Wednesday, May 1, 2024

ఆంధ్రాలో TRS.. తెలంగాణ జోలికి రావొద్దంటూ రేవంత్..

ఆంధ్రాలోనూ పార్టీ పెట్టాలని కోరుతున్నారని టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా ఆపార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. కేసీఆర్‌ వ్యాఖ్యలపై నిన్న ఏపీ మంత్రి పేర్నినాని స్పందించగా.. కేసీఆర్‌, పేర్ని వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం హుజూరాబాద్‌ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం రాజకీయవర్గాల్లో మరింత చర్చకు దారితీసింది.

సీఎం కేసీఆర్‌ రాజ్య విస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోందని ట్విటర్‌ వేదికగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం.. కేసీఆర్‌, జగన్‌ ఉమ్మడి కుట్రకు నిదర్శనమని పేర్కొన్నారు. ఏపీ మంత్రి పేర్ని నాని సమైక్యాంధ్ర ప్రతిపాదన చేయడం ఆ కుట్రలో భాగమని విమర్శించారు. వందల మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ జోలికి రావొద్దని రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు.

కాగా, టీఆర్ఎస్ ఏడేళ్ల పాలనలో తెలంగాణను నెంబర్ వన్ గా మార్చామని ప్లీనరీ సందర్భంగా సీఎం కేసీఆర్ అన్నారు. దళితబంధు ప్రకటించాక ఆంధ్రా నుంచి వేల విజ్ఞాపనలు వస్తున్నాయన్న ఆయన.. ఆంధ్రాలో పార్టీ పెట్టండి గెలిపించుకుంటామని చెబుతున్నారని అన్నారు. తెలంగాణ పథకాలు తమకు కావాలని ఆంధ్రా ప్రజలు కోరుతున్నారని చెప్పారు. తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలంటూ పొరుగు రాష్ట్రాల్లో డిమాండ్లు వినిపిస్తున్నాయన్న కేసీఆర్.. నాందేడ్‌, రాయచూర్‌ జిల్లాల నుంచి ఈ డిమాండ్లు వచ్చాయిని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement