Thursday, May 2, 2024

చిన్నారికి అరుదైన వ్యాధి.. రూ.11కోట్లు విరాళ‌మిచ్చిన అజ్ఞాత‌వ్య‌క్తి

ఓ చిన్నారి అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఓ చిన్నారికి రూ.11కోట్లు విరాళంగా ఇచ్చి పెద్ద మ‌న‌సు చాటుకున్నాడు ఓ వ్య‌క్తి.
విదేశాల్లో ఉంటున్న అతను తనకు సంబంధించిన ఎలాంటి వివరాలు అందజేయకుండానే పెద్ద మొత్తంలో నగదును సాయంగా అందించారు. కేరళ రాష్ట్రం ఎర్నాకుళానికి చెందిన సారంగ్ మేనన్ , అదిథి దంపతుల 16 నెలల కుమారుడు నిర్వాణ్ పుట్టిన 15 నెలల తర్వాత కూడా కాళ్లు కదపలేదు. వైద్యులకు చూపించగా నిర్వాణ్‌కు ‘స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోఫీ టైప్‌-2 వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. అరుదైన ఈ వ్యాధికి రెండేళ్లు నిండకుండా కొన్ని రకాల ఔషధాలు వాడితేనే చికిత్సకు వీలవుతుందని వైద్యులు సూచించారు. ఈ ఔషధాలను అమెరికా నుంచి తెప్పించాల్సి ఉంటుంది. అందుకు సుమారుగా రూ.17.5 కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. బాబుకు చికిత్స చేయించేందుకు అవసరమైన సొమ్ము లేకపోవడంతో తమ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిర్వాణ్ తల్లిదండ్రులు ఆర్థిక సహాయం కోసం క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించారు. దీంతో పలువురు దాతలు బాబు ఖాతాలోకి విరాళాలను జమ చేయడం మొదలు పెట్టారు.

ఫిబ్రవరి 19వ తేదీ వరకు ఖాతాలో రూ.5.42 కోట్లు మాత్రమే జమయ్యాయి. ఫిబ్రవరి 20కి అది రూ.16 కోట్లు దాటింది. పేరు కూడా చెప్పకుండా విదేశాల్లో ఉన్న ఓ వ్యక్తి ఏకంగా రూ.11 కోట్లు జమ చేశారు. ఈ విషయాన్ని నిర్వాణ్‌ తల్లిదండ్రులు సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తూ సంతోషం వ్యక్త చేశారు. ఈ భారీ విరాళంతో సారంగ్‌ దంపతుల ఆర్థిక కష్టాలు తీరినట్టైంది. మరో రూ.80లక్షలు వస్తే నిర్వాణ్‌ చికిత్సకు సరిపడా డబ్బులు సమకూరినట్టే. స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రాఫీ టైప్‌-2 అనేది జన్యు పరమైన వ్యాధి. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన వ్యాధి. కండరాలు బలహీనంగా ఉండటం, శరీరంలోని ఏదో ఒక అవయవంలో కదలికలు లేకపోవడం దీని ప్రధాన లక్షణం. చికిత్స తీసుకోకుంటే అనారోగ్యం తీవ్రమై మంచానికే పరిమితమవ్వాల్సి ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాలు కూడా దక్కవు. అయితే, ఈ వ్యాధికి చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నది. ఈ వ్యాధిని నయం చేయాలంటే నొవార్టిస్ ఫార్మా తయారు చేసిన రూ.16 కోట్లు ఖరీదైన జొల్జెన్‌స్మా ఇంజక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది‌. ప్రపంచంలోనే ఇది అత్యంత ఖరీదైన ఔషధం. ఇది మనదేశంలో దొరకదు. విదేశాల నుంచి తెప్పించుకోవాల్సి ఉంటుంది. అయితే బిడ్డ పుట్టిన రెండేళ్ల లోపే దీన్ని తీసుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement