ గాంధీ వస్తే టూరిస్ట్ అంటారా? నిలదీశారు. మీరు వెళ్లి కలిస్తే చతురత.. ఇతరులు వస్తే టూరిస్టా? అని అడిగారు. రాహుల్ గాంధీ కాబోయే దేశ ప్రధానమంత్రి అని అన్నారు. టీ.ఆర్.ఎస్ , బీజేపీ, ఎమ్.ఐ.ఎమ్ ల చీకటి ఒప్పందం బయటపడిందని రేవంత్ రెడ్డి జోష్యం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement