Saturday, April 27, 2024

Telangana | ప్రధాని, ఓ కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనేనా?.. ఇదేనా పద్ధతి: సీఎం కేసీఆర్‌ ఆగ్రహం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ‘‘కేసీఆర్‌ నీ ప్రభుత్వాన్ని కూలదోస్తా”నని అంటున్నారని, దీన్ని ఏమనాలని? ఎలా అర్థం చేసుకోవాలని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌ ఎంవీఎస్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఇవ్వాల (ఆదివారం) జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై సీఎం కేసీఆర్​ ధ్వజమెత్తారు. ‘మనకు ఉన్న మంచినీళ్ల పథకం ఉన్నట్టు పక్కనే బోర్డర్‌లో ఉన్న కర్నాటకలో ఉందా? ఏం జరుగుతుంది? ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో తాగేందుకు నీళ్లు లేవు. గుజరాత్‌లో 24 గంటల కరెంటు ఉండదు.

ఇట్లా చెప్పుకుంట పోతే సిగ్గుపోతది.. 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత ఇన్ని డంబాచారాలు.. ఇన్ని ప్రచారాలు, ఇన్ని ఈస్ట్‌మన్‌ కలర్‌ ఫోజులు.. ఇన్ని చెబితే.. దేశ రాజధాని ఢిల్లీలో కరెంటు కొరత, కరెంటు కోతలు, మంచినీళ్లు రావ్‌. రోజుకు నాలుగు ఐదు ట్యాంకర్ల కొనుకుంటున్నట్లు మిత్రులు చెబుతున్నరు. ఎందువల్ల? ఇంత కొత్త రాష్ట్రం, నిన్న మొన్నటి వరకు గరీబైన తెలంగాణలో అయిన పని పక్కన కర్నాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో ఎందుకు అవుతలేదు. అక్కడ మంత్రులు, ముఖ్యమంత్రులు లేరా? మాట్లాడేటోళ్లు లేరు? ఒక్కో మాట యాదికి వస్తే మనది మనకే భయమైతది’ అన్నారు.

ఎందుకు ప్రభుత్వాన్ని కూలగొడుతవ్‌?
‘ఎరువు బస్తాలు కావాలంటే ఇవ్వలే ఆ రోజు. అన్ని పరిస్థితులు అధిగమించి అద్భుతంగా ముందుకుపోతున్నం. దీన్ని చూసి స్పందించడంపోయి దీనిమీద కన్నెరపెట్టుకొని, కట్టెపెట్టాలే.. అడ్డంపడాలే.. వచ్చే పైసలు రాకుంటే చేయాలే.. నిధులు ఆపాలి.. ఎఫ్‌ఆర్‌బీఎం మీద కోతలుపెట్టాలే.. ప్రగతిని అడ్డుకోవాలే.. ఇది మంచిదేనా? చేయదగ్గదేనా? నేను సందర్భం వచ్చిన సందర్భంలో చెబుతా ఉంటా.. ఈడ కాదు గద్వాల కాడ పెడుతాంటే. గద్వాల మనది కాదా? అచ్చంపేట మనది కాదా? అని మాట్లాడుతాం. ప్రతి ఇంచు మనదే కాదా? ప్రతి మనిషి మనవాడే కదా? ఎవరైనా బాగుపడాలి అని చెబుతాం. ఓ రాష్ట్రం బాగుపడితే దానికి అడ్డం పడుతారా? ప్రధాని, ఓ కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనేనా? పనికిమాలిన అడ్డం కాలు పెట్టి.. మేం పని చేయం. మిమ్మల్ని చేయనివ్వం. ఎవరైనా ఎదురుమాట్లాడితే మీ రాష్ట్ర ప్రభుత్వాలు కూలగొడుతాం. ఇదా? ఇదేనా పద్ధతి ? ప్రధానమంత్రి స్వయంగా కేసీఆర్‌ నీ ప్రభుత్వాన్ని కూలగొడుతా అని అంటే ఏమన్నట్టు.. ఏం అర్థం చేసుకోవాలి.

మీరు గెలిచినట్టు మేం గెలువలేదా? మాకు ప్రజలు ఓట్లు వేయలేదా? ఏ కారణం చేత ప్రభుత్వం కూలగొడుతవ్‌. బెంగాల్‌కు పోయి మమతా బెనర్జీ నా పార్టీకి చెందిన 40 మంది నాతో టచ్‌లో ఉన్నారని ఏ ప్రధానమంత్రైనా చెప్పవచ్చునా? ఈ భారతదేశమైనా? దీని కోసమేనా మనం కలలుగన్నది. ఆ నాడు మహాత్ముడు, అనేకమంది స్వతంత్ర సమరయోధులు ఉరికంబాలెక్కి స్వతంత్రం తెచ్చింది ఈ దిక్కుమాలిన రాజకీయాలకోసమేనా ? దీనిపై ఆలోచన చేయాలి’ అని పిలుపునిచ్చారు.

- Advertisement -

ప్రజలకు మంచి చేయడం చేతుకాదు కానీ..
‘ప్రజలకు మంచి చేసే ఆలోచన లేదు. సాగునీరివ్వ చేతకాదు. నీళ్లివ్వ శాతకాదు. ఆర్థికంగా అభివృద్ధి చేయడం చేతుకాదు. పేదలను ఆదుకోవడం చేతకాదు. ఉద్యోగాలివ్వడం చేతకాదు. ఉన్నవన్ని ప్రైవేటు కార్పొరేట్‌ గద్దలకు అమ్మేయాలి?.. ఇదేనా దేశం. ఈ దేశమైనా మనం కోరుకున్నది. విద్యావంతులు, యువకులు ఎక్కడివారక్కడ ఆలోచించకపోతే మనం దెబ్బతింటాం.. ఆగమైపోతామ్‌. ఎవరో చిల్లరగాళ్లు.. రాజకీయాల కోసం అవలంభించే చిల్లర ఎత్తుగడలను ప్రజలు అప్రమత్తంగా ఉండి గమనించాలి. గమనించకపోతే, అర్థమై సీరియస్‌గా తీసుకోకపోతే అందరి బతుకులు ఆగమైతయ్‌. ఒక వ్యక్తి, పార్టీ కోసం కాదు నేను చెప్పేది.

ఈ భారతదేశ సమాజం జాతి జీవనాడి ఈనాడు కలుషితం చేయబడుతున్నది. చిల్లర రాజకీయ లక్ష్యం కోసం ఉన్మాదాన్ని రెచ్చగొట్టి.. ప్రజల మధ్య చీలికలు తెచ్చి, విద్వేషాలు రెచ్చగొట్టి, అబద్ధాల ఒరవడి సృష్టించి.. మంచి మేలైనా నాయకులను ఇబ్బందులు పెట్టి, ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయించి దౌర్జన్యపూరితమైన దుర్మాగమైన విధానం జరుగుతున్నది. ఎక్కడో ఒకాడ బెబ్బులిలా పంజా లేవాలి.. దెబ్బ కొట్టాలి. మొన్న హైదరాబాద్‌కు వచ్చారు దొంగలు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను చీల్చి.. ఇక్కడ పుల్లబెట్టి, అస్థిరపరిచి కిందమీద చేస్తామని వస్తే దొరకబట్టి జైలులో వేశాం. ఎక్కడో దేశంలో తిరుగుబాటు ప్రారంభం కావాలి. ఆ తిరుగుబాటు చేయకపోతే, ప్రతిఘటించకపోతే, ఆ నాడు మనం కొట్లాడక పోతే మనకు తెలంగాణ రాకపోవు. మన గతి గట్లనే ఉంటుండే. గాంధీతో కలిసి లక్షల మంది స్వతంత్ర సమరయోధులు పోరాటం చేసి ఉండకపోతే ఇవాళ్టికి మనం బానిసలుగా ఉండేవాళ్లం. చుట్టు ఏం జరుగుతుందో తెలుసుకొని ముందుకు వెళ్లాలి’ అని పిలుపునిచ్చారు.

నీళ్లివ్వమంటే చేతకాదు..
‘కష్ణా నీళ్వివడం చేతకాదు. పాలమూరులో వాల్మీకి బోయలు ఎప్పటి నుంచో మమ్ముల్ని ఎస్సీల్లో కలుపాలని
అడిగారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. ఏడేళ్లు గడుస్తుంది. హరీ లేదు శివా లేదు. ఏడేళ్లు చాలదా? మళ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపి నిలదీస్తాం. పాలమూరు జిల్లా వెనుకబడిన జిల్లా ఇప్పుడిప్పుడే తేటపడుతుంది. ఇంకా అభివృద్ధి కావాల్సి ఉంది. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90శాతం పూర్తయ్యాయి. కొన్ని చిన్నచిన్న ఆటంకాలు ఈ జిల్లాలో పుట్టిన దరిద్రులే కల్పిస్తున్నారు. వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తున్నాం. వాటిని పూర్తి త్వరలోనే కాలువ పనులు మొదలు పెడుతాం. పాలమూరు ఎంపీగా గెలిపించి.. ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించాను కాబట్టి ప్రత్యేక అభిమానంతో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు రూ.222కోట్లు మంజూరు చేస్తున్నాం. దళితబంధు అమలు చేసుకోవాలి. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఎంపిక చేయమన్నాం.. అధేవిధంగా ముందుకెళ్తాం. రూ.3లక్షలు ఇచ్చి ఇండ్లు కట్టిస్తామని చెప్పాం.. వాటిని కూడా వెంటనే రాబోయే 10, 15 రోజుల్లోనే ఇండ్లను మంజూరు చేస్తాం’ అన్నారు.

బీఆర్‌ఎస్‌కు పోదామా..?
‘పాలమూరు ప్రత్యేకంగా నియోజకవర్గానికి వెయ్యి ఇండ్లను అదనంగా మంజూరు చేస్తాం. అందరం కలిసి వెనుకబాటు తనాన్ని తరిమేద్దాం. అద్భుతమైన పాలమూరును పచ్చటి పంట పొలాలు, ఐదు మెడికల్‌ కాలేజీలు, అనేక వసతులతో తయారు చేసుకుందాం. నేను మీతో ఉంటాను.. మీరు నాతో ఉండాలి, ఆశీర్వదించాలి. అందరం కలిసి అద్భుతమైన పాలమూరును నిర్మించుకోవాలి. తెలంగాణ ఎంతో కొంత బాగుపడే లైన్‌పట్టినం. మనం ఒక్కళం బాగుపడితే కాదు.. దేశం బాగుపడాలి. ఖచ్చితంగా తెలంగాణ తరఫున, మన అందరి తరఫున జాతీయ రాజకీయాల్లో చురుకైనా పాత్ర వహించాలి. బీఆర్‌ఎస్‌కు పోదామా? అని చెప్పగా పోదామని జనం నినదించారు. ఖచ్చితంగా తెలంగాణలా భారతదేశాన్ని తయారు చేసేందుకు భగవంతుడు ఇచ్చిన సర్వశక్తులు ఒడ్డి ముందుకుపోదాం. జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేద్దాం. అద్భుతమైన భారతదేశానికి తెలంగాణ గడ్డ నుంచే పునాదాలు వేసి.. మన పేరు బంగారు అక్షరాలతో ముందుకుపోదాం’ అని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement