Sunday, April 28, 2024

Followup: వరి సహా 17 పంటల కనీస మద్ధతు ధర పెంపు.. కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వరి ధాన్యం సహా పప్పు దినుసులు, నూనె గింజలతో కూడిన మొత్తం 17 పంటల కనీస మద్ధతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ ఖరీఫ్‌ పంటల మార్కెట్‌ సీజన్‌ 2022-23లో కనీస మద్దతు ధరలకు ఆమోదం తెలిపింది. ఆయా పంటలు పండించిన అన్నదాతలకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు పంట మార్పిడి, పంటల వైవిధ్యం దిశగా వారిని ప్రోత్సహించడంలో భాగంగా ఖరీఫ్‌ పంటలకు కనీస మద్ధతు ధరను పెంచింది. వ్యవసాయ కూలీలు, మడక/కూలీ/యంత్రాల కిరాయి, కౌలు కింద భూమికి చెల్లించిన అద్దె, విత్తనాలు, ఎరువులు, కంపోస్టు, నీటిపారుదల రుసుములు వంటి వస్తుపరమైన ఉత్పాదకాల వినియోగ వ్యయంతో పాటు పరికరాలు, వ్యవసాయ భవనాలపై తరుగుదల, నిర్వహణ మూలధనంపై వడ్డీ, పంపు సెట్ల నిర్వహణకు డీజిల్ లేదా విద్యుత్ ఖర్చు తదితరాలు, కుటుంబ శ్రమ విలువను కూడా లెక్కించిన ప్రభుత్వం ఆ మేరకు కనీస మద్ధతు ధరను నిర్ణయించింది.

ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం అధికంగా రైతుకు గిట్టుబాటు కలిగేలా కనీస మద్ధతు ధరను లెక్కించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. సజ్జలు, కందులు, మినములు, సన్‌ఫ్లవర్‌ గింజలు, సోయాబీన్స్‌, వేరుసెనగ పంటలకు కనీస మద్ధతు ధర ఉత్పత్తి వ్యయం కంటే 50 శాతం కన్నా ఎక్కువగా ఉండడం గమనార్హం. పెరిగిన ధరల ప్రకారం ఉత్పత్తి వ్యయంపై సజ్జలు (85%), కందులు (60%), మినములు (59%), సన్‌ఫ్లవర్‌ గింజలు (56%), సోయాబీన్స్‌ (53%), వేరుసెనగ (51%) మేర కనీస మద్ధతు ధర నిర్ణయించినట్టు కేంద్రం తెలిపింది. దేశీయ అవసరాలకు సరిపడినంత నూనె గింజలు, పప్పు దినుసుల ఉత్పత్తి లేకపోవడంతో దిగుమతులపై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు వరి, గోధుమ వంటి పంటలు విషయంలో అవసరాన్ని మించి దిగుబడి వస్తోంది. దేశంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 314.51 మిలియన్ టన్నులుగా ఉంటుందని అంచనాలున్నాయి.

ఇది 2020-21నాటి ఆహార ధాన్యాల ఉత్పత్తి కన్నా 3.77 మిలియన్ టన్నులు అధికం. ఈ నేపథ్యంలో గడచిన ఐదేళ్లలో ఆహారధాన్యాల సగటు ఉత్పత్తికన్నా 2021-22లో ఉత్పత్తి 23.80 మిలియన్ టన్నులు ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. ఆహార ధాన్యాల విషయంలో మిగులు నిల్వలున్నా.. నూనె గింజలు, పప్పు దినుసులు, తృణధాన్యాల విషయంలో దిగుమతుల కారణంగా వాణిజ్య లోటు ఏర్పడుతోంది. దీంతో పంటమార్పిడి, పంటల వైవిధ్యంపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు వరుసగా సూచనలు చేస్తోంది. ఈ క్రమంలో రైతులను సైతం ఆ దిశగా ప్రోత్సహించేందుకు నూనె గింజలు, పప్పుధాన్యాలు, ముతక తృణధాన్యాలకు అనువైన రీతిలో కనీస మద్ధతు ధరను సవరించింది. ఈ పంటల సాగు విస్తీర్ణం పెంచేవిధంగా రైతులను ప్రోత్సహించడంతోపాటు మెరుగైన సాంకేతికత పరిజ్ఞానం, వ్యవసాయ పద్ధతులు అనుసరించేలా చేయడం సహా డిమాండ్-సరఫరాలో సమతుల్యత, స్వయం సమృద్ధి సాధించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement