Sunday, May 19, 2024

బీజేపీ కురువృద్ధుడి పుట్టిన రోజు.. అద్వానీని కలిసిన ప్రధాని

బీజేపీ కురువృద్ధుడు ఎల్.కే అద్వానీని ప్రధాని మోదీ కలిశారు. అద్వానీ నేడు 94వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు బీజేపీ కీలక నేతలంతా ఆయన నివాసానికి వచ్చారు. ప్రధాని మోదీ సహా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు అద్వానీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, దేశానికి స్వాతంత్య్రం రాకముందు పాకిస్తాన్‌లోని కరాచీలో 1927లో జన్మించారు. స్వాతంత్ర్యం సందర్భంగా దేశం విడిపోయినప్పుడు ఆయన కుటుంబం కరాచీ నుంచి భారత్ కు తరలి వచ్చింది.  భారతీయ జనతా పార్టీ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆయన, 1998 నుండి 2004 వరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో హోం వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో 2002 నుండి 2004 వరకు అద్వానీ భారతదేశానికి ఏడవ ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు.

మరోవైపు అద్వానీకి ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘గౌరవనీయులైన అద్వానీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్షుతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. దేశ ప్రజలను చైతన్యపరచడంలో, మన సంస్కృతి విస్తరింపజేయడంలో ఆయన చేసిన కృషి చాలా గొప్పది. ఆయన మేధో సంపత్తి ఎంతో గర్వించదగినది’ అని మోదీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement