Sunday, May 5, 2024

Bharat Jodo Day 35: ఉద్యోగాలను అమ్ముకోవడంలో డబుల్​ ఇంజిన్​ సర్కారు బిజీ.. కర్నాటక ప్రభుత్వంపై రాహుల్​ ఫైర్​

కాంగ్రెస్​ పార్టీ ముఖ్యనేత రాహుల్​ గాంధీ చేపట్టిన పాదయాత్ర ఇవ్వాల్టితో (బుధవారం) 35 రోజులకు చేరింది. ఇవ్వాల కర్నాటక రాష్ట్రంలోని చల్లకెరె పట్టణం నుంచి ప్రారంభమైన యాత్ర హీరేహళ్లికి చేరుతుంది. కాగా, ఈ యాత్రలో పలువురు నిరుద్యోగులు, యువకులు రాహుల్​గాంధీతో కలిసి యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి మంచి, చెడ్డలను కనుక్కున్న రాహుల్​ కర్నాటక ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.

కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉద్యోగాలను అమ్ముకుంటోందని ఆరోపించారు రాహుల్​ గాంధీ. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు యువత భవిష్యత్తును నాశనం చేస్తోందన్నారు. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని, అందుకే నిరుద్యోగంతో చాలామంది యువకులు బాధపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వం యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా.. ఉద్యోగాలను అమ్ముకోవడంలో బిజీగా ఉందని విమర్శించారు.

కాగా, రాహుల్​ గాంధీ ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రం కర్నాటకలో యాత్ర కొనసాగిస్తున్నారు. అంతకుముందు కేరళ, తమిళనాడు మీదుగా యాత్ర సాగింది. ఇక.. కర్నాటక రాష్ట్రంలోకి అడుగుపెట్టకముందే రాహుల్​ పాదయాత్ర వివాదాలతో చెలరేగింది. రాహుల్​ కర్నాటకలో ప్రవేశించడానికి ఒకరోజు ముందు కాంగ్రెస్ నేతలకు స్వాగతం పలుకడానికి తీసుకొచ్చిన పోస్టర్లను బీజేపీ కార్యకర్తులు చింపేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ కార్యకర్తలు బళ్లారిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్‌ పాలకులకు వ్యతిరేకంగా కాంగ్రెస్​ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement