Monday, April 29, 2024

తిరుపతికి ‘వకీల్ సాబ్’!

ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగే ఉపఎన్నికపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. గెలుపుకోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీలను గట్టిపోటీ ఇచ్చేందుకు జనసేన-బీజేపీ కూటమి కూడా పావులు కదుపుతోంది. ఇప్పటికే రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభతో పాటు ముఖ్యనేతలంతా తిరుపతిలో మకాం వేసి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు రంగంలోకి దిగబోతున్నారు. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధి రత్నప్రభకి మద్దతుగా తిరుపతి నగరంలోని ఎమ్.ఆర్.పల్లి సర్కిల్ నుంచి ఏఐఆర్ బైపాస్ మీదుగా శంకరంబాడి సర్కిల్ వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. పవన్ రాకతో తిరుపతి పోరు మరింత రసవత్తరంగా మారనుంది. పవన్ పర్యటన అటు జనసైనికుల్లోనూ జోష్ నింపనుంది. జనసేనాని టూర్ తమకు కలిసొస్తుందని బీజేపీ కూడా భావిస్తోంది.

మధ్యాహ్నం మూడు గంటలకు పవన్ పాదయాత్రతో ప్రచారం ప్రారంభమవుతుంది. ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభకు మద్దతుగా తిరుపతి పట్టణంలోని ఎంఆర్ పల్లి సర్కిల్ నుంచి ఏఐఆర్ బైపాస్ మీదుగా శంకరంబాడి సర్కిల్ వరకు పవన్ పాదయాత్ర సాగుతుంది. పాదయాత్ర అనంతరం శంకరంబాడి సర్కిల్ వద్ద భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడే అవకాశం ఉంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పవన్.. తాజాగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలపై మండిపడ్డారు. అంతేకాదు నిన్న ఎస్ఈసీ నీలం సాహ్నీ నిర్వహించిన సమావేశాన్ని కూడా బహిష్కరించింది.

మరోవైపు తిరుపతిలో పవన్ కు ఘనస్వాగతం పలికేందుకు స్థానిక నాయకులు, కార్యకర్తలతో పాటు రాయలసీమ నాలుగు జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పవన్ కల్యాణ్ పర్యటనను విజయవంతం చేసేందుకు జనసేనతో పాటు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు.

బీజేపీ అభ్యర్థి నామినేషన్ వేసినరోజే ‘వకీల్ సాబ్’ ట్రైలర్ విడుదల ద్వారా పవన్ సత్తాచాటుకునే ప్రయత్నం చేయడం రాజకీయంగానూ చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమిలో సీనియర్ భాగస్వామి జనసేన పార్టీనే అని, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థి అని బీజేపీ స్పష్టం చేసిన దరిమిలా తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో పవన్ ఎంట్రీ ఖరారైంది. ఆయనకు గ్రాండ్ వెల్కం పలికేందుకు బీజేపీ ఏకంగా కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement