Wednesday, May 1, 2024

Spl Story | కూరగాయలకు కేరాఫ్​ రంగారెడ్డి జిల్లా.. మహానగరానికి పెద్ద ఎత్తున సప్లయ్​!

 ‘‘అమ్మా ఇవ్వాల ఏం కూర వండావే’’ అంటూ అడిగింది లావణ్య.. ‘‘ఆకుకూర పప్పు, బీరకాయ వేపుడు, అందులో నంజుకోవడానికి బీన్స్​ ఫ్రై చేశా’’ అంటూ చెప్పింది సత్యవతి.. ఇలాంటి సన్నివేశాలు రోజూ ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంటాయి.. అయితే, మనం తినే కంచంలోకి వేడివేడిగా వండి వార్చే కూరగాయలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? ఇంటి దగ్గర్లోనో, వారం వారం నిర్వహించే సంతలోనే కొనుగోలు చేసే కూరగాయలు, ఆకు కూరలన్నీ ఎక్కడి నుంచి తెస్తారనే విషయం మీ మదిలో ఎప్పుడో ఓసారి మెదిలో ఉంటుంది. అయితే.. దీనికి సమాధానం దొరక్క సతమతమయ్యేవారికి ఈ కథనం వారి సందేహాలను నివృత్తి చేస్తుంది. ఘుమఘుమలాడే వంటకాలతో మన ప్లేట్​లోకి వండి వార్చే ఈ కూరలన్నీ ఎక్కవగా రంగారెడ్డి, వికారాబాద్​, సంగారెడ్డి జిల్లాల్లోని గ్రామాలలో పండిస్తారు. మన హైదరాబాద్​ మహానగర ప్రజల అవసరాలను తీర్చేందుకు పరిసర ప్రాంతాల్లోనే పండించి సిటీకి సప్లయ్​ చేస్తుంటారు.

– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ

హైదరాబాద్​ మహానగరానికి పక్కనే ఉన్న రంగారెడ్డిలో ఏటా 34 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో 28 వేల ఎకరాల్లో కూరగాయల పంటలు సాగవుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో 20 వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తుండగా.. 25 వేల మెట్రిక్ టన్నుల దిగుబడులు వస్తున్నాయి. ఇక.. సంగారెడ్డిలో 12వేల ఎకరాల్లో కూరగాయల పంటలు పండిస్తుంటే.. 13 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోంది.

ఉద్యానవన శాఖ అధికారులు తెలిపిన లెక్కల ప్రకారం.. ప్రస్తుతం రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 74,000 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగులో ఉన్నాయి. హైదరాబాద్ మహానగరం అవసరాలను తీర్చాలంటే ఈ పంటలు ఏమాత్రం చాలడం లేదు. ప్రస్తుతం 1.51 లక్షల ఎకరాల్లోనే కూరగాయల పంటలు సాగులో ఉన్నాయి. కానీ, మహానగర ప్రజలకు సరిపడా ఆకుకూరలు, కూరగాయలు కావాలంటే ఇంకా పెద్దమొత్తంలో పంటలు పండిచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత డిమాండ్, సప్లయ్​కి మధ్య దాదాపు 50శాతం తేడా ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈ అంతరాన్ని పూడ్చేందుకు క‌ర్నాట‌క, ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి..

ఉద్యానశాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటోంది..

- Advertisement -

కూరగాయల పంటల దిగుబడులను పెంచేందుకు ఉద్యానవన శాఖ జీడిమెట్ల, సిద్దిపేట జిల్లా ములుగు ప్రాంతాల్లోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కేంద్రాల ద్వారా రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీని ద్వారా కూరగాయల పంటలు పెంచేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు, రైతుల అభ్యర్థనలతో నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయడంలో రైతులకు సహాయం చేయడానికి శాఖ రైతులకు 5,000 నుండి 10,000 నాణ్యమైన.. వ్యాధి రహిత మొక్కలను కూడా సరఫరా చేస్తోంది.

కూరగాయల పంటలు సాగయ్యేది ఎక్కడంటే..

రంగారెడ్డి జిల్లాలోని యాచారం, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్‌నగర్‌ ప్రాంతాల్లో అత్యధికంగా కూరగాయల తోట‌లు సాగవుతున్నాయి. అట్లనే ప్రస్తుతం రంగారెడ్డితో పాటు రాష్ట్రవ్యాప్తంగా 80 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. అదేవిధంగా 30 వేల ఎకరాల్లో పూల తోట‌లు సాగు కావాల్సి ఉండగా 10 వేల ఎకరాల్లో మాత్రమే సాగులో ఉన్నాయి.  అధికారిక సమాచారం ప్రకారం.. ఉద్యానవన శాఖ రాష్ట్ర మొత్తం స్థూల విలువ జోడింపు (GVA)కి 38 శాతం (రూ. 28,160 కోట్లు) అందించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సహకారం అందించింది. ఇక్కడ పండించే కూరగాయల పంటలలో కూరగాయలు, పొట్లకాయలు, బీన్స్, ఆకు కూరలు, దుంప‌లు వంటి ఇతర రకాల కూరగాయలు కూడా ఉన్నాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement