Friday, April 26, 2024

పని ఒత్తిడి తగ్గించండి, 24 గంటలు డ్యూటీలోనే ఉంటున్నాం.. ప్రభుత్వానికి పీజీ, రెసిడెంట్‌ డాక్టర్ల వినతి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తమపై పనిభారాన్ని తగ్గించే విధంగా రోజూవారీ పని గంటలను నిర్ణయించాలని రెసిడెంట్‌, జూనియర్‌ రెసిడెంట్‌ వైద్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రతి దినం24 గంటల డ్యూటీ కారణంగా రోజులో కనీసం 3 నుంచి 4 గంటలపాటు విశ్రాంతి దొరకడం గగనంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీ ఎక్కిన మరుసిట రోజు సాయంత్రం 4 గంటలకు ఇళ్లకువెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. వారంలో 48 గంటల పనివేళలను నిర్ణయించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ప్రతి వారం 70 గంటలపాటు విధుల్లో ఉండాల్సి వస్తోందని ఫలితంగా విశ్రాంతి కరువై పనిఒత్తిడితో మానసిక, శారీరక బలహీనతలు వెంటాడుతున్నాయని వాపోతున్నారు. నిజామాబాద్‌ పీజీ రెసిడెంట్‌ వైద్యురాలు శ్వేత విధి నిర్వహణలో ఉండగానే గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో తమపై పని భారాన్ని తగ్గించాలని రెసిడెంట్‌ వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

జూనియర్‌ డాక్టర్లు, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, వైద్య విద్యనుబోధించే ప్రొఫెసర్లను సభ్యులుగా నియమించి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఆ కమిటీ అధ్యయనం చేసి నిర్ణయించిన మేరకు పీజీ రెసిడెంట్‌ వైద్యుల పనివేళలు/గంటలను నిర్ణయించాలని, విధి నిర్వహణ సమయంలో ఇతర సదుపాయాలను కల్పించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావును కోరుతున్నారు. పని గంటలను హేతుబద్ధంగా నిర్ణయిస్తేనే మానసిక, శారీరక ఒత్తిడి, శ్రమ తగ్గుతుందని, మరింత మెరుగ్గా రోగులకు వైద్య సేవలు అందించగలుగుతామని చెబుతున్నారు.

అనుమానాదాస్పద స్థితిలో పీజీ వైద్య విద్యార్థిని మృతి
నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ పీజీ వైద్యురాలు అనుమానాదాస్పద స్థితిలో మృతిచెందింది. నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో గైనిక్‌ విభాగంలో పీజీ చేస్తున్న డాక్టర్‌ శ్వేత శిక్షణలో భాగంగా విధులు నిర్వహిస్తోంది. గురువారం రాత్రి రెండు గంటల వరకు డ్యూటీలోనే ఉంది. ఉదయం తను పడుకున్న గదిలోకి వెళ్లిచూసేసరికి విగతజీవిగా పడి ఉండడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. శ్వేత గుండెపోటుతో మరణించి ఉండొచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. అయితే శ్వేతది అనారోగ్యంతో సహజ మరణమా..? లేక ఇంకేమైనా ఇబ్బందులు ఉండేవా..? అనేది తేలాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో విధి నిర్వహణలో ఉండగా డా. శ్వేత మృతిచెందడం బాధాకరమని తెలంగాణ జూనియర్‌డాక్టర్స్‌ అసోసియేషన్‌ సంతాపం వ్యక్తం చేసింది. శ్వేతది ముమ్మాటికీ పని ఒత్తిడి కారణంగా సంభవించిన మరణమేనని పేర్కొంది. గుండెపోటుతో శ్వేత మృతిచెందిందని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement