Thursday, May 2, 2024

మెడికల్‌ సీట్ల బ్లాకింగ్‌పై పోలీస్‌ విచారణ.. మట్టేవాడ పీఎస్‌లో కేసు నమోదు

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మెడికల్‌ పీజీ సీట్ల బ్లాక్‌ దందాపై పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. మెడికల్‌ పీజీ సీట్ల బ్లాకింగ్‌పై ఆంధ్రప్రభలో గత నాలుగు రోజులుగా వరుస కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్‌ కళాశాలలు ఇతర రాష్ట్రాలకు చెందిన ర్యాంకులు సాధించిన విద్యార్థులతో దరఖాస్తులు చేయించడం, వారు జాయిన్‌ కాకపోవడంతో మిగులు సీట్లను యాజమాన్యాలే కోట్ల రూపాయలకు విక్రయిస్తున్నారనే విషయాన్ని ఆంధ్రప్రభ వెలుగులోకి తెచ్చింది… తొలుత ఈనెల 9న పీజీ మెడికల్‌ మాప్‌ ఆప్‌ కౌన్సెలింగ్‌లో సీట్ల బ్లాకింగ్‌ జరిగిన అంశాన్ని ఆంధ్రప్రభ వెలుగులోకి తీసుకొచ్చింది.. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు జోక్యం చేసుకొని సీట్ల బ్లాకింగ్‌పై అవసరమైతే పోలీసులచే విచారణ జరిపించాలని, సీట్లను భర్తీ చేసే వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్యవిశ్వవిద్యాలయం అధికారులకు సూచించారు. చివరి విడత మాప్‌ ఆప్‌ కౌన్సెలింగ్‌లో కొన్ని ప్రైవేట్‌ కళాశాలలు, ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులచేత దర ఖాస్తులు చేయించుకున్న విషయాన్ని గుర్తించిన యూనివర్సిటీ సంబంధిత విద్యార్థులకు నోటిఫికేషన్లు జారీ చేసింది. వారి నుండి స్పందన రాకపోవడంతో యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ దేవలపల్లి ప్రవీణ్‌కుమార్‌ సోమవారం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌జోషికి ఫిర్యాదు చేశారు. గత రెండు రోజులుగా ఎంబీబీఎస్‌, పీజీ మెడికల్‌ సీట్ల అమ్మకాలపై ఆంధ్రప్రభలో ప్రచురితమైన కథనాలకు స్పందించిన రాష్ట్ర గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌ తక్షణమే విచారణ చేసి నివేదిక సమర్పించాలని యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ కర్ణాకర్‌రెడ్డిని ఆదేశించారు.

మరోవైపు సీపీ సూచనల మేరకు యూనివర్సిటీ పరిధిలోకి వచ్చే వరంగల్‌ మట్టేవాడ పోలీస్‌స్టేషన్‌లోరిజిస్ట్రార్‌ డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు మట్టేవాడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల కోసం దరఖాస్తు చేసి సీటువచ్చినా… కళాశాలలో చేరని అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని రిజిస్ట్రార్‌ పోలీస్‌ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని మట్టేవాడ సీఐ రమేష్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement