Thursday, May 19, 2022

హంగేరిలో మెరిసిన తెలుగు తేజం, ఆ దేశ క్రికెట్ జాతీయ జట్టులో స్థానం..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : క్రీడల్లో రాణించాలన్నది ఆ యువకుడి కల. ఎంత ఆసక్తి ఉన్నా పేదరికం అతణ్ణి విద్య వైపే నడిపించింది తప్ప ఆటలకు అవకాశం కల్పించలేదు. చదువులో రాణించి, టెక్నాలజీ కొలువులో చేరి హంగేరిలో స్థిరపడ్డాక, తనను వెంటాడుతున్న కలను సాకారం చేసుకునే అవకాశం చిక్కింది. అంతే.. తన క్రీడాభిలాషను నిజం చేసుకునేందుకు నడుం బిగించిన ఆ యువకుడు.. ఇప్పుడు ఏకంగా ఆ దేశ క్రికెట్ జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. ఆఫ్ స్పిన్నర్‌గా అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు. అతడే భవానీ ప్రసాద్ అడపాక. ఎంతోమందికి స్ఫూర్తి నింపుతున్న ఆ యువకుడి ప్రస్థానంపై ‘ఆంధ్రప్రభ’ అందిస్తున్న ప్రత్యేక కథనం…

శ్రీకాకుళం జిల్లా సంతకావిటి మండలం సిరిపురం గ్రామానికి చెందిన భవానీ ప్రసాద్ అడపాక చిన్నతనం నుంచే క్రీడల పట్ల విపరీతమైన ఆసక్తిని కనబర్చేవాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా క్రీడా రంగాన్ని తన కెరీర్‌గా చేసుకోవడం సాధ్యపడలేదు. తండ్రి అడపాక రాంబాబు, తల్లి లక్ష్మి పిల్లల్ని చదివించడానికే చాలా కష్టపడ్డారు. భవానీ ప్రసాద్ ఆసక్తి క్రీడలపై ఉన్నా చదువులోనూ రాణించాడు. సింహాచలం(విశాఖపట్నం)లోని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్‌లో సీటు సంపాదించి 10వ తరగతి వరకు అక్కడ చదువుకున్నాడు. ఆ తర్వాత ఇంటర్మీడియట్లోనూ నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఉన్న ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజిలో సీటు సాధించి ప్రతిభ చాటుకున్నాడు. శ్రీకాకుళంలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన భవానీ ప్రసాద్, టెక్నాలజీ రంగంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో ఉద్యోగం సంపాదించి, ఉద్యోగరీత్యా హంగేరి రాజధాని బుడాపెస్ట్ చేరుకున్నారు. టీసీఎస్ నుంచి ప్రస్తుతం నోకియా కంపెనీలోకి మారిన భవానీ ప్రసాద్, దొరికిన ఖాళీ సమయాన్ని తన చిన్ననాటి కల నెరవేర్చుకోవడం కోసం కేటాయిస్తూ వచ్చాడు.

నిజానికి హంగేరి క్రికెట్ పట్ల పెద్దగా ఆసక్తి చూపే దేశం కాదు. అయినా సరే, ఉన్న పరిమిత వనరుల్లో అక్కడి స్థానిక కోబ్రాస్ క్రికెట్ క్లబ్‌లో చేరి తన ప్రతిభకు పదును పెట్టుకుంటూ వచ్చాడు. క్లబ్ తరఫున ఆడుతూ ఆఫ్-స్పిన్ బౌలింగ్‌తో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. చివరకు ఆ దేశ నేషనల్ క్రికెట్ టీమ్‌లో చోటు సాధించాడు. ప్రస్తుతం ఆ దేశం తరఫున వల్లెటా కప్ టీ-20 మ్యాచ్‌లు ఆడుతున్నాడు.

అమ్మా-నాన్నా బ‌తికుంటే బావుండేది: భవానీ ప్రసాద్
ఐటీ ఉద్యోగిగా హంగేరిలో స్థిరపడి, ఆ దేశం తరఫున క్రికెట్ ఆడుతున్న భవానీ ప్రసాద్.. ఈ సమయంలో తన తల్లిదండ్రులు బ్రతికుంటే ఎంతో సంతోషించేవారని అంటున్నాడు. 2017లో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన భవానీ ప్రసాద్‌కు ఒక సోదరి, సోదరుడు ఉన్నారు. ఇద్దరూ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ముగ్గురినీ చదివించడానికి ఎంతో కష్టపడ్డ తల్లిదండ్రులు, తామంతా స్థిరపడ్డ సమయంలో లేకుండా పోయారని ఆవేదన చెందుతున్నారు. హంగేరి తరఫున క్రికెట్ ఆడడం చాలా సంతోషంగా ఉందని, అయితే భారత్ తరఫున ఆడే అవకాశం వస్తే ఇంకా ఎక్కువ సంతోషిస్తానని భవానీ ప్రసాద్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement